ఆంధ్రజ్యోతి ఎండీ కళ్లల్లో నీళ్లు!ఎందుకు?

Google+ Pinterest LinkedIn Tumblr +


An Uphill Task at AndhraJyothi daily

జర్నలిజంలో పదేళ్లు పూర్తి చేశాను. 1974-75లో వచ్చిన ‘ఈనాడు’ తెలుగు జర్నలిజంలో భూకంపం పుట్టిస్తే, 1984-85లో వచ్చిన ‘ఉదయం’ సునామీ సృష్టించింది. ఈ రెండు దినపత్రికలూ రూల్స్ ఆఫ్ ది గేమ్ ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి నేను ఈనాడుకీ ఉదయానికీ పుట్టిన అక్రమ సంతానాన్ని. వొకవేళ మీరు నన్ను చెరుకూరి నారాయణరావు అని పిల్చినా నాకు యిష్టమే! ప్రకాష్ గాడు వున్నాడా ఇవ్వాళ, రేపు పేపర్ బాగుంటుంది అని ఈనాడులోనూ, వాడున్నాడా, రేపు దుమ్ము రేగిపోద్ది అని ఉదయంలోనూ పేరుండేది. 1976 నుంచి 86 దాకా… ఊపిరి సలపకుండా పన్జేశాను. కుష్వంత్ సింగ్, నీహాల్ సింగ్ నుంచి ఎంజే అక్బర్, వీర్ సింఘ్వి, దిలీప్ బాబ్, ఆర్ట్ బచ్వాల్డ్, వినోద్ మెహతా, అనిల్ ధర్కర్… ఇంకా టాప్ క్లాస్ జర్నలిస్టులు ఎందరో… వాళ్లు రాసిన ప్రతీదీ చదవడం, మరో ధ్యాస లేకుండా పని చేయడం. కుర్రతనం, దూకుడు, ఒక వూపులో పని చేయడం. ‘‘అస్సలా రోజుల్లో గురూ’’ అంటామే… ఒక అయ్యప్ప దీక్షలాగా, పోలేరమ్మ పూనకంలాగా.. నాన్ స్టాప్ గా ఒకటే పని… శ్రీశ్రీ అంటాడే వ్యధల్ని చించడం, సుధల్ని పంచడం!

ఆ పై విధముగా నేను కొంత బలిసి, కొవ్వెక్కి కొట్టుకుంటున్న సమయంలో విజయవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరాను. అది 1987. వాస్తవానికి అది నండూరి రామ్మోహనరావుగారి సామ్రాజ్యం. యాజమాన్యం అనగా జగదీష్ ప్రసాద్, విశాఖలో, తిరుపతిలో జ్యోతి ఎడిషన్లు పెట్టే ప్లానుతో అప్పటికే ఎ.బి.కె.ప్రసాద్, కొమ్మినేని వాసుదేవరావులని సంస్థలోకి తీసుకుంది. హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో ఎ.బి.కె. అసోసియేట్ ఎడిటర్. దినపత్రికలో చివరి పేజీలో ఎడిటర్ పేరు, సంస్థ చిరునామా వేస్తారు. దాన్ని ఇంప్రింట్ అంటారు. అందులో నండూరితోపాటు ఎ.బి.కె.పేరు కూడా వేసేవారు. ఒక పేపర్లో రెండు ఎడిటర్లు పట్టవు కదా!

