విదేశీ హొయలు వెనుక విశాఖ వనిత

Google+ Pinterest LinkedIn Tumblr +

కోస్తాతీరంలోని విశాఖ జిల్లా అచ్యుతాపురం చుట్టూ ఉన్న గ్రామాలు పేదరికం ఎక్కువ. పొలంపనులపై పొట్టపోసుకునే వారు,రోజూకూలీకి వెడితే గానీ రోజు గడవని వారు అధికం. వారుంటున్న గ్రామం దాటి బయట ప్రపంచంలో ఉద్యోగాలు చేసుకునేవారు లేరు. పదో తరగతి దాటి పై చదువులు చదివిన వారు అంతంత మాత్రమే. చదువుకునే స్తోమతు లేకే ఈ పరిస్ధితి. మగవారు వ్యవసాయపనులకు పోతుంటే ఆడపిల్లలు కుట్లు అల్లిలు, లేదా పొలంలో కూలిపనులు ఇదీ వారి జీవన శైలి. ఇలాంటి బతుకుల్లో బ్రాండిక్స్‌ చిరు కిరణంలా ఉదయించింది. కనీసం 7వతరగతి చదివిన అమ్మాయిలందరికీ ఇక్కడ ఉపాధి కలిగింది. కాలం విలువ,బతుకును మరింత హుందాగా తీర్చిదిద్దుకునే అవకాశాలు వీరికి కలిగాయి.పెత్తందారుల వద్ద ఎండావానలో చెమటోడుస్తూ తలవంచుకొని కూలిపనులు చేసే స్థాయినుండి గౌరవంగా ఏసీ క్యాంపస్‌లో పరిశుభ్రమైన వాతావరణంలో పనిచేసుకునే అవకాశం ఏర్పడింది. 
విదేశీ హొయలు వెనుక విశాఖ వనితల శ్రమ 


విశాఖలోని దుస్తుల తయారీ పరిశ్రమ విశాఖ గ్రామీణ జీవన చిత్రాన్ని మార్చేసింది. ఇప్పటి వరకు స్టీల్‌ సిటీగా పేరొందిన విశాఖ నేడు టెక్స్‌టైల్‌ సిటీగా మారింది. ఇక్కడి పేదగ్రామీణ మహిళల చేతుల్లో తయారైన లోదుస్తులు అంతర్జాతీయమార్కెట్‌లో హాట్‌కేక్స్‌ … విశాఖ వనితలు కుట్టిన బ్రాలు,ప్యాంటీస్‌ విక్టోరియా సీక్రెట్‌ లేబుళ్లు తగిలించుకొని హాలీవుడ్‌ హీరోయిన్లకు కొత్త సొగసులు అద్దుతున్నాయి. 
ఆరోగ్యానికి అండగా ….
మడుకూరు గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి ఆర్ధిక స్ధోమతు లేక 9వ తరగతి చదివి ఆపేసింది. నాలుగేళ్ల క్రితం బ్రాండిక్‌లో ఉద్యోగం దొరికింది. కష్టించి పనిచేయడం వల్ల ఆమె ఇపుడు టెక్నిషియన్‌గా ఎదిగింది. ఇటీవలే తన పాపకు అనారోగ్యం కలగడంతో విశాఖలోని మణిపాల్‌ ఆసుపత్రిలో చేర్పించింది. పాప కోలుకోవడానికి దాదాపు అరవై వేల రూపాయలు ఖర్చయింది. ఇదంతా తను పనిచేస్తున్న కంపెనీకి వివరించి ఆసుపత్రి బిల్లులు సమర్పించడంతో బ్రాండిక్స్‌ యాజమాన్యం ఖర్చుమొత్తం ఇచ్చారు. ఇపుడు నాగమణి 
సంతోషంగా కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తోంది. ఇక్కడ పని చేస్తున్న 15వేల పేద అమ్మాయిల పరిస్ధితి నాగమణి జీవితానికి అటూ ఇటూ ఉంటుంది. మరికొందరి బతుకుల్లోకి తొంగి చూస్తే గుండెల్ని పిండేసే వాస్తవాలు… కానీ, వీరికి ఒక ఆర్ధిక అండ బ్రాండిక్స్‌ రూపంలో దొరికింది. పరిశ్రమల ఏర్పాటు వల్ల కొన్ని నష్టాలుండవచ్చు. వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవడం ఎలాగో బుద్ధి జీవులు ఆలోచించాలి. కానీ దిక్కుమొక్కు లేని ఆడపిల్లలకు ఈ బ్రాండిక్స్‌ వల్ల ఆత్మ స్ధ్యర్యం మాత్రం కలిగిందనేది కాదనలేని సత్యం. ఇపుడు వారు వెలుగు బాటలో అడుగులు వేస్తున్నారు.

Share.

Comments are closed.