రూరల్‌మీడియా సర్వే నిజమైంది…

Google+ Pinterest LinkedIn Tumblr +

”ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. జగన్‌ వైపు జనం చూస్తున్నారు…” అని , రూరల్‌ మీడియా చేసిన సర్వేలో (3.3.2019) చెప్పిన ఫలితాలే నేటి ఫలితాల్లో ప్రతిబింభించాయి. మా సర్వేలో 102 సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని అంచనాలు వేస్తే, దానిని మించిన మెజార్టీని వై.ఎస్‌. జగన్‌ అందుకున్నారు. 
మార్పు వైపు, ఆంధ్రా ప్రజల చూపు..? 
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ‘ రూరల్‌ మీడియా’ ర్యాండమ్‌ సర్వేలో స్సష్టంగా తేలింది. 
ఫిబ్రవరి 3 నుండి మార్చి నెలాఖరు వరకు, 13 జిల్లాలో మారుమూల పల్లెల్లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రజల స్సందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. 
ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకుంటారు? అని ప్రజల ప్రైవసీలోకి వెళ్లకుండా, ప్రభుత్వ పనితీరు పై మాత్రమే అభిప్రాయాలు తెలుసుకొని, వారు ఏ పార్టీ వైపు ఉన్నారనేది అంచనా వేశాం. కొందరైతే డైరెక్టుగా తమ మద్దతు ఏ పార్టీకో తేల్చి చెప్పారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం కొంత  ఉన్నప్పటికీ, మిగతా అన్ని ప్రాంతాల్లో టీడీపీ,వైఎస్‌ఆర్‌సిపి మధ్యనే స్రధాప పోటీ ఉంది. 
సర్వే ఇలా సాగింది 
మీ నియోజక వర్గంలో అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఓటర్లు స్థానికంగా పోటీచేస్తున్న అభ్యర్థి గతంలో ప్రజా సమస్యలు పట్టించుకున్నారా? లేదా అని చూస్తామన్నారు. రాయల సీమ ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమని చెప్పారు . కోస్తాంధ్ర ప్రజలు అభ్యర్థుల పార్టీ గత చరిత్రచూస్తామన్నారు. ఈ కారణాలు ఇలా ఉంటే, పోలింగ్‌కి ముందు రోజు అభ్యర్థి పంచే డబ్బు,లిక్కర్‌, బహుమతులు కూడా ఓటర్ల పై ప్రభావం చూపుతాయని అధిక శాతం ప్రజలు ఒప్పుకున్నారు. 
ఎన్నికల ప్రచారంలో రెండు ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఈ సర్వేలో స్పష్టమైంది. 
ఆంధ్రవాళ్లను హైదరాబాద్‌లో కొడుతున్నారని జనసేన పదేపదే చేసిన ప్రచారానికి కూడా ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ” ఒక్క ఆంధ్ర పౌరుడన్నా ప్రాంతీయ వివక్షతో తమను కొట్టారని ఫిర్యాదు చేశారా? హైదరాబాద్‌లో దేశంలోని అన్నిరాష్ట్రాల ప్రజలతో పాటు, ఆంధ్రాలోని ప్రతీ జిల్లా నుండి కొందరు వెళ్లి జీవనోపాధి పొందుతున్నారు. రాజకీయాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషం రెచ్చకొడుతున్నారు..” అని అనకాపల్లికి చెందిన రూరల్‌ డెవలప్‌ మెంట్‌ సర్వీస్‌ సొసైటీ ప్రతినిధి బాలుగది అన్నారు. 
కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూనే, అమలు కాని వాగ్దానాలను, తీవ్రంగా పెరిగిన అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు తెచ్చిన చంద్రన్న బీమా, పంటకుంటల నిర్మాణం వంటి ప్రతిష్ఠాత్మక పథకాలకు విశేష స్సందన వచ్చింది. రాయల సీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. గుంటూరు,కృష్ణా జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ సథకాల పట్ల కొంత సానుకూలత ఉంది. 
పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ వర్గాల అభిప్రాయాల ఆధారంగా, ఈ అధ్యయనం జరిగింది. నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, రైతులు, గిరిజనులు స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు గ్రామీణ పాత్రికేయుల అభిప్రాయాలతో, ఈ సర్వే రూపొందించాం. ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలోని 5 నుంచి 8 గ్రామాల్లో ఈ అభిప్రాయ సేకరణ నిర్వహించాం. ఆదివాసీ కొండ ప్రాంతాల్లో విద్య,వైద్యం,విద్యుత్‌ అందక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ సర్వేలో రూరల్‌మీడియా టీం గుర్తించింది. 
