తొలకరి చినుకుల పండుగ ‘ తీజ్‌ ‘

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆగస్టులో రెండవ వారం నుంచి నెలాఖరు వరకు , తెలంగాణ గిరిజన ప్రాంతాలలో జరిగే, అరుదైన సంబురం తీజ్‌.
బంజారాల జీవన శైలి, సంస్కృతికి, దర్పణం ఈ పండుగ. ఇదొక ప్రకృతి పండుగ. తొలకరి చినుకుల మధ్య జరిగే అపురూప పండుగ.
గిరిజన జాతుల్లో అధిక శాతం ఉన్న బంజారాలది, వైవిధ్యమైన వేషధారణ. వీళ్లు అతి తక్కువ దేవతలను పూజిస్తారు. అరుదుగా పండుగలు జరుపుకుంటారు. అందులో ఒకటి తీజ్‌ . సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వీరు ఎన్ని ఇబ్బందులున్నా తీజ్‌ పండుగను సందడిగా నిర్వహించుకుంటామని, ‘తీజ్‌ ‘ విశిష్టతను ఆదిలాబాద్‌జిల్లాకు చెందిన కొందరు గిరిజనులు రూరల్‌ మీడియాకు వివరించారు.
తీజ్‌ అంటే…?
బంజారాలకు ఏడుగురు దేవతలున్నారు. వారు తీజ్‌ బంజార, హింగళ, మోరామ, తోల్జా, ధ్వాలంగన్‌, కేంకాలి, మసూరి. పెళ్ళీడు అమ్మాయిల నాయకత్వంలో మిగతా అమ్మాయిలు కలిసి భక్తి శ్రద్ధలతో ఈ పండుగను ఎంతో సరదాగా జరుపుకుంటారు. తీజ్‌ దేవత పంటలను,ప్రకృతిని కాపాడుతుంది అని వీరి విశ్వాసం.
మాతస్వామ్య వ్యవస్థ …
ఈ గిరిజనుల్లో ఒకప్పుడు మాతస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. దానికి నిదర్శనంగా వారికి ఏడుగురు స్త్రీ దేవతలున్నారు. ఈ స్త్రీ దేవతల పేర్లతోనే పండుగలు నిర్వహిస్తారు. మెరామ్మ, తీజ్‌, మత్రాల్‌, సీత్ల అనేవి బంజారాల కు ప్రధానమైన పండుగలు. మెరామ్మ దేవత తండాను రక్షిస్తుందని నమ్ముతారు. సీత్ల అనే దేవత పశు సంపదను వద్ధి చేస్తుంది. మత్రాల్‌ పేరుగల దేవత పిల్లలకు వ్యాధులు రాకుండా చూస్తుంది. వీరిని గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ దేవతలతో పోల్చవచ్చు. గ్రామ రక్షణను ఈ దేవతలు నిర్వర్తించినట్టే, బంజార దేవతలు తండాను రక్షిస్తారు.
తీజ్‌ ప్రత్యేకత ఏంటీ?
పండుగ మొదలైన రోజు రాత్రి నుంచి అమ్మాయిలు తమ తండా నాయకుని ఇంటి ముంగిట్లో వారం రోజులపాటు ఆనందోత్సాహాలతో ఆటలు, పాటలు నత్యం చేస్తూ గడుపుతారు. ఆ తరువాత అమ్మాయిలు ప్రతి ఇంటి నుండి, సోలెడు బియ్యం చొప్పున పోగుచేసుకొని వాటిని తండా నాయకునికి ఇస్తారు. ఆ నాయకుడు తన తోటి నాయకుణ్ణి పిలిపించి ఆ బియ్యాన్ని అమ్ముకొని గోధుమలు, శెనగలు తెమ్మంటాడు. ఆ గోధుమలను అమ్మాయిలు తండా పెద్దల సమక్షంలో పాటలు పాడుకుంటూ ఇత్తడి బిందెలో నానబెడతారు. తరువాత రోజు సాయంకాలం అందరూ కలిసి ఇంటింటికి పోయి గోధుమలు చల్లుదామని అందరికీ చెబుతారు. అప్పుడు తండా ప్రజలంతా ప్రతి ఇంటి నుంచి ఒక బుట్టను తయారు చేసుకొని ఆవు ఎరువును తమ తమ బుట్టలలో వేసుకొని కుటుంబ సమేతంగా నాయకుని ఇంటి ముందుకు వస్తారు. ఆ బుట్టలను ఒకే చోట వరుస క్రమంలో పెట్టి నానబెట్టి గోధుమలను అతడు బుట్టల్లో చల్లుతాడు.
