అందగాడు చంద్ర, అందమైన గీత, ముచ్చటైన రంగులు…

Google+ Pinterest LinkedIn Tumblr +


ఆర్టిస్టు చంద్రది వరంగల్. 1946 ఆగ్టసు 28న పుట్టాడు.

ఇప్పుడు, అంటే 74 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మంచమ్మీదే వుంటున్నారు. ఆర్టిస్టు మోహన్, చంద్రలది 40 ఏళ్ల స్నేహం. బాగ్ లింగంపల్లిలో మోహన్ ఆఫీసు, చంద్ర ఇల్లు ఒకే వీధిలో వుండేవి. అలా చాలా యేళ్లు, చంద్ర వచ్చి మోహన్ దగ్గర సెటిలయిపోయేవాడు. ఆరేడు గంటలు కబుర్లు, కాలక్షేపం. ‘‘అరే మోహన్, నా బొమ్మ వెయ్యిరా… 25 ఏళ్ల నుంచీ అడుగుతున్నా’’ అన్నారోసారి చంద్ర. ‘‘తప్పకుండా వేస్తారా’’ అని మోహన్ మళ్లీ తప్పించుకున్నాడు. చంద్రకి, రెండు నెలల్లో 75 ఏళ్లు రాబోతున్నాయి. చంద్ర 70వ జన్మదినం కోసం అయిదు సంవత్సరాల క్రితం మోహన్ రాసిన వ్యాసమిది. కళా ప్రపంచంలోకి మోహన్ మిమ్మల్ని లాక్కుపోతాడు. చదవండి…

**** ****

‘‘అందగాడు చంద్ర, అందమైన గీత, ముచ్చటైన రంగులు, తనదంటూ ఒక శైలి. ఇతడి కార్టూన్లు నవ్వించును. తప్పక నేడే చంద్రను వాడగలరు’’- ఇలాంటి పిచ్చి మాటలెన్నెన్నా ఎవరేనా చెప్పవచ్చు. ‘‘పోతే చాలా కాలం నుంచీ చూస్తున్నాం. నువ్వేంటీ చెప్పేది!’’ అని మరెవరైనా తూష్ణీభావముతో పరమ వీజీగా నోరు జారొచ్చు. తప్పులేదు.
చంద్రంటే తెలీని తెలుగోడిని కనుక్కోవడం కష్టం. చంద్రంటే ఆసాంతం తెలిసినవాణ్ని పట్టుకోవడం మరీ కష్టం. ఎందుకంటే అది నలభై ఏళ్ల పని. లిస్టు తీస్తే కొన్ని వేల కథలకు నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్లు, రంగుల్లో బొమ్మలు, మరికొన్ని వేల పుస్తకాలకు అట్ట మీద బొమ్మలు, కార్టూన్లు… ఏది చెప్పినా వేలలోనే చెప్పాలి. పెయింటిగ్ లు, గ్రీటింగ్ కార్డులు, ఇవి చాలవన్నట్టు కథలు రాయడం. ఇంకాస్త టైమ్ మిగిలిందనో ఏమో సినిమాల్లో నటించడం, కొన్నిటికి పబ్లిసిటీ పని చేయటం, టీవీ సీరియల్స్ తీయటం.. కనుక రెండు కళ్లుగానీ, ఇరవై కళ్లుగానీ చూడలేని, రెండు చేతులుగానీ, అరవై రెండు చేతులుగానీ తడమలేని పనిని చంద్ర సింగిల్ హేండెడ్ గా చేసేశాడు. దిసీజ్ టూమచ్ యార్. ఇంత వాల్యూమ్ నీ, వేల్యూనీ ఉజ్జాయింపునైనా బేరీజు వేయడం ఏ సింగిల్ మానవ మాత్రుడికి మాత్రం ఎలా సాధ్యం? ఒక చంద్రుడు సమస్త జీవులకు అన్నట్టు (ఎవరేనా అన్నారా ఏంటి?) ఓ కాలేజీ పిల్లకీ, ఇంటావిడ గారికీ కథల బొమ్మల చంద్రగా కనిపిస్తాడు. కుర్ర ప్రేమికుడికి గ్రీటింగ్ కార్డుల చంద్రగా తెలుస్తాడు. కొంచెం ఎర్రజెండా బాగా పూనిన వాడికి విప్లవ చంద్ర. కవులూ అండ్ కథా రచయితల లాంటి వాళ్లకి పుస్తకాల అట్టల మేకప్ మేన్. బి.నర్సింగరావూ, వంశీ తదాది సినిమా వాళ్లకి నటుడు. పెయింటర్లకి పెయింటర్. కార్టూనిస్టులకు కార్టూనిస్టు. మాలాంటి అనవసర ప్రఖ్యాత బాల చిత్రకారులకి మాత్రం అటు పాయింట్ బ్రష్ ఇటు క్రొక్విల్ పట్టుకుని గుహ ముందు నిల్చుని ‘‘ఇలా గియ్ బే డోంగ్రే’’ అని చాలెంజ్ చేసే రాక్షసుడు. అతడి పదమూడో ఎక్కం పైకి ఎక్కబోయి ఎక్కలేక ఇక ఎక్కం అని ఠలాయించి కిక్కురుమనకుండా మౌనంగా స్మశానం కేసి నడుస్తున్నాం. కనక చంద్ర- ఒక పరిశీలన మరియు అంచనా అనే బరువైన సంగతుల్ని ఎంఫిల్, డిగ్రీ టైపు చరిత్రకారుల కొదిలేసి చిన్న పర్సనల్ అకౌంట్ లాంటిదే చెప్పడం కుదురుతుంది.