నండూరి గాయపడీ, ఖేదపడీ వున్నారు. తగుదునమ్మా అంటూ నేను జాయినయ్యాను, న్యూస్ ఎడిటర్ గా. రోజూ పేపర్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత నాదే. ముభావంగా, చిరాగ్గా వుండే నండూరీ, నేనూ కలిసి రేపటి పత్రిక తీసుకురావాలి. ఆ వార్త యిలా యిస్తున్నా, ఈ ఫోటో పెద్దగా వేస్తున్నా… అనీ ప్రతిదీ భయపడుతున్న భార్యలా చెప్పేవాణ్ణి. నండూరి, ‘ఆ, వూ, సరే’ అనేవారు మొట్టికాయలు పెట్టే మొగుళ్లా. విశ్వరూపం, నరావతారం నుంచి అంకుల్ టామ్స్ కేబిన్ దాకా నండూరి రచనల్ని బాగానే చదివి వుండటం వల్ల ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయన బాగా హర్టయి వున్నారనీ తెలుసు. పులి మీద పుట్రలా కొమ్మినేని వాసుగారూ అక్కడే సీనియర్ న్యూస్ ఎడిటర్. విశాఖ ‘ఈనాడు’లో 1978లో చేరినపుడు, నా తొలి న్యూస్ ఎడిటర్ ఆయనే. నిజానికి అప్పట్లో నా భుజం తట్టీ, బుగ్గలు గిల్లీ ఎంకరేజ్ చేసింది వాసు గారే. ఆయనంటే నాకు చాలా యిష్టం. అలా కొమ్మినేని, నండూరి వార్ల మధ్య ఇరుక్కుపోయా. అసలే ఉదయం, ఈనాడు హవా నడుస్తోంది. నాటి జ్యోతి ఆఫీసు ఫ్లాపయిన తెలుగు సినిమాలా వుండేది. నండూరి సౌమ్యంగా, ప్రశాంతంగా, మంచికి మారుపేరులా వుండేవారు. నా కంటే ముందు నుంచీ అల్లం నారాయణ, కవి అఫ్సర్, పొనుగోటి కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి పని చేస్తున్నారు. వీక్లీ పురాణం సుబ్రమణ్యశర్మ, బాలజ్యోతి శశికాంత్ శాతకర్ణి (కవి సోమసుందర్ కుమారుడు) చూస్తుండేవారు.

*** *** ***

జ్యోతిలో రోజువారీ పని చక చకా చేసేసే వాణ్ణి. ఎండీ జగదీష్ ప్రసాద్ పిలిచి ‘‘పేపర్ బాగా వస్తోందండీ’’ అని రెండు మూడు సార్లు చెప్పారు. ఓ సారి వివియన్ రిచర్డ్స్ సెంచరీనో, డబుల్ సెంచరీనో కొట్టాడు. రిచర్డ్స్ పేరు వింటేనే థ్రిల్లు కదా! నా పని కాకపోయినా, ఆ ఐటం తీసుకుని రాశాను. ‘‘రిచర్డ్స్ గనక బంతిని లాగి కొడితే, అది భూగోళం దాటి బైటికి వెళిపోతుంది’’ అంటూ ఏవో సూపర్లేటివ్స్ గుప్పించి రాశాను. మర్నాడు వాసుదేవరావు కిందికి తీసికెళ్లి మంచి కాఫీయిప్పించి, ‘‘భలేగా రాశారు’’ అని మెచ్చుకున్నారు. ఆయన క్రికెట్ చాలా యిష్టం. ఇలా అంతా బాగానే వుంది. పెద్దలు తుర్లపాటి కుటుంబరావు, ఉపేంద్రగార్లు కూడా నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. వాళ్లున్నా నండూరి మాటే ఫైనల్. ఆయనతోనే ఐస్ బ్రేక్ కావడం లేదు.

*** *** ***

నేను అనుకోని రోజు రానే వచ్చింది. 1987 ఆగస్టు తర్వాత ఒక ఆదివారం. సంపాదకుడు నండూరికి సెలవు. జనరల్ గా ఆదివారాలు మంత్రులు, ఐఎఎస్ లూ, ఇతర అధికారులు యిళ్లలో వుంటారు, లేదా సొంత పనులు చూసుకుంటారు. అనగా వార్తల రష్ వుండదు. మధ్యాహ్నం 12 గంటలకి నండూరి ఇంటి నుంచి ఫోన్. ‘‘పెద్దగా వార్తలు లేవు, ఈమని శంకరశాస్త్రి’’ చనిపోయారు అని చెప్పాను. అది చిన్న వార్తేగా ఇంకేమన్నా వుంటే చూడండి’’ అన్నారు. విశాఖలో రెండు మూడుసార్లు ఈమని వీణ కచేరీలకి వెళ్లాను. అప్పట్లో వార్తలు కూడా రాశాను. ఈనాడు ఫోటోగ్రాఫర్ 1980లో తీసిన ఈమని ఫోటోని దాచాను. గబగబా యింటికెళ్లి ఆ ఫోటో తెచ్చాను. విజయవాడ బందరు రోడ్డులోని ఆంధ్రజ్యోతి ఆఫీసు దగ్గర్లోనే వెంకటేశ్వర స్వామి గుడి వుంటుంది. ఆ రోడ్డులోనే బాలాంత్రపు రజనీకాంతరావు వుంటారని నాకు తెల్సు. ఎప్పడూ వెళ్లలేదు. రజనీ కాంతారావుగారి పెద్దబ్బాయి హేమచందర్, ఆయన భార్య ప్రసూన మాకు బాగా తెలుసు. నా భార్య నళిని పాటలు పాడుతుంది. ఓసారి రజనీకాంతరావు గారింట్లో పాడితే ఆయన మెచ్చుకున్నారని తెగ మురిసిపోయింది. చిన్న నోట్ బుక్ పట్టుకుని నడుచుకుంటూ రజనీకాంతరావు యింటికి వెళ్లాను. ఒక్కరే మంచమ్మీద కూచుని వున్నారు. నేను ఫలానా అని చెప్పాను. అయితే ఏమిటి? అన్నట్టు చూశారు. ‘‘నేను పాటలు పాడే నళిని హజ్ బెండ్ ని’’ అని చెప్పా. ‘‘హో హో… రా బాబూ కూర్చో’’ అన్నారు. ఈమని చనిపోయారని చెప్పాను. నిశ్శబ్దంగా వుండిపోయారు. ఈమని గురించి నాలుగు మాటలు చెప్పమని అడిగాను. అద్భుతంగా వివరించి చెప్పారు. ఈమని 24 వీణలూ, 24 వయొలిన్లతో భ్రమర విన్యాసం అని a kind of a symphony కంపోజ్ చేసి ఉన్నారు. ఏలూరులో మా అన్నయ్య మోహన్ చిన్న నాటి మిత్రుడు పద్మనాభశాస్త్రి ఆ సింఫనీ స్ఫూల్ ని ఆలిండియా రేడియో నుంచి సాధించుకొచ్చాడు. మా యింట్లో రాత్రిపూట లైట్లు ఆర్పేసి.. ఆ సింఫనీ నాలుగైదు సార్లు విని వున్నాను.
Its an inexplicable experience.