తొమ్మిది రోజులపాటు …
ఈ కార్యక్రమాలన్నింటికి నాయకురాలిగా వ్యవహరించే అమ్మాయి, తొమ్మిది రోజులపాటు ఆకు కూరలు మాత్రమే తినాలి. గోధుమలు చల్లిన బుట్టలను తండా నాయకునికి ఇంటిముంగిట్లో పెడతారు. అమ్మాయిలందరూ కలిసి బావి దగ్గరికి వెళ్ళి పరిశుభ్రమైన ఇత్తడి బిందెల్లో నీళ్ళు తెచ్చి, తొమ్మిది రోజులపాటు రోజుకు మూడుసార్లు బుట్టల్లో నీళ్ళు చల్లుతూ పాటలు పాడుతారు.
తీజ్‌ పండుగను సేవాభాయ దండియాడి అనే దేవత జరిపిస్తుందని, తీజ్‌ బుట్టలను పెట్టించిన దేవతనే స్వయంగా ఈ పండుగను జరిపిస్తుందని వారు విశ్వసిస్తారు.
ఏడవ రోజు ఢమోళి అనే కార్యక్రమం నిర్వహిస్తారు.
ప్రతి ఇంట్లో బియ్యం పిండితో చుర్మో రొట్టెలు చేసి వాటిని బెల్లంతో కలిపి ముద్దలు చేస్తారు. మరోవైపు తీజ్‌వున్న ఇంటి ఆవరణలో సేవాభాయ, మెరామల పూజలు నిర్వహిస్తారు.
తీజ్‌ అంటే…
”తీజ్‌ అంటే, పచ్చని గరికలా ఉండే గోధుమ నారు అని అర్థం.
వివాహం కావాల్సిన లంబాడీ యువతులు తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో, కుల దేవతలైన సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌, దండీ మేరమయాడీలను పూజిస్తారు.
మా సంప్రదాయానుసారం, ప్రతిరోజూ ఆడి,పాడి తొమ్మిదవ రోజు చెరువులో నిమజ్జనం చేస్తాం. ” అని ఇంద్రవెల్లి(ఆదిలాబాద్‌జిల్లా) చెందిన జంగూ బాయి అంటారు.
సీత్ల భవానీ పూజతో …
” బుట్టలలో గోధుమలు ఎంత పచ్చగా పెరిగితే, అంత శుభంగా జరుగుతుందని మా నమ్మకం. మా తండాలు, మా ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని యువతులు దేవతలను, పూర్వీకులను వేడుకుంటారు. తీజ్‌ పండుగ జరుపుకోవడానికి కుల పెద్ద అనుమతి తీసుకోవాలి. పండుగ ప్రారంభానికి ముందురోజు వనభోజనానికి వెళ్లి, సప్తమాతల్లో ఒకరైన సీత్ల భవానీ పూజ నిర్వహిస్తాం. ఈ సందర్భంలో పశుపక్ష్యాదులకు వ్యాధులు సోకకూడదని, సీత్ల భవాని ముందు నుంచి పశువుల మందలను దాటిస్తూ దేవలకు సమర్పించిన పదార్థాల నుంచి కొన్నింటిని వాటిపై చల్లుతారు. ” అంటారు మోతుగూడ తండా(ఆదిలాబాద్‌జిల్లా)కు చెందిన పుల్లాబాయి. పాడిపంటల కోసం
” ఈ పండుగకు ఆడబిడ్డలు పుట్టమన్ను సేకరించి దానిలో గోధుమ నారును పెంచుతారు. వానలు బాగా కురిసి పంటలు పండి రైతులంతా బాగుండాలని కోరుకోవడమే తీజ్‌ పండుగ పరమార్ధం. నిమజ్జనం రోజు ఉదయం సంప్రదాయం ప్రకారంగా శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌కు హోమం పెట్టి, దండిమేరమయాడీకి బలి పూజ చేస్తాం. ఆ రోజు వచ్చిన బంధువులతో కలిసి నాచేరో, దండామారేరో కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తాం. అదే రోజు సాయంత్రం గోధుమనారుతో ఉన్న తీజ్‌ బుట్టలను ఎవరివి వారు తీసుకుని నిమజ్జనానికి ఆడుతూపాడుతూ వాగులో కానీ పంటకుంటల్లో కానీ నిమజ్జనం.చేస్తాం .” అంటారు ఇంద్రవెల్లి మండలం,లింగాపూర్‌కి చెందిన నాగోరావు.
