‘అసురన్‌ ‘ ఒక సామాజిక కెరటం!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కథాకాలాన్ని పరిశీలిస్తే ఎట్రాసిటీ చట్టాలు లేని 1980ల కాలం నాటి కథగా అనిపిస్తోంది ఆ వాతావరణం, స్థితిగతుల్ని బట్టి.. ఇందులో ప్రధాన పాత్రలు మాట్లాడే భాష “యాడై” లాంటి పదాలతో అచ్చంగా తిరునల్వేలి, తూత్తుకుడి ప్రాంతాల్లో వినబడే నీలై తమిళ్ యాసే..

సింహభాగం నటులెవ్వరూ వెయ్యడానికి సాహసించని పాత్ర వేసిన నటుడు ధనుష్ & అతనికి సహకరించిన మంజూ వారియర్.. దర్శకుడు వెట్రిమారన్.. వీళ్లదే గొప్పతనం.. 

వెట్రిమారన్ అయితే this man has got balls really.. ఇతను తీసిన ‘విసారణై’ సినిమాకి పిచ్చ ఫ్యాను నేను.. వీలైనవాళ్ళు ఆ సినిమా కూడా చూడండి.. అసురన్ ఇంకా ఓ మెట్టు తక్కువే అనిపిస్తుంది దాంతో పోలిస్తే.. తీసిన కాసిన్ని సినిమాలు కళాఖండాలసలు..

తమ బతుకేదో తాము బతికే ఓ అణగారిన వర్గంలో కుటుంబానికి చెందిన కాసింత భూమిని లాక్కునే ప్రయత్నంలో పెద్ద కుటుంబానికెదురెళ్లిన కొడుకుని జైల్లో పెడితే, విడుదల కోసం తండ్రి ఒక్కొక్కరి కాళ్ళ మీద పడి క్షమాపణలడిగే సన్నివేశం చాలు..

దాంతో “ఇన్నేళ్లు నువ్వూ, నా అన్న కల్సి కష్టపడి సంపాదించుకున్న గౌరవం తీసిపడేశావ్..” అని భార్య ఏడుస్తుంటుంది..

“కొడుక్కి ఏవన్నా అయితే ఆ గౌరవంతో ఏం చేసుకుంటామే.. కొడుకు ముఖ్యంగానీ..” అని అతనింకా ఏడిపిస్తాడు..

సింహం పడుకున్నంత సేపూ వాటికూనలొచ్చి కళేబరాల్ని పీక్కు తింటూ వీరత్వం ప్రదర్శించేశామని తెగ గెంతులేస్తాయంట.. మేం కాబట్టి శవాల శరీరాల్ని చీల్చగలిగామని.. కానీ వాటికి తెలీదు.. ఆ కళేబరాన్ని వేటాడి తెచ్చింది ఆ లోపల పడుకున్న సింహమని..

అలా కొడుకుల భవిష్యత్ కోసం అన్నిటికీ తలొగ్గి, ఆఖరికి ఊరందరి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుక్కున్న ఒకానొక పేద తండ్రిని అతడి గతకాలపు ఘనమెంతో తెలీని ఇప్పటి ఉడుకురక్తపు టీనేజీ కొడుకు నానామాటలు అంటాడు.. “అసలు నీకు సిగ్గూ, శరం, రోషం ఏమీ లేవా.. ఇలాంటి పిరికి బతుకు బతికేకంటే చావడం మేలని.”

ఆ తర్వాత తన మీద ఎటాక్ చేసిన నరరూప రాక్షసుల్ని చీల్చిచెండాడిన తండ్రిని చూసి ఆ ఉక్రోషపు కొడుక్కి తత్వం బోధపడుతుంది..!!

తల్లితో ఓకే మాటంటాడు..

“నాన్న ఏంటమ్మా అంత భయంకరంగా ఉన్నాడు.. ??”

దానికి తల్లి సమాధానం..

“మీకంత ధైర్యం, కోపం ఎక్కడ్నుంచొచ్చాయనుకుంటున్నార్రా మరి.. ?? పడుకో ఇక..”

ఇదీ.. ఇంత సటిల్డ్గా ఎమోషన్లని పండిస్తే మనసుకి ఎందుకు గుచ్చుకోకుండా ఉంటుంది..??

వయసొచ్చిన ఆడపిల్లల్ని చెప్పులేసుకుందన్న పాపానికి వెనక నుంచి తన్నుతూ చెప్పుల్ని నెత్తిన పెట్టి నడిపిస్తే మన రక్తం ఎందుకు మరగదు.. ??

అలా ప్రతీ అయిదు నిముషాలకోసారి పిచ్చ ఎమోషనల్ కనెక్ట్ ఉంది మూవీలో.. కాబట్టే అంత క్లిక్కయ్యింది..

మన దగ్గర వెంకటేష్ లాంటి సీనియర్ నటులు దీన్ని రీమేక్ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి.. ఇలాంటి సినిమాలు చెయ్యాలంటే తమిళనాడు దాకా పోనక్కర్లేదు.. ఎప్పుడో మనం పుట్టకముందు 1985 జూలై17న వాళ్ళ సొంతూళ్ళో జరిగిన ‘కారంచేడు ఘటన’ చాలు.. ఇంతకంటే బ్లడ్ బాయిల్డ్ సినిమాలు 20 తీయొచ్చు..

ప్రస్తుతానికైతే అమెజాన్ ప్రైమ్లో తమిళ్ సినిమా ఉంది.. యే డిస్టర్బెన్సూ లేకుండా చూసెయ్యండి.. !!

  • Haribabu Maddukuri (Lives in Dubai, United Arab Emirates )
Share.

Leave A Reply