ఈ బడి ని బతికించండి …

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎప్పటిలాగే దుర్గా ప్రసాద్‌ స్కూల్‌కి వచ్చాడు. పుస్తకాల బ్యాగ్‌ మోసుకుంటూ క్లాసురూం వైపు నడుస్తుంటే, కాళ్లకు ఏదో మెత్తగా తగిలినట్టయింది.. కిందికి చూసి కెవ్వుమన్నాడు. పక్కరూంలో ఉన్న టీచర్లు, ఇతర విద్యార్ధులు పరుగెత్తుకొచ్చి అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఆ విద్యార్ధి ముందు ఓ త్రాచుపాము పడగ విప్పి బుసలు కొడుతోంది. వెంటనే కట్టెతో దానిని కొట్టి బయట పడేశారు.
70మంది బాలబాలికలు చదువుతున్న ఆ ప్రభుత్వ స్కూల్‌కి ఉన్న ప్రహారీ గోడ ఎప్పుడో పడిపోయింది.దానిని పట్టించుకునేవారు లేక, గోడ అవతల ఉన్న పొదల నుండి పాములు తరచూ వస్తుంటాయి.

 నేల మీదనే చదువులు

నేల మీదనే చదువులు

ఆ స్కూల్‌ పేరు జిల్లాపరిషత్‌ సంస్కృతోన్నత పాఠశాల. విజయనగరం జిల్లా, పార్వతీపురం నడిబొడ్డున ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అతిపురాతన పాఠశాల అది.
‘ మాకు బెంచీలు అంటే ఎలా ఉంటాయో తెలీదు. నేలమీదనే కూర్చొని చదువుకోవాలి. పాములు వస్తాయేమోననే భయంతో క్లాసులో పాఠాలు సరిగా వినలేక పోతున్నాం. అదొక్కటే కాదు, తాగునీరు లేదు,ప్లే గ్రౌండ్‌లేదు.’ అని తమ బాధలు మాతో చెప్పాడు 9వతరగతి చదువుతున్న దుర్గాప్రసాద్‌.
ఈ స్కూల్‌ వెనుక చరిత్ర ఇది
”భారతీయ ప్రాచీన భాష సంస్కృతాన్ని బోధించడానికి బ్రిటీష్‌ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న పార్వతీపురంలో 1929న సంకావీధిలో సంస్కృత ప్రాధమిక పాఠశాలను ప్రారంభించారు. 1995 లో జిల్లాపరిషత్‌ సంస్కృతోన్నత పాఠశాలగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం సర్వశిక్షా అభియాన్‌,రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్‌ నిధులతో దీనిని నిర్వహిస్తున్నారు.’ అని హెడ్మాస్టార్‌ అమిటి శ్రీనివాసరావు వివరించారు.
ప్రాచీన భాషను కాపాడుతున్న టీచర్లు…

స్కూల్‌ విద్యార్దినులందరికీ ఒకటే టాయిలెట్‌

స్కూల్‌ విద్యార్దినులందరికీ ఒకటే టాయిలెట్‌

‘ ఇక్కడ చదివే విద్యార్దులు ఇంగ్లీషు,హిందీతో పాటు సంస్కృతాన్ని తప్పని సరిగా చదవాలి. ఆరో తగగతి నుండే సంస్కృతం నేర్పుతాం, పదో తరగతి వచ్చే సరికి ఆ భాష పై పట్టు సాధించేలా విద్యార్దులను తీర్చిదిద్దుతున్నాం.ఇప్పటి వరకు ఎవరూ ఫెయిల్‌ కాలేదు. సంస్కృతం ఉచ్చారణ వల్ల మేధస్సు వికసిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. దీని వల్ల ఇతర సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు సాధిస్తారు. సంస్కృతం ప్యాస్‌ అయి ,లెక్కలు, సోషల్‌ ఏదో ఒకటి ఫెయిల్‌ అయినా టెన్త్‌ పాస్‌ అవ్వచ్చు, అనే నిబందన ఉంది. అయితే, హిందీ, సంస్కృతం రెండూ నేర్చుకోవాల్సిరావడం వల్ల, పిల్లలు ఈ స్కూల్‌లో చేరడానికి వెనుకాడుతున్నారు.” అని సంస్కృత ఉపాధ్యాయులు హరిచంద్రకుమార్‌,అప్పారావు అంటున్నారు.
ఈ స్కూల్‌ బతకాలంటే… ?
మన ప్రాచీన భాషను కాపాడుకోవాలంటే ఈ స్కూల్‌ మనుగడను కాపాడాలనే తపనతో ప్రభుత్వసాయం లేకున్నా ఇక్కడి టీచర్లే సొంత నిధులతో విద్యార్దులకు ఉచితంగా నోట్‌బుక్‌లు,బ్యాగ్‌లు, సైకిళ్లు అందిస్తూ, ఇంటింటికి వెళ్లి, మీ పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామనే భరోసాను తల్లిదండ్రులకు ఇస్తూ, ఈ స్కూల్‌ని బతికిస్తున్నారు.