ఈమని మరణం, రజనీకాంతరావు చెప్పిన సంగతులూ, భ్రమర విన్యాసం అనుభూతి అన్నీ కలిపి రాసి, పెద్ద ఫోటో వేసి మొదటి పేజీలో మంచి డిస్ ప్లే ఇచ్చాను. మర్నాడు నండూరి వచ్చీ రాగానే కేబిన్ లోకి పిలిచారు. ‘ఆ వార్త ఎవరు రాశారు?’ అని అడిగారు. అదే విసుగు. ఈమని వార్తే అని తెలుస్తూనే వుంది. ‘‘నేనేనండీ’’ అని నెమ్మదిగా అన్నా. ‘‘మీకు సంగీతం ఎలా తెల్సు?’’ అదే అసహనం! తప్పలేదిక. నాకు పెద్దగా సంగీతం తెలీదు. ఈమని కచేరీలు విన్నా. ఆయన వీణంటే చెప్పలేనంత యిష్టం. భ్రమర విన్యాసం మా యింట్లో వుంది. చాలాసార్లు విన్నా’’ అని సంజాయిషీలాగా చెప్పాను. గురుడు కూల్ అయ్యాడు. ఒక కాఫీ తెప్పించాడు. భ్రమర విన్యాసం గురించి రాస్తు్న్నపుడు కొంత కవిత్వం వెలగబెట్టాను. అది ఆయనకు బాగా నచ్చిందని తర్వాత తెలిసింది.

కట్ చేస్తే… ఆ మర్నాటి నుంచి ఎడిటర్ గారూ, న్యూస్ ఎడిటర్ గాడూ కృష్ణకుమారీ, అక్కినేని నాగేశర్రావ్ లా చెట్టపట్టాలేసుకు తిరగడం మొదలైంది. ఓ రోజు పేజీ మేకింగ్ సెక్షనులోకి వెళుతుంటే, నన్ను ఆపి, ‘‘ఇదిగో, తెలుగులో మొట్టమొదట కార్టూన్లకి రాజకీయ కవిత్వం రాసిందెవరో చెప్పండి?’’ అన్నారు నండూరి. ‘‘వెరీ యీజీ, నాకు తెలుసు సార్. రాంభట్ల కృష్ణమూర్తిగారేగా’’ అన్నా. నా వీపు మీద కొట్టి ‘‘అదే మీతో వచ్చింది (అంటే కమ్యునిస్టులతో అని…!).. మొదట రాసింది నేను’’ అంటూ ఆ తేదీలూ, సంవత్సరాలూ వివరించారు. నండూరి చాలా కబుర్లు చెప్పేవారు.