బెల్లం, రొట్టెలు కలిపిన…
ఒక పెద్ద గిన్నెలో కడావ్‌ వండుతారు. కడావ్‌ సిద్దమైన తరువాత తమ తమ ఇండ్లలో తయారు చేసిన బెల్లం, రొట్టెలు కలిపిన ఏడు ముద్దలను మహిళలు ఒక పల్లెంలో పెట్టుకొని వచ్చి తండా నాయకుని ఒడిలో పెడతారు. అప్పుడే సేవాబాయి కడావ్‌ నైవేద్యాన్ని సమర్పిస్తారు.
బోరడి ఘష్కేరో
బోరడి అంటే రేగుముళ్ళనీ, ఘష్కేరో అంటే గుచ్చడం అని అర్థం. అమ్మాయిలు రేగు ముళ్ళకు నానబెట్టిన శనిగల్ని గుచ్చుతారు. ఆ శనగల్ని యువకులు రాల్చడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
తొమ్మిదవ రోజు సాయంత్రం అయిదు, ఆరు ప్రాంతంలో తీజ్‌వున్న చోట తాతలు, అన్నలు, తమ్ముళ్ళు తల పాగలు కట్టుకొని వరుసగా కూర్చుంటారు. బుట్టల నుంచి తాము పెంచిన గోధుమ నారును తుంచి తాతలు అన్నదమ్ముల తలపాగల్లో పెడతారు.
గణగోర్‌
దీన్ని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. నిమజ్జనానికి ముందురోజు పుట్టి మట్టిని తెచ్చి రెండు విగ్రహాలను తయారు చేస్తారు. ఆట పాటలతో తీజ్‌ను నెలకొల్పిన ప్రదేశానికి తీసుకువచ్చి పూజారులైన ఆడపిల్లలు హోమంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. వారి మనసులో ఉన్న కోరికలను కోరుకుంటారు.
ఢమోళీ
ఈ కార్యక్రమం కూడా నిమజ్జనానికి ముందురోజు సాయత్రం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన తీపి పదార్థాలు ఒక పెద్ద పాత్రలో వేసుకుని తలపై ప్రత్యేకంగా అలంకరించిన చుట్టబట్టపై పట్టుకుని, ప్రత్యేకంగా అలంకరించిన అద్దాలు, గవ్వలు, పూసలతో తయారు చేసిన పాత్రపై కప్పుకుని అందరూ తీజ్‌ నెలకొల్పిన పెద్దాయన ఇంటికి వస్తారు.
ఉధ్వేగభరితం… నిమజ్జనం
తీజ్‌ బుట్టల్ని తీసుకొని, డప్పులు వాయిస్తూ పాటలు పాడుతూ, నత్యం చేస్తూ , వాగు సమీపానికి, ఊరేగింపుగా బయలుదేరుతారు. వాగును సమీపిస్తున్నపుడు అమ్మాయిలు ఉధ్వేగానికి లోనవుతారు. తమ ఆప్తులు దూరమవుతున్న, విచారం వీరి ముఖాల్లో కన్పిస్తుంది. తొమ్మిది రోజులు పెంచి పోషించిన గోదుమ నారును నీళ్లలో వదిలేస్తూ, శోకిస్తారు. వారి పాదాలను సోదరులు కడుగుతారు. ఎవరికి తోచిన డబ్బులు చెల్లెళ్ల చేతుల్లో పెట్టి ఓదార్చుతారు. ఆ తర్వాత మళ్ళీ డప్పులు వాయిస్తూ …
‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ
ఘేవూలారయేతోన టపారే మా గోకి’ అని పాటలు పాడుతూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. ఇలా… తీజ్‌ పండుగ ముగుస్తుంది.
‘తీజ్‌ ‘ అంతరించి పోతున్న గిరిజన సంస్కృతి. దీనిని అపూర్వంగా కాపాడుకోవడానికి తెలంగాణ అడవి బిడ్డల ప్రతీ ఏటా భక్తిగా ప్రయత్నిస్తారు.
– పూర్ణిమ (ruralmedia)

Share.

Leave A Reply