ప్రహారీ గోడ లేక పాములు వస్తున్నాయి అంటున్న విద్యార్ది

ప్రహారీ గోడ లేక పాములు వస్తున్నాయి అంటున్న విద్యార్ది

ఈ సౌకర్యాలు కల్పించాలి…
ఈ స్కూల్‌లో 70 మంది విద్యార్ధులకు రెండే తరగతిగదులున్నాయి. ఒక్కో గదిలో రెండు క్లాసులను ఆటొకరు,ఇటొకరు టీచర్లు చెబుతుంటారు. ఈ కింది సమస్యలు పరిష్కరిస్తే ఈ స్కూల్‌ విద్యార్దులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఇక్కడి టీచర్లు కోరుతున్నారు.
1,సంస్కృతం సులువుగా బోధించడానికి, డిజిటల్‌ క్లాసు రూం దానికి అనుబంధంగా కంప్యూటర్‌ ల్యాబ్‌ కావాలి.
2, శిధిలావస్ధకు చేరిన గదులను పడగొట్టి, అదనంగా మూడు క్లాసురూంలు నిర్మించాలి.
3, విద్యార్దులకు తాగినీరు కోసం ఆర్వోప్లాంట్‌ని నిర్మించాలి.
4, స్కూల్‌ చుట్టు ప్రహారీ గోడ నిర్మించాలి.

కేవలం 7గురు విద్యార్దులు ఒక టీచర్‌ తో ప్రాధమిక పాఠశాల

కేవలం 7గురు విద్యార్దులు ఒక టీచర్‌ తో ప్రాధమిక పాఠశాల

4, విద్యార్దులు ప్రశాంతంగా కూర్చొని చదువుకోవడానికి,నోట్స్‌ రాసుకోవడానికి డెస్క్‌లు కావాలి.
5,70మంది బాలబాలికలు చదువుతున్న ఈ స్కూల్లో రెండే టాయిలెట్లు ఉన్నాయి. మరో రెండు ఏర్పాటు చేయాలి.
కూలుతున్న గోడల నుండి కాపాడండి.
‘ ఈ ప్రాంతంలో మాకున్నది ఇదొక్కటే బడి. ప్రైవేట్‌ స్కూల్లో చదివే స్తోమతు లేదు. కానీ, ఎపుడు కూలుతుందో తెలీని గోడల కింద బెరుగ్గా చదువుకుంటున్నాం.
కొత్త క్లాసు రూంలు కావాలి. ఆడపిల్లలకు ఇపుడున్న టాయిలెట్స్‌ సరిపోవడం లేదు..’ అని 9వ తరగతి చదువుతున్న విద్యార్దిని ఇందు చెప్పింది.
చదువులమ్మకు ఊపిరి పోస్తాం…

స్కూల్‌కి అండగా ఉంటామంటున్న మయూర్‌ పట్నాల,రవికుమార్‌ కొడిగుల

స్కూల్‌కి అండగా ఉంటామంటున్న మయూర్‌ పట్నాల,రవికుమార్‌ కొడిగుల

ఈ స్కూల్‌కి కనీస వసతులు కల్పించ డానికి ఇద్దరు స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చారు..
‘ మన ప్రాచీన భాషకు చిహ్నంగా ఈ పురాతన స్కూల్‌ మిగిలింది. దీనిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. నా వంతు సేవగా మా నాన్న అచ్చారావు గారి జ్నాపకార్దం ఈ స్కూల్‌ కి ప్రతీ రోజు మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తున్నాం.’ అన్నారు సోషలైట్‌ కొడిగుల రవికుమార్‌. వీరి స్వగ్రామం పార్వతీపురం, వీరి తండ్రి అచ్చారావు ఈ స్కూల్‌ అభివృద్ధికి కృషి చేశారు.
డిజిటల్‌ విద్య కోసం
” ఈ స్కూల్‌ ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద ఉంది. ఇక్కడ మౌలిక వసతుల సమస్యలను
విజయనగరం జిల్లా పాలనాధికారుల ముందు ఉంచి పరిష్కారానికి కృషి చేస్తాం.
విద్యార్దులు పాఠాలను మరింత వైవిధ్యంగా నేర్చుకోవడానికి డిజిటల్‌ క్లాసురూంలు, కంప్యూటర్‌ల్యాబ్‌ల కోసం, కార్పొరేట్‌ సంస్దల సాయం తీసుకొని ఏర్పాటు చేస్తాం.

ఈ స్కూల్‌ని కాపాడే ప్రయత్నంలో టీచర్లు

ఈ స్కూల్‌ని కాపాడే ప్రయత్నంలో టీచర్లు

” అని హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ్‌ స్వచ్ఛంద సంస్ద సీఇఓ మయూర్‌ పట్నాల అన్నారు.
ఇదే ప్రాంగణంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌లో కేవలం 7గురు మాత్రమే విద్యార్దులు చదువుతుండటం ఒక విచిత్రం.
అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన (1948) వెలువడి 70 సంవత్సరాలు గడుస్తోంది. అందులో విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. బాలబాలికలందరికీ సమానంగా, నిర్బంధంగా విద్యను అందించాలని సూచించింది. అయినా అనేక దేశాల్లో అది యింకా అసంపూర్తిగానే అమలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్లమంది బాలలు యింకా బడికి దూరంగానే వున్నారు. ఈ పార్వతీపురం స్కూల్‌ని కాపాడుకోక పోతే వారిలో చేరే ప్రమాదం ఉంది.
–  శ్యాంమోహన్‌/ruralmedia/nirmaan

డియర్‌ రీడర్స్‌ ఈ స్టోరీని చదివి ఊరుకోకుండా, సమస్య పరిష్కారం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి.  జిల్లా అధికారుల కి ఈ స్టోరీ లింక్‌ని పంపండి.

1, District Collector Dr. M. Hari Jawaharlal IAS, Contact -08922-276720, E mail – collector_vznm@ap.gov.in

2, Project Officer,I.T.D.A,  Dr.G.Lakshmisha IAS,  Contact –  08963-221152, E mail – poitdappm@gmail.com

3, Member of parliament,Vizianagaram, P..Ashok Gajapathi Raju , Contact 9440822599

Share.

Leave A Reply