మా స్నేహం కుదిరింది. కొన్నాళ్లకే బాగా ముదిరింది. అనగా కలిసి మందు పార్టీలకు వెళ్లుట. ఓ సారి కె.సి.పి వాళ్లు సంపాదకులకు భారీ పార్టీ యిచ్చారు. నండూరి నన్ను తీసికెళ్లారు. పెద్ద గార్డెన్ రెస్టారెంట్ లో ఒక చల్లని సాయంకాలం. తెల్లచొక్కా తెల్లపాంటూ, సన్నజాజి పూల నవ్వుతో విశాలాంధ్ర రాఘవాచారి రానే వచ్చారు. ఆయన దగ్గర పని చేయలేదుగానీ, బాగా తెలుసు నేను. పెద్దవాళ్లు కూర్చోవాలిగా, నించునే వున్నా. నన్ను కూర్చోమని అటు నండూరీ, ఇటు రాఘవాచారీ కూర్చున్నారు. ఇతర పత్రికల వాళ్లూ సెటిల్ అయ్యారు… and the party begins. అసలే మబ్బుల మీద వున్న నాకు మందొకటి. రాఘవాచారి గొప్ప స్పాంటేనిటీతో జోకు వేస్తూనే నాకో చికెన్ ముక్క యివ్వడం, నండూరి మెరుపులాంటి రిపార్టీ యిస్తూ, నాకో కీమాబాల్ అందించడం. What a day!
రాఘవాచారి గారికి నేను సిగిరెట్ వెలిగించడం,
మరో రౌండులో ఆయన నా సిగిరెట్ వెలిగించడం…
What a memorable time!
అవి రెండు విద్యా కుసుమాలు
రెండు ఉన్నత సంస్కార శిఖరాలు!
ఇద్దరు intellectuall giants..
ఇద్దరు brilliant editors… వాళ్లిద్దరూ ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్లలా నేను.
నాకింకా ఏదన్నా ప్రభుత్వ బిరుదు రావాలంటారా?
పులిట్జర్ ప్రైజేమన్నా కావాలంటారా?

*** *** ***

ఆంధ్రజ్యోతిలో యిక నా పని హేపీగా, సాఫీగా సాగిపోతోంది. 1988 జూన్ 2న మన సూపర్ హీరో లెజండరీ డైరెక్టర్ రాజ్ కపూర్ మరణించారు. ఉదయం పదింటికే వార్త వచ్చింది. రాజ్ కపూర్ గొప్పదనం, క్రియేటివిటీ, ఆల్ టైమ్ గ్రేట్ పాటల గురించి యుఎన్ఐ, పీటీఐ సంస్థలు వార్తలు గుప్పిస్తున్నాయి. రాజ్ కపూర్ అంటే నర్గీస్, వైజయంతిమాల… ఎన్ని జ్ఞాపకాలు! బాగా ఎమోషనల్ అయిపోయాను. దినపత్రికలో ఒక పూర్తి పేజీ వచ్చేంత మేటర్ రాశాను. అప్పుడు జ్యోతి తిరుపతి ఎడిషన్ ఆధునిక టెక్నాలజీ, కలర్ ప్రింటింగ్ తో భేలేగా ఉండేది. నా ఐటం చూసి ముచ్చటపడిన అక్కడి సీనియర్లు మొదటి పేజీ అంతా రాజ్ కపూర్ వార్తే యిచ్చారు. మరో వార్తకి తావు లేకుండా చేశారు. ఉదయాన్నే మద్రాసులో ఆ వార్త చదివిన సినీ నిర్మాత నవతా కృష్ణంరాజు రేణిగుంట జ్యోతి ఆఫీసుకు ఫోన్ చేశారు. రాజ్ కపూర్ వార్త చాలా బాగా రాశారనీ, ఆ ఐటం రాసింది ఎవరైతే వాళ్లని తన తర్వాత సినిమాకి స్క్రిప్టు రైటర్ గా తీసుకుంటానని చెప్పారు. ప్రతాప్ రాం ప్రసాద్ అనే జర్నలిస్టు ఫోన్ చేసి నాకీ విషయం చెప్పాడు. మేం విజయవాడ జ్యోతి డెస్కులో ఛీర్స్ చెప్పుకుని చాయ్ తాగాం.

