నా పెడిన మరమింగ్ హెరెంగ్ కిత

Google+ Pinterest LinkedIn Tumblr +

బతుకు పోరు కోసం చేసే ప్రయత్నంలో, ఆదివాసీ కుటుంబంలో వచ్చిన మార్పు ఇది. 
ఇది రెండు మేకల్ని 60 మేకలు చేసిన మాంత్రికుడి కథ. 
ఇదేదో మాయలు మంత్రాలతో మేకల సంఖ్యని పెంచిన చందమామ కథకాదు. 
ఏకలవ్య ఫౌండేషన్‌ ఆర్ధిక సాయంతో రెండు మేకలను పొంది, వాటిని క్రమంగా అరవై మేకలకు పెంచిన శ్రామికుడు కొమర ముత్తా కథ. 
ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో జాలం తాండా, కొలాం గూడా జంట పల్లెలు. సాగునీరు లేక,వర్షాధార పంటల మీద అందరూ ఆధార పడి బతుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ నాబార్డు సాయంతో, ఏకలవ్య ఫౌండేషన్‌ వాటర్‌షెడ్‌ పథకం అమలు చేసింది. ఫలితంగా ఈ గ్రామాల్లోని బీడు భూములు సాగులోకి వచ్చాయి. 
ఈ పథకంలో భాగంగా, భూమిలేని రైతుల జీవనోపాధుల కోసం పశుపోషణకు రుణాలు ఇచ్చారు. అలా సాయం పొందిన కొమర ముత్తా రెండు మేకలను కొన్నాడు. వాటిని రోజూ అడవుల్లోకి తీసుకెళ్లి మేపాడు. 
అక్కడ మేకల్ని పెంచడం సాహసమే… 
రోజూ దట్టమైన అడవుల్లోకి వెళ్లి రావడం జీవన్మరణ పోరాటమే, కవ్వాల్‌ అభయారణ్యం సమీప అడవులవి. పులులు,తోడేళ్ల నుండి మేకలను కాపాడటం సాహసమే. కొన్ని సార్లు తనను తాను కాపాడు కోవడానికి చెట్లమీద ఉండాల్సి వచ్చేదని ధైర్యం నిండిన కళ్లతో అంటాడు కొమర ముత్తా . 
కొన్ని మేకలు అడవి జంతువుల పాలైనా, మిగిలిన వాటిని శ్రద్ధగా పోషించడం వల్ల క్రమంగా అవి అరవై సంఖ్యను దాటాయి. చేతికి అంది వచ్చిన మేకలను అమ్ముకుంటూ అతడు స్వయం సమద్ధిని సాధించాడు. 
అప్పుల నుండి విముక్తి 
ఇప్పుడా గోండు గిరిజనుడికి ఆర్థిక ఇబ్బందులు లేవు. అప్పులు లేవు. అతడికి మేకలను ఇవ్వడంతోపాటు వాటి ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యతను కూడా ఏకలవ్య ఫౌండేషన్‌ తీసుకుంది. ప్రతి వారం ఒక పశువైద్యుడు మేకల ఆరోగ్యాన్ని పరిశీలించి, అవసమైన జాగ్రత్తలు సూచిస్తాడు. 
మేకలు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే కొమర ముత్తా తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాడు. ఇపుడు అల్లుడు, కూతురు కూడా మేకల పెంపకం చేపట్టారు. వీరి ప్రగతిని చూసిన జాలం తాండా రైతులు కొందరు వీరి అడుగు జాడల్లో నడుస్తున్నాడు. 


‘నా పెడిన మరమింగ్ హెరెంగ్ కిత ‘అంటే మేకలు చేసిన పెళ్లి అని గొండు భాష లో అర్థం

Share.

Leave A Reply