‘ఆది ధ్వని’వింటారా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

మాదాపూర్‌ లోని, వృత్తాకారుపు చిత్రమయిలో పై అంతస్తులోకి అడుగు పెట్టగానే, కొన్ని తరాలుగా మనల్ని రాగాలు, గీతాలతో అలరించి, అలసి కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆదిమ వాద్యాలు కనిపించాయి. మిలమిలా మెరిసేలా వాటికి కృత్రిమ రంగులు అద్దారు. అడవి బిడ్డలను మృగాల నుండి కాపాడిన విల్లంబులు గ్యాలరీ లప్పం గోడకు నిర్జీవంగా వేలాడుతున్నాయి. వాటి మధ్య తెలంగాణ తండాల నుండి వచ్చిన జానపద ఆదివాసీ వాద్య కళాకారులు బిత్తర చూపులుతో కనిపించారు. కుంటాల జలపాతాల మధ్య, రాలుతున్న తునికాకుల కింద, సొరకాయ బూరనో,మువ్వడోలో వాయిస్తూ స్వేచ్ఛగా తంగేడు పువ్వులా ఆహ్లాదంగా బతికిన వారు, చిత్రమయి ఇరుకు గదుల్లో నేల మీద నిస్తేజంగా కనిపించారు.

ఇంద్రవెల్లి నుండి వచ్చిన ‘కీక్రి’ వాద్యకారుడు తొడసం మారుతిని పలకరించి మీ వాద్యం వినిపిస్తారా ? అని అడిగాం. గోండు భాషలో కాస్త ఇబ్బంది పడుతూ ఏదో అన్నాడు. అక్కడ వారికి ఊపిరాడటం లేదని గమనించి వరండాలో చెట్ల కిందకి తీసుకెళ్లాం. ఇంతలో ఆయన భార్య ,పిల్లలు ఆయన పక్కన చేరారు. ఒక బీడీ దమ్ముతీసి, హాయిగా మబ్బులు కమ్ముతున్న ఆకాశం వైపు చూసి నవ్వుతూ, చేతిలోని ‘కీక్రి’ ని సవరించి నాగోబా జాతరలో పాడే గానం మొదలు పెట్టారు… ఇద్దరు బిడ్డలు చెరోపక్కన చేరి ఒకరు డక్కి,మరొకరు కాలికోం వాద్యాలతో శృతి కలిపారు. రమేష్‌ బాబు తన కెమేరా లెన్స్‌తో స్వరాల్ని విజువలైజ్‌ చేస్తున్నాడు. అయిదు నిముషాల పాటు అద్భుత జలపాతాల హోరు చిత్రమయిని కమ్ముకుంది.
గాత్రం ముగిసిన తరువాత…
ఈ కళ మీకు బతుకు తెరువు కల్పిస్తుందా అని అడిగితే…

” ఇక్కడున్న రెండ్రోజులు కడుపు నిండుతుంది. ఊరికి పోయినాక, మమ్మల్ని అడిగే దిక్కుండదు. అడ్డాకూలీగా బతకాల్సిందే… మళ్లా ఎప్పుడైనా మా అవసరం ఉంటే ఈ సార్లు పిలుస్తారు…” అంది మారుతి భార్య నీలాబాయి.
లోపల హాలులో…… ” ప్రస్తుతం దేశం కోల్పోతున్న మానవీయ వ్యవస్థలలో సంగీతం ఒకటి. ఈ అద్భుత వాద్య సంపదను సేకరించాలి. ప్రత్యేక వాద్య ప్రదర్శన మ్యూజియం ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసమే ‘ఆది ధ్వని’ …” అని నిర్వాహకులు మీడియాకు కూల్‌గా వివరిస్తున్నారు.

Share.

Leave A Reply