ఆంధ్రజ్యోతిలో పిడకల వేట:

ఆంధ్రజ్యోతికి పునాది వేసి నిలబెట్టిన వాడు కె.ఎల్.ఎన్. ప్రసాద్. నేను జ్యోతిలో చేరిన కొన్ని రోజులకే చనిపోయారు. కానూరు లక్ష్మీనారాయణ ప్రసాద్. రాజ్యసభ (కాంగ్రెసు) సభ్యుడు. ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త. జ్యోతి దినపత్రిక, వీక్లీ, బాలజ్యోతి, మహిళల పత్రిక వుండేవి. పదో రోజు జ్యోతి ఆఫీసులో వందల మందికి భోజనాలు. అందరికీ ఒక్కో స్టీలు బాక్సు యిచ్చారు. ‘కె.ఎల్.ఎన్.ప్రసాద్ జ్ఞాపకార్ధం’ అని దాని మీద రాసి వుంది. ఆ బాక్సు తీసుకోవడం నాకు యిష్టం లేదు. స్టీలు గ్లాసులో, గిన్నెలో యివ్వడం సంప్రదాయం అని తెలుసు. అదేంటో పేదరికంతో పరాచికంలా అనిపించింది నాకు. మా ఏలూరులో కొందరు నిరుపేదలు వేసుకునే ఖద్దరు బనియన్ల మీద నాయుడు గారి ధర్మం అనో, అప్పారావు గారి జ్ఞాపకార్థం అనో జేగురు రంగు అక్షరాల్లో వుండేది.
అలవిమాలిన అల్పత్వం కదా అది!

స్టీలు గిన్నెల ప్రాధాన్యం తెలుసు గనక ఇంటికి తీసికెళ్లాను. మా ఆవిడ సంతోషించింది. పెసరపప్పో, పంచదారో కిలోన్నర పడుతుంది అందులో. 1987 నాటికి నాకు పిల్లలు లేరు. పొద్దున్నే కాఫీ వంకతో వంటింట్లోకెళ్లి జడలాగో, బుగ్గ గిల్లో… అలాంటి వేళ’… ‘‘ఇదిగో నువ్వు ఆగు’’ అంటూ మా ఆవిడ ఆ స్టీలు డబ్బాలోంచి వో స్పూను పంచదార తీసి కాఫీలో కలిపేది. కె.ఎల్.ఎన్.ప్రసాద్ అప్పుడు కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. ఆయననెవరో తెలీదు నాకు. That’s it. అదే ఎన్టీ రామారావో, జగ్గయ్యో, రేలంగో, రమణారెడ్డో అయితే నాకు ఎంతో నచ్చేది. చిన్నప్పుడు క్యూల్లో నించొని చొక్కాలు చించుకుని టికెట్ కొనుక్కుని వాళ్ల సినిమాలకు వెళ్లేవాణ్ణి కదా. వాళ్లు నాకు తెలియకపోయినా కుటుంబ సభ్యుల కిందే లెక్క. ఆత్మ బంధువులే కదా…! మధ్యలో ఈయనెవరు అనిపించేది. అయినా పెద్దాయన కేఎల్ ఎన్ నా కుటుంబ సభ్యుడు అయిపోయారు.

*** *** ***

ఆ కన్నీళ్లను మరిచిపోలేను:

1988 డిసెంబరు 25న జ్యోతి ఎండీ జగదీష్ ప్రసాద్ గారి రూంలోకి వెళ్లాను. రిజైన్ చేస్తున్నా అని చెప్పాను. ‘‘మీకేం తక్కువ చేశాను? ఇపుడు మీకేం కావాలో చెప్పండి. జీతం డబుల్ చేయనా? విశాఖ ఎడిషన్ పెడుతున్నాం. మీరు ఈ రోజే వెళ్లండి. మొత్తం నేను చూసుకుంటాను’’ అన్నారు. చాలా ఎమోషనల్ గా వున్నారాయన. ఎబికే గారు రిజైన్ చేశారు కదా… నేనూ ఆంధ్రభూమిలో చేరుతున్నాను అని చెప్పాను. షోకిల్లా, జల్సారాయుడు అని పేరున్న జగదీష్ ప్రసాద్ గారి కళ్లల్లో నీళ్లు! నేను షాక్ తో చూస్తుండగానే కన్నీళ్లు జలజల రాలి ఆయన చొక్కా మీద పడుతున్నాయి.
ఎలా?
మౌనం…
కొద్దిసేపు నిశ్శబ్దం.
I am extreamly Sorry sir అని చెప్పి వచ్చేశాను.
అప్పుడే కాదు, నేను చేసిన పనికి నన్ను యిప్పటికీ క్షమించుకోలేను.
నిజంగానే, నాకేం తక్కువ చేసింది ఆంధ్రజ్యోతి?

*** *** ***

FLASH FLASH….. :
నేను రిజైన్ చేసిన రోజు, తెల్లవారుజామునే (డిసెంబరు 26) విజయవాడలో వంగవీటి మోహన రంగాను హత్య చేశారు.

– తాడి ప్రకాష్, 97045 41559

Share.

Leave A Reply