అక్కడ దళితులే అర్చకులు!

Google+ Pinterest LinkedIn Tumblr +

దారిపొడవునా,అరటి, కొబ్బరి చెట్లతో, పచ్చని పొలాల మధ్య, పాడి పంటలతో సందడిగా ఉండే గ్రామం ఉప్పులూరు (ఉండి మండలం, పశ్చిమ గోదావరిజిల్లా). విభిన్న మతాలు, సంప్రదాయాలు, కులాలు ఉన్నప్పటికీ అందరూ సమభావంతో, కలిసిమెలసి ఉంటారు. ఈ సామాజిక మార్పు ఇప్పటిది కాదు, కుల వివక్షను శతాబ్దాల కిందటే తరిమికొట్టిన చైతన్యం అక్కడి సమాజానిది.
సమానత్వానికి,చైతన్యానికి మారు పేరుగా నిలిచిన ఆ గ్రామ ప్రజల ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి. అక్కడి ప్రజలు ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు దళితులకు అప్పగించడంతో, దేశంలోనే సామాజిక న్యాయం ఉన్న గ్రామంగా ఏనాడో గుర్తింపు పొందింది. ఈ మార్పు వెనుక చరిత్ర తెలుసుకోవాలంటే… ఎనిమిది శతాబ్దాల క్రితం జరిగిన పల్నాటి యుద్ధం వైపు చూడాలి.
పల్నాటి సీమలో…
” పల్నాటి సీమలో, నాగమ్మ, బ్రహ్మనాయుడు మధ్య యుద్ధం జరుగుతున్న రోజులవి. పల్నాడును పాలించిన నలగామ రాజు ఆస్థానంలోని బ్రహ్మనాయుడు, ”చాప కూడు” భోజనాలను ప్రవేశ పెట్టాడు. ఈ పద్ధతిలో అన్ని కులాల ప్రజలు కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక సమానత్వం సాధించడానికి దోహద పడింది. ఆ సమయంలో ఒక సాంఘిక సంస్కరణ కూడా జరిగింది. పల్నాటి యుద్ధంలో మలిదేవరాజు తరుపున పోరాడిన బ్రహ్మనాయుడు విశిష్ట ద్వైత సిద్దాంత కర్త రామానుజాచార్యుల స్ఫూర్తితో సంస్కరణ శీలిగా మారి, సమభావాన్ని పెంచడానికి, చాపకూళ్ల పేరుతో అన్ని కులాల వారికి సహపంక్తి భోజనాలు పెట్టేవారు. ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్టొంటూ, బ్రహ్మనాయుడుకి నమ్మకమైన అనుచరుడిగా మారాడు కన్నమదాసు. అతడిలోని సేవాగుణం గుర్తించి మాచర్ల, మార్కాపురంలో చెన్న కేశవస్వామి ఆలయాల అర్చక బాధ్యతలు అప్పగించాడు, బ్రహ్మనాయుడు .