ప్లాష్ బ్యాక్. అది 1960వ దశకం. అవి నేను సెకండ్ ఫారం చదివే రోజులు.. (ఇది సింగిల్ ఎపిసోడ్ మాత్రమే. డైలీ సీరియల్ కాదు. గమనించి, నిర్భీతితో చదువగలరు). ‘చందమామ’లో చిత్ర, శంకర్ అనే ఇద్దరు మాత్రమే ప్రపంచకంలో బొమ్మలు వేశారనీ, మరెవ్వరూ వెయ్యరనీ లోతైన అవగాహన గల కాలం. కొంతకాలానికి బాపు అనే నూతన నటుడు తెరమీదికొచ్చాడు. చూడగా వాళ్లలాంటి బొమ్మలు ఈ అబ్బాయి చేతికొచ్చినట్టు లేదు. వడ్డాది పాపయ్య అనే కుర్రాడు కూడా ‘చందమామ’లో కనిపించాడు. ఏదన్నా పాళీని ఇంకులో ముంచి ఇలా గియ్యి అని ఆ బొమ్మలన్నీ అరుస్తున్నాయి. ఫ్యాన్సీ షాప్ లో అడిగితే క్రొక్విల్ చాలా కాస్ట్ లీ అని తెలిసింది. కృషి, అబద్ధాలు, దొంగతనం, పట్టుదల ద్వారా క్రొక్విల్ సంపాదించి, వీటో ఇండియన్ ఇంక్ బాటిల్ లో ముంచటం చాలా ఆనందంగా ఉండింది. కానీ కాయితం మీద గీత గీశాక అంత ఆనందం అనిపించలేదు. పైగా అలాంటి ఆనందం ఇప్పట్లో జరిగే పని కాదని ఖాయమై ఏడుపు, గోడకి తలబాదుకోవటం లాంటి అనిర్వచనీయమైన అనుభూతులు సహజంగా కలిగాయి. అలాంటి ఘటనా భరితమైన బాల్యంలో చంద్ర బొమ్మ అనేది ఈ మూలిగే నక్క పిల్ల మీద పడింది. ‘‘ఈ బొమ్మ బాగుందిరా’’ అంది మా ఉదయక్క (అంటే మా సుశీలక్క క్లాస్ మేట్ లెండి. సురభి నాటకాల స్టార్ హీరోయిన్ అవేటి పూర్ణిమగారి కూతురు. బొమ్మలు వేసేది. పాటలు పాడేది. ఎంత అందంగా ఉండేదో). లంకంత వాకిట్లో నేరేడు పళ్లు ఏరుతూ, కోకిలతో రెట్టిస్తూ నాకో ఐడియా ఇచ్చింది. అరేయ్ ఆ చంద్ర బొమ్మని హాల్లో ఉన్న మెరూన్ కలర్ క్లాత్ మీద నువ్వు కాపీ చేస్తే గీతల మీద గొలుసు కుట్టు