ప్రభుత్వ వ్యతిరేక అంశాలు 
1, టీడీపీ,జనసేన పార్టీ నాయకులు ‘ఆంధ్రా వాళ్లను తెలంగాణా లో కొడుతున్నారు …” అని పదే పదే ప్రచారం చేయడం వల్ల, రాజకీయ స్వార్దం కోసం ఆ రెండు పార్టీలు రెండు తెలుగు రాస్ట్రాల మధ్య విధ్వేషాలు పెంచుతున్నారనే భావన విద్యావంతుల్లో 
తీవ్రంగా ఉంది. 
2,పార్వతీపురం,అరకు మన్యం ప్రాంతంలో ప్రాధమిక వైద్య సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం టూవీలర్‌ వెళ్లడానికి కూడా రహదారుల లేని గిరిజన పల్లెలు అనేకం ఉన్నాయి. రహదారుల నిర్మాణంలో ఐటీడీఏ పూర్తిగా విఫలం అయిందని అడవి బిడ్డలంటున్నారు. ప్రసవ వేధన పడుతున్న గర్భిణీ స్త్రీలను డోలీలో మోసుకొని రావడం సర్వసాధారణంగా మారడం ప్రభుత్వ వ్యతిరేకతను పెంచింది. 
3, రాష్ట్రంలో విద్యుత్‌ లేని కుగ్రామాల సంఖ్య రెండు వందలకు పైగా ఉన్నట్టు మా పరిశీలనలో తెలిసింది. ‘ కరెంట్‌ బల్బ్‌ ఎలా ఉంటుందో మాకు ఇప్పటి వరకు తెలీదు. సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌కి రెండు కిలోమీటర్లు పోవాలి. మా గ్రామం మీద తరుచూ ఏనుగులు దాడి చేస్తుంటాయి, అయినా అధికారులు మా వైపు చూడరు.” అని చిత్తూరు జిల్లా,మాధవరం కుయ్యవంక గ్రామస్తులు మాతో చెప్పారు. విశాఖ జిల్లా,పాడేరు ఏజెన్సీలో వందలాది కుటుంబాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. అలాంటి గ్రామాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే భావన ఉంది. 
4, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నైపుణ్యం 
ఉన్నవారికి కూడా ఉపాధి అవకాశాలు దొరకడం లేదని నెల్లూరు జిల్లా, తడ సమీపంలోని ఒక ఐటీఐ చదివిన నిరుద్యోగి మాతో అన్నారు. ”రాని ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బతుకు తెరువు కోసం మట్టిపనులు చేసుకొని బతుకుతున్నాం..” అని అరకు సమీపంలోని పెద్దలబుడు యువకుడు మాతో అన్నాడు. ఆ గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్నారు. 
5, వృద్దులు,వికలాంగులు, రైతులకు అందాల్సిన కొన్ని పథకాలలో జన్మభూమి కమిటీల జోక్యం ఎక్కువగా ఉందని, దానివల్ల లబ్దదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దాదాపు అన్ని ప్రాంతాల ప్రజల నుండి వస్తున్న ఆరోపణ. 
6, మారు మూల పల్లెల్లో ప్రాధమిక విద్యకు పిల్లలు దూరం అవుతున్నారు. గత ఐదేళ్లలో 11305 కిలో మీటర్లు గ్రామీణ రహదారులు వేసినట్టు ఉపాధి హామీ పథకంలో లెక్కలున్నప్పటికీ, సరైన రహదారులు లేవన డానికి ఉదాహరణ, విజయనగరం జిల్లా, బోరి గ్రామంలో పిల్లలు బడికి వెళ్లాలంటే కాలువలు ఈదుతూ వెళ్తున్న దృశ్యం రికార్డు చేశాం. 
7, రాష్ట్రవ్యాప్తంగా 87వేల కోట్లకు పైగా, రైతు రుణాలున్నాయి. వీటిలో 24వేల కోట్ల రుణాల్ని మాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మిగతా 63వేల కోట్ల రుణాల సంగతేంటి? ఐదేళ్లలో విడతలవారీగా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పిన టీడీపీ సర్కారు ఆ అంశాన్ని పట్టించుకోక పోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. 
ఎన్నికల సమీకరణలు 