విగ్రహంతో గోదారి తీరం వైపు …
పల్నాడు లో యుద్ధమేఘాలు వీడక పోవడం వారిని కలచివేసింది. దాంతో కన్నమ వారసుడైన తిరువీధి నారాయణ దాసు అతని ఇద్దరు సోదరులతో సహా, వారు పూజిస్తున్న చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని మోసుకుంటూ క్రీ.శకం 1280 ప్రాంతంలో… పల్నాడును వీడి నూజివీడు మీదుగా సింహాచలం వలస వెళ్లారు. అక్కడే కొన్నిరోజులు స్వామి సేవ చేసుకుంటూ బతికారు. కొంత కాలం తరువాత పల్నాడు లో పరిస్ధితులు చక్కబడి ఉంటాయని తెలిసి, తిరుగు ప్రయాణంలో గోదారి తీరంలోని ఉప్పులూరులో ఆగారు. ఆ రోజుల్లో ఆదంతా అరణ్య ప్రాంతం. ఒక రావి చెట్టుకింద స్వామి విగ్రహాన్ని ఉంచి, వంట చేసుకొని, స్వామి వారికి నైవేద్యం పెట్టి, అనంతరం వారు ఆ ప్రసాదాన్ని ఆరగించారు. అక్కడి నుండి వేరే గ్రామానికి బయలు దేరుతూ విగ్రహాన్ని తీసుకోవడానికి ప్రయత్నించగా ఆ విగ్రహం ఎంతకీ కదల లేదు. ఆ విగ్రహాన్ని అలాగే ఉంచి, పక్క గ్రామానికి వెళ్లారు. ఈ లోపు ఆ విగ్రహం ఉంచిన రావి చెట్టు ఎండి పోవడం, ఊరి వారికి అనారోగ్యం కలగడంతో ప్రజలు భయపడి, ఇదంతా వైష్టవ దాసుల వల్లనే జరిగిందనే నమ్మకంతో పక్క పల్లెలో ఉన్న వైష్ణవ దాసులను పట్టుకొని చీకటి గదిలో బంధించారు. అయితే చెన్నకేశవ స్వామి ఆ గ్రామపెద్దల కలలోకి వచ్చి, వారికి హాని చేయవద్దు, వారే నా పూజారులు, నా ఆరాధనకు నియమించుకున్నాను. మీ గ్రామంలో వెలుస్తున్నాను. అని చెబుతారు.
గ్రామ పెద్దలంతా సమావేశమై,విగ్రహంలోని మహత్తును గ్రహించి, వైష్ణవ దాసులను విడిపించి, స్వామివారికొక చిన్న గుడిని ఏర్పాటు చేసి, వైష్ణవ దాసులనే అర్చకులుగా నియమించి, తమ ఊరిలోనే ఉంచేసుకున్నారు…” అని, ఆలయం వెనుక చరిత్రను వివరించారు, కన్నమదాసు వారసుడు, ప్రస్తుతం ఉప్పులూరులోని, ప్రధాన అర్చకుడు, వీధి రామానుజదాసు.
పాదాలకు నమస్కరిస్తారు.
” కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు 1280 ప్రాంతంలో లో ఉప్పులూరు గ్రామానికి వలస వచ్చారని చరిత్రచెబుతోంది. ఆలయం ఆవిర్భావంతో నారాయణదాసు వారసులకు చెందిన 9 కుటుంబాలు ఆలయ సేవలు చేస్తున్నారు. దళితులు అర్చకులుగా ఉండటం వల్ల వివక్ష లేమీ ఇక్కడ కనిపించవు. అన్ని కులాల వారు భక్తిభావంతో ఇక్కడికి వస్తుంటారు. దళిత అర్చకుల పాదాలు నమస్కరిస్తారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు వైష్ణవ సంప్రదాయంలో జరుగుతాయి. పూర్వపు అర్చకులే ఇక్కడ ప్రాచీన సంస్క తిని పదిల పరిచారు. ద్రవిడ, సంస్కత భాషల్లో పాండిత్యాన్ని సంపాదించుకున్న వీరు నిత్య పూజలతో స్వామి వారి సేవలో తరలిస్తున్నారు. సిరి సంపదలు, సమభావంతో, ఉప్పులూరు తుల తూగు తుందంటే, అది చెన్నకేశవస్వామి చల్లని ఆశీస్సులే ” అని అంటారు ఆలయ కమిటీ ఛైర్మన్‌, నిమ్మల సత్యనారాయణ.
హుండీ లేని ఆలయం …
మిగతా ఆలయాలకు ఇక్కడి ఆలయానికి ఉన్న ప్రధానమైన తేడా భక్తుల నుండి విరాళాలు,కానుకలు స్వీకరించక పోవడం. అందుకే ఈ అలయంలో హుండీని ఏర్పాటు చేయలేదు.
అప్పలస్వామి, చెన్నకేశవ స్వామిగా ఎలా మారారు?
ప్రస్తుతం ఆలయ అర్చకులుగా సేవ చేసుకుంటున్న వారు 11వ తరం అర్చకులు. రఘువంశం, కుమార సంభవం, శబ్దమంజరి, అమరకోశం, మేఘదూతం, శిశు పాలవధ వంటి కావ్యాలు, సంస్కత శ్లోకాలు అవలీలగా పఠించే శక్తిని వీరు సొంతం చేసుకున్నారు.
” వైష్ణవ మత గురువులైన పరవస్తు రామాజనుజాచార్యులు 1868 సంవత్సరంలో ఈ ఆలయ విగ్రహాని చెన్నకేశవస్వామిగా గుర్తించారు. అప్పటి వరకు అప్పలస్వామిగా పిలిచేవారు. 1893లో నూజివీడు జమీందార్‌ రాజా పార్థసారధి అప్పారావు ఆలయాభివృద్ధి కోసం, 40 ఎకరాలను భూదానం చేశారు. ఇందులో 25 ఎకరాల్లో అర్చక కుటుంబాలు సాగు చేసుకొని జీవనోపాధి పొందడానికి, 13 ఎకరాలు ఆలయాభివృద్ధి కి, రెండెకరాలు భజంత్రీలకు కేటాయించారు. ” అని మరో అర్చకుడు వీధి రామకేశవదాసు చెప్పారు.
అరటి గెలలతో నైవేద్యాలు
చెన్నకేశవునికి అరటి గెలలతో ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం ఇక్కడి పద్ధతి. అరటి పళ్లంటే స్వామి వారికి అమితమైన ఇష్టమని పూజారులు చెబుతుంటారు. వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించే రథోత్సవానికి సుమారు మూడు వేలకు పైగా అరటి గెలలతో నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ప్రతీ ఇంటి నుంచి కనీసం ఒక గెల అరటి పళ్లు స్వామి సన్నిధికి తీసుకొస్తారు. ప్రసాదంగా ఇచ్చే అరటి పళ్లనే రథంపైకి విసురుతూ సంబరం చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత.
అందరూ సమానమే!!
ఉప్పులూరులోని చెన్నకేశవస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులే జరుపుతారు. వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులొచ్చినా పీటలపై కూర్చొబెట్టి పూజ చేసే అవకాశం లేదు. సామాన్య భక్తుల లాగే నిలబడి హారతి తీసుకోవాల్సిందే. సంక్రాంతి నెలరోజులు గ్రామ సేవ కార్యక్రమాలు పగలు, రాత్రి నిర్వహిస్తారు.
1784లోనే ఈ ఆలయానికి తొలి ధర్మకర్తల మండలి ఏర్పాటైంది.
సుప్రభాత సేవతో పాటు తిరుప్పల్లాణ్డు, తిరుపళ్లియెళుచ్చి, తిరుప్పావై ల అనుసంధానంతో పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకతగా స్ధానికులు చెబుతుంటారు.