కుడతా. అమ్మాయి లంగా మీద మనమే కచ్ వర్క్ తో అంచు వేస్తాం. ఎల్లో, బ్లూ దారాలు వాడితే బొమ్మ బాగా కనిపిస్తుంది. వెరీగుడ్ అన్నా. నేరేడు పళ్ల రెమ్యునరేషన్ కి బొమ్మ లాగేశా. పూర్ణిమ గారూ, సుశీలక్కా పొగిడారు. క్లాత్ హేంగర్ మీద కుట్టిన బొమ్మ చూసి చాలా మంది ఫ్రెండ్సూ, పక్కింటి పిన్నులూ, మా అక్క కాలేజీ కనోజుర్స్ ‘అబ్బబ్బో’ అంటూ అబ్బుర పడ్డారు. ‘నేనెప్పుడూ అంతే’ అనే ఫోజు పెట్టా. చంద్ర ఎఫెక్ట్ అలా మొదలైంది. ఇదో చరిత్రాత్మక ఘటన అని చెప్పడం కాదు. ఆ రోజుల్లో ఆర్టిస్టు అవుదామనుకున్న అనేక మందికి ఏదో విధంగా ఈ చంద్ర ఫ్యాక్టర్ కొట్టింది. అది మరో మూడు దశాబ్దాలు వెంటాడింది. ఇంకా ఈ రోజుకీ చంద్ర కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు సేకరించి కాపీ చేసి, ఆ గీతనూ, అనాటమీని నేర్చుకునే అనేక మంది కుర్ర చిత్రకారుల్ని, హైదరాబాదులో మీకు చూపించగలను. చంద్ర గీతని అర్థం చేసుకునీ, అరిగించుకునీ (లేక పూర్తిగా అర్థం చేసుకోలేకా, అరిగించుకోలేకా) ఇలస్ట్రేటర్లుగా, కార్టూనిస్టులుగా పత్రికల్లో స్థిరపడిన వారిని ఇంకా చూడొచ్చు. అరవై దశకం మొదట్లో ప్రభ, పత్రిక వీక్లీల్లో మేటర్ మధ్య ఊహా చిత్రాలొచ్చేవి. వీరిశెట్టి అచ్యుతరావు-పుల్లేటికుర్రు, బి.శశి- టేకిశెట్టిపాలెం, ఎం.శంకర్రావు-అనకాపల్లి. ఇవి పండగలకీ, పబ్బాలకీ ఎక్కువగా పల్లె జీవితం మీదుండేవి. కథలకి బొమ్మల్లో కేతినీడి భాస్కరరావు, మూర్తిలాంటి పేర్లు కనిపించేవి. యువ వచ్చి వడ్డాది పాపయ్యను తెచ్చింది. కానీ బాపూ బొమ్మల బ్రేక్ విప్లవాన్ని తెచ్చింది.