ఓవరాల్‌గా తెలుగు దేశం,వైఎస్సార్‌ సీపీకి మధ్యే పోటీ ఉన్నప్పటికీ, జనసేన పార్టీ వామపక్షపార్టీలు, బీఎస్‌పీ తో ఒక కూటమిగా పోటీ చేయడం వల్ల వైసీపీ వైపు ఉండే దళిత ఓట్లు చీలే అవకాశం ఉంది. 2014లో బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేసింది. ఇపుడు విడిగా పోటీ చేయడం వల్ల తెలుగు దేశం ఓట్లు కొన్ని చీలి వైఎస్సార్‌సీపీకి పడే అవకాశం, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి పడే కాపు ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
” అసలు టీడీపీ మాకు పోటీనే కాదు, వైఎప్‌ఆర్‌సిపి నే మా ప్రత్యర్ది. గోదావరి జిల్లాల్లో అన్ని సీట్లు మావే, మా ఎన్నికల ప్రణాళికలోని, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌ బదులు నగదు, రైతులకు పెన్షన్‌ పథకాలే మాకు 50 శాతం సీట్ల తెచ్చి పెడతాయి..’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ,చిత్తూరు జిల్లా జనసేన లీగల్‌ సెల్‌ ప్రతినిధి కవిత ఆరని. 
పాత్రికేయులు, పరిశీలకులు ఏమంటారంటే..? 
……………………………………….. 
ప్రభుత్వం పై తీవ్ర వ్వతిరేకత.. 
” 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైనవి రైతు రుణమాఫీ,డ్వాక్రా రుణమాఫీ,నిరుద్యోగులకు భృతి. కానీ ఈ మూడు వాగ్దానాల్లో ఏవీ పూర్తి స్ధాయిలో నెరవేరక పోవడం వల్ల ఆయా వర్గాల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్వతిరేకత ఉంది. ఇది ఎన్నికల్లో వెల్లడవుతుంది” రాయల సీమకు చెందిన డెక్కన్‌ క్రానికల్‌ మాజీ పాత్రికేయుడు మాతో అన్నారు. 
సంక్షేమం ఒక అవకాశవాదం 
” చంద్రబాబు భాషే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడతున్నాడు. ఆంధ్రవాళ్లను హైదరాబాద్‌లో కొడుతున్నారని పవన్‌ ఒక పెద్ద అబద్ధాన్ని ఆంధ్ర ప్రజలకు చెప్పారు. హైదరాబాద్‌ దేశంలోని అన్నిరాష్ట్రాల ప్రజలను అక్కున చేర్చుకుంది. పెద్దపెద్ద కంపెనీలు, రెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ ఆంధ్రా ప్రాంత వ్యాపారవేత్తలవే. ఎవరినైనా తెలంగాణ వాళ్లు కానీ వేధించిన సందర్భం ఉందా? ఎంతసేపు కేసీఆర్‌ను, జగన్‌ను తిట్టిపోసి జనాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు గుంజాలని చూస్తున్నారు. కేసీఆర్‌కు సంక్షేమం ఒక విధానం. చంద్రబాబుకు సంక్షేమం ఒక అవకాశవాద పాచిక. అందుకే ఆయనను జనం నమ్మడం లేదు. ” అని సీనియర్‌ సంపాదకుడు కట్టాశేఖర్‌ రెడ్డి విశ్లేషించారు. 
రైతు సమస్యలే ఆంధ్రా తీర్పును శాసిస్తాయి? 
” ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయి. అధికారంలో ఎవరున్నప్పటికీ వారి పట్ల వ్యతిరేక భావన ఉండటం సహజం. గత ఐదేళ్లలో పార్టీలో గానీ, ప్రభుత్వ యంత్రాంగంలో గానీ విపరీతమైన అవినీతి పెరిగి పోయింది. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అంద కుండా, అధికార పార్టీ రాజకీయ దళారుల అడ్డుకున్నారు. రైతుల రుణమాఫీ ఒక మాయ, ప్రభుత్వం మీద నమ్మకంతో రుణాలు సకాలంలో తీర్చక వడ్డీలు పెరిగి రైతులు నష్టపోయారు. వీటి ప్రభావం ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుంది..” అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మాజీ సీనియర్‌ జర్నలిస్టు గాలి నాగరాజా అన్నారు. 
వార్‌ వన్‌ సైడే… 
” భిన్నమైన రాజకీయ వాతావరణంలో ఎపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ బహుముఖ పోటీలో ఎవరి ఓటు ఎవరు చీల్చాలనే ఎన్ని ఎత్తులు వేసినా, చైతన్యవంతమైన ఆంధ్రా ఓటర్లు చాలా స్పష్టమైన మెజారీటిని ఇవ్వబోతున్నారు. వైఎస్సార్‌సిపి కి భారీ మెజారిటీ రావడం ఖాయం. అని మా పరిశీనలో తేలింది.” అన్నారు, సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ ప్రతినిధి డా.వేణుగోపాలరావు, 


ఇవీ మా సర్వేలో 175 అపెంబ్లీ సీట్ల అంచనా ఫలితాలు 
వైఎస్సార్‌ సిపి – 102 
తెలుగుదేశం పార్టీ -72 
జనసేన – 01

Share.

Leave A Reply