వైశాఖమాసం లో స్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి, కల్యాణోత్సవం, రథోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ గ్రామంలో జన్మించి దేశ, విదేశాల్లో స్థిరపడిన వారిలో అత్యధికులు రథోత్సవానికి తరలొచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీ.రథోత్సవంలో భాగంగా రథం పై దేవుని విగ్రహంతో పాటు దళితపూజారులు ఉండగా అగ్రవర్ణాల వారు ఆ రథాన్ని భక్తితో లాగుతుంటారు.
ఈ ఆలయ కమిటీ బోర్డులో గ్రామంలోని అన్ని వర్గాల నుండి ఆరుగురు సభ్యులుంటారు. క్రిస్టియన్‌ , ఎస్సీ, ఎస్టీ,బీసీలతోపాటు ఇద్దరు ఓసీలు ప్రాతినిధ్యం వహిస్తారు. భారత మాజీరాష్ట్రపతి శంకర్‌దయాల్‌ శర్శ అప్పటి ప్రధాన పూజారి వీధి కష్ణమూర్తి దాసు అసమాన పాండిత్యం చూసి 1996 లో దళిత అర్చక అవార్డుతో సత్కరించారు.
ఒకపుడు దళితులు ఆలయ ప్రవేశం చేస్తేనే అపచారంగా భావించిన సమాజంలో దళితులే పూజారులుగా మారిన అరుదైన చరిత్ర ఇది. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ అలయాన్ని ప్రతీ రోజూ, తుడిచి, పరిశుభ్రంగా ఉంచడం మొదలు, సుప్రభాత సేవ, అలంకరణ సేవ, మహానైవేద్యం, పవళింపు సేవలు వరకు దళిత అర్చకులదే బాధ్యత.
……………
చెన్నకేశవస్వామి ఆలయం చూడాలనుకునే వారికి, భీమవరం నుండి
ఉప్పులూరుకు ఆర్‌టీసీ బస్సులున్నాయి. అలాగే ఆటో సర్వీసులున్నాయి.
…………………………………….
శ్యాంమోహన్‌( 9440595858 )
……………………………………

Share.

Leave A Reply