అరవయ్యవ దశకాంతం ప్రపంచాన్ని విప్లవాలు కుదిపేశాయి. అమెరికా, యూరప్ లలో యుద్ధానికి వ్యతిరేకంగా వెల్లువైన ఉద్యమం కొత్త పోస్టర్లనీ, పెయింటింగ్ లనీ పుట్టించింది. అప్పటి వరకూ అధికారం చెలాయిస్తున్న ఆర్ట్ మీద తిరగబడి రాళ్లు విసరడానికి బీటిల్స్, రోలింగ్ స్టోన్స్ కొత్త గొంతుల్నీ, కొత్త కవితల్నీ, రాగాలనీ ఎన్నుకున్నారు. ఆఫ్రికాలో వారానికో దేశం విముక్తి అవుతోంది. డేవిడ్ లాంటి బుల్లి వియత్నాం అమెరికన్ గొలియత్ ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇవన్నీ ప్రపంచం నిండా ఒక ‘వియత్నాం జనరేషన్’ని సృష్టించాయి. ఈ తరం మాటకీ, పాటకీ, డాన్స్ కీ, బొమ్మకీ కొత్త గ్రామర్ అవసరమయింది. జూల్స్ ఫైపర్ లాంటి గొప్ప కార్డూనిస్టుల గీతలూ, జాన్ లెన్నాన్ లాంటి గొప్ప గొంతులూ ఈ గ్రామర్ కి అ ఆలు దిద్దాయి. తెలుగునాట కూడా ఈ మార్పులు రాజకీయాల్లో కొంత కనిపించినా, కళారంగం మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. పత్రికల్లో సాంప్రదాయిక పద్ధతి నుంచి బాపూ తెచ్చిన పెద్ద బ్రేక్ ఒక ధోరణిగా స్థిరపడింది. దాని ప్రభావం నుండి వచ్చి ఇది మా స్టైల్ అని అప్పుడు చూపించిన వాళ్లలో చంద్ర ముందుంటాడు. బాపూ పుట్టించిన బుడుగు, శ్రీగాన పెసూనాంబ, బక్క మొగుడు-బండ పెళ్లాం, అప్పడాల కర్రలు, అప్పారావూ, బంగారం-సింగారం, బుజ్జాయిగారి డుంబు, సత్యమూర్తిగారి చదువుల్రావు, సత్యంగారి బోల్డ్ టైపు…. ఇవన్నీ 70వ దశకంలో కూడా వచ్చి తెలుగు హ్యూమర్ కార్టూన్ లకి సింబల్స్ అయ్యాయి. వాటి మధ్య నుంచే చంద్ర వచ్చాడు. ఆ వరసలో చంద్ర కార్టూన్లూ ముందుకు వచ్చాయి. క్రమంగా కార్టూన్ ని, ఐడియాను ప్రజెంట్ చేయడంలోనే పెద్ద బ్రేక్ తెచ్చాడు. తూర్పు యూరప్ లో, అమెరికాలో మెయిన్ స్ట్రీమ్ కార్టూన్లు కాకుండా చాలా స్టైలైజ్జ్ గా ఉండే కార్టూన్ల విజువలైజేషన్ కూ సమాంతర ధోరణిని ప్రవేశపెట్టాడు. ఇలాంటి ధోరణిని చంద్ర తర్వాతి తరం కార్టూనిస్టులు కూడా అందులేకపోయారు. కార్టూన్ కాకికి కన్నుగా ఒక చుక్క పెడతారు గదా! అలాంటి చుక్క కన్నులేని కాకి నేల మీదున్న చుక్కని మింగి కన్ను తెచ్చుకుంటుంది. ఇందులో విరగబడి నవ్వేదేం లేదు. కానీ ఐడియా మెరుపు మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది. అష్టవంకర్లు తిరిగిన హోస్ పైప్ తో తోటమాలి నీళ్లు పెడుతుంటాడు. నీళ్లూ అష్ట వంకర్లుగానే తిరిగి పడుతుంటాయి. నవ్వొచ్చిందా? లేదు! మర్చిపోగలరా? లేదు! ‘రిక్లైనింగ్ న్యూడ్’ లాంటి పేరుండే ఆడ పెయింటింగ్ ను ఆర్టిస్టు మోసుకెళుతుంటాడు. కానీ ఫ్రేమ్ పట్టుకుని కాదు. అందులోని నడుం మాత్రం పట్టుకుని. చిలిపి? కాదు! కార్టూన్ బాక్స్ మధ్యలో గుండ్రని సూర్యుడు. చుట్టూ తిన్నగా కిరణాల గీతలు. ఒక్క గీత మీద వాలిన పిట్ట బరువుకి కిరణం వంగిపోతుంది. సూర్యుడికి కోపం! తమాషా! కాదు! కవులు పద్యాల్లో రాసే ఉపమానాలకి చిత్రాల్లో చెప్పే చిత్రమైన భాష్యం. కనిపించని కాంతి కిరణంలాంటి కనిపించే ఇంకు గీత వంగి రుజువర్తనాన్ని చాలెంజ్ చేస్తుంది. బ్యాటరీ లైట్ వెలుగు కూడా ఎదురుగాలికి వెనుదిరిగి అదే పని చేస్తుంది, లేదా బాటరీలు వీక్ అయి వెలుతురు నేల మీదకి కారిపోతుంది. ఇవన్నీ కార్టూన్లలో కవితలు. కళాకారుడి కంట్రోల్డ్ మైండ్ వాండరింగ్ లో కొత్త సందు గొందులు.


1979, visaalandha anniversary, Vij. Sri Sri, Chandra, Mohan.

చంద్ర ఇలాంటి కార్టూన్లు గీసి చాలా సంవత్సరాలైనా సరే మన కార్టూనిస్టులెవరూ ఈ క్యూ అందుకోలేకపోవడం ట్రాజెడీ. ఆ వరకూ చంద్ర చాలా దశాబ్దాల ముందున్నాడు. రష్యాలో గోర్బచేవ్ గ్లాస్ నోస్త్ కాలంలో ఆ తర్వాత నైరూప్యమైన భావాలపై కార్టూన్లు తెగ వచ్చాయి. వ్యవస్థ, నియంతృత్వం, పార్టీ, బ్యూరోక్రసీ లాంటి ఎన్నో సబ్జెక్టుల మీద కార్టూనిస్టులు రకరకాల బొమ్మలు గీశారు. రూపంలేని ఆలోచనలకు రూపు కంటే సింబల్స్ ని వెతుక్కున్నారు. అందువల్ల వాళ్ల కార్టూన్ భాషే మారిపోయింది. అంతకు చాలా సంవత్సరాల ముందే తెలుగు కార్టూన్ భాషని చంద్ర మార్చాడు. కొత్త సింబల్స్, కొత్త పదాల్ని ఇండియన్ ఇంకులో ముంచి వెలిగించాడు. అంతకు ముందుగా ఇల్లూ, స్కూలూ, డాక్టరూ, ఆఫీసులో బాసూ, గుమస్తా, చెట్టు కింద ప్రేమా లాంటి మిడిల్ క్లాస్ రింగులో గిరికీలు కొడుతున్న తెలుగు కార్టూన్ సరిహద్దుని ఆకాశ మార్గం పట్టించాడు చంద్ర. అనన్య సామాన్య సర్క్యులేషన్ గల దినపత్రికల రాజకీయ కార్టూన్ లన్నీ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ల కుర్చీలకీ, అధిక ధరలూ, అవినీతి, కరువూ, వరదా, పోలీసు స్టేషన్ లకీ కట్టేసి ఉంటాయి. వాటిలో ఈ వైల్డ్ ఇమాజినేషన్ కి సందే లేదు. సోషల్ కార్టూన్లు వేసే కథల పత్రికలు 60, 70 దశకాల్లో వెలిగి, ఇప్పుడు చతికిలబడ్డాయి. అంతంత మాత్రంగా మిగిలిన పత్రికల్లో కూడా కార్టూన్లు పాతికేళ్ల నాటి ఫక్కీలోనే వస్తున్నాయి.

ఈ దరిద్రాన్ని బద్దలు కొట్టలేమా అంటే గ్యారంటీగా కొట్టొచ్చు. అలా చెయ్యడానికి చంద్ర కార్టూన్లే ఆయుధాలు. ‘‘ఏ కార్టూనిస్టుకైనా ముందుండే సవాలు- పాత విజయాలనే మళ్లీ మళ్లీ డూప్లికేట్ చేయడం కాదు. వాటి మీద కొత్తవి సృష్టించాలి’’ అంటాడు బిల్ వాటర్సన్ (‘కాల్విన్ అండ్ హాబ్స్’ పులీ-పిల్లవాడి స్ట్రిప్ కార్టూన్ ఫేమ్). ‘‘కార్టూన్లు చదవడం వల్లే కార్టూనిస్టులు నేర్చుకుంటారు’’ అంటాడాయన. చంద్ర ఈ రెండు పనులూ బాగా చేశాడు. చంద్ర చూసినన్ని, చదివినన్ని, పోగేసినన్ని కార్టూన్లు ఎవరూ చేయలేదని నా అనుమానం. పాత విజయాల మీద కొత్త సృష్టి చేయడం చంద్ర గీసిన కొత్త తరహా కార్టూన్లే. రెండు మనుషులూ, పైన రెండు డైలాగు బల్బుల మొనాటనీని బ్రేక్ చేసిన చంద్ర మనందరికీ కొత్త దారి చూపిస్తున్నాడు.
పోదాం పదండి.

– మోహన్ ఆర్టిస్ట్.

Share.

Leave A Reply