ఆ ఊరికి..సంతోష్‌ సగం బలం!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఓ యువకుడి సంకల్పం.. గిరిజన గూడెంలో అక్షరమై వెలిగింది. పలకాబలపం తెలియని బాల్యానికి పాఠశాలను పరిచయం చేసింది. మరోభాష ఎరుగని చిన్నారులకు ఇంగ్లిష్‌ నేర్పింది.బక్కచిక్కిన  శరీరాలకు పౌష్ఠికాహారం అందించింది. ఆ పూరిపాకలో ఇప్పుడు నలభైమంది గిరిజన బాలలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొంటున్నారు. ఎవరికి తెలుసు? అందులో ఓ అంబేడ్కర్‌ ఉండవచ్చు, ఓ కొమ్రుం భీమ్‌ ఉండవచ్చు. జీతే రహో.. సంతోష్‌ భాయ్‌!

తూర్పు తెలంగాణ, ములుగు జిల్లా, నార్లాపూర్‌ నుంచి భూపాలపల్లికి వెళ్లే దారిలో బయ్యక్కపేట అనే ఊరు. అక్కడికి అయిదు కిలోమీటర్ల దూరంలో చిక్కటి అడవి. పెద్దపెద్ద వృక్షాలు. దాటుకొని వెళ్తే.. ‘నీల్లం తోగు ’ వాగు. దానిపక్కనే, కోయ గిరిజనుల ఆవాసం. దాన్ని కూడా ‘నీల్లం తోగు’ అనే పిలుస్తారు. వర్షాకాలం వాగు పొంగితే అటువైపు వెళ్లడం కష్టం. ఒక సంవత్సరం పాటు ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని, చిన్నారుల పరిస్థితులను సంతోష్‌ ఇస్రం అధ్యయనం చేశాడు. సమస్యలకు కారణాలను విశ్లేషించాడు. అవేవీ పరిష్కరించలేనంత క్లిష్టమైనవి కావు. అవసరమైందల్ల్లా సమష్టి తత్వం, ఓ నాయకత్వం. ఆ ఫలితమే ‘భీమ్‌ చిల్డ్రన్‌ హ్యాపీనెస్‌ సెంటర్‌’. నాయకుడి పేరు.. సంతోష్‌ ఇస్రం.

ఏమీ లేని చోట: ‘ఇదంతా అటవీ ప్రాంతం. బస్సు కాదు కదా, ఆటోలు, బైకులు కూడా పోలేవు. కాలి బాటా సరిగా లేదు. చదువుకొన్న వారు లేరు. కనీసం చదువు అనే మాటను కూడా ఇక్కడి పిల్లలు విని ఉండరు. ఈ పరిస్థితిలో చిన్నారులకు అక్షరాలు నేర్పించాలనే లక్ష్యంతో.. చిన్న పూరిపాక నిర్మించుకొని, ఒక ప్లే స్కూల్‌ను ఏర్పాటు చేశాను. తెలుగు, ఇంగ్లిష్‌తో పాటు కథలు, పాటలు, ఆటలు నేర్పిస్తున్నాం. ఈ పిల్లలు వాగులూ వంకలూ, చెట్లూ పుట్టల వెంట తిరగకుండా కట్టడి చేస్తూ మెల్లగా బడికి అలవాటు చేస్తున్నాం..’ అన్నాడు సంతోష్‌ ఇస్రం. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైబర్‌ లా విద్యార్థి. కరోనా కారణంగా యూనివర్సిటీ మూతపడటంతో, సొంతూరు ములుగు చేరుకొన్నాడు.  ములుగు నుంచి నీల్లంతోగుకు పదహారు కిలోమీటర్ల దూరం. సగం వరకూ బైక్‌పై వెళ్లవచ్చు. కానీ, మిగతా సగం మాత్రం.. చెట్లమధ్య కాలినడక తప్పదు. మొదట్లో వారానికోసారి  వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశాడు. వెళ్లినప్పుడల్లా పిల్లల కోసం గుడ్లు తీసుకెళ్లేవాడు. వాళ్లతో ఆడి, పాడి, చదువు చెప్పడం మొదలు పెట్టాడు. అలా పిల్లలను చదువులకు అలవాటు చేశాక.. ఊరివాళ్లకు స్కూల్‌ గురించి చెప్పి ఒప్పించాడు. అలా పూరిపాకలో క్లాసులు ప్రారంభం అయ్యాయి. 

అందరి అండా..

10.7.2020/namasteTelangana

ఈ బడికి సంతోష్‌ సగం బలమైతే.. మిగతా సగం.. మిత్రులూ, భావసారూప్యం కలిగిన వ్యక్తులూ. గున్మంతరావు, శేషేందర్‌ రెడ్డి ఈ అక్షర యజ్ఞంలో చురుకుగా పాలుపంచుకొంటున్నారు. కొందరు పరోక్షంగా అర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. కొందరు ఫర్నిచర్‌, స్టేషనరీ, ఆట వస్తువులు అందించారు. కొందరు వలంటీర్‌ కోసం జీతాన్ని ఇస్తామని ముందుకొచ్చారు. పిల్లలకు చదువు చెప్పడమే కాదు.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించీ గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నది సంతోష్‌ బృందం. అంతేకాదు, చెట్లను నరికేయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఉసిరి,మామిడి వంటి పండ్ల మొక్కల్ని పెంచితే సుస్థిర ఆదాయం పొందవచ్చని  చెబుతున్నారు. 

వై‘విద్య’మైన పాఠాలు: హ్యాపీనెస్‌ సెంటర్‌కు టైమింగ్స్‌ లేవు.  ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా వెళ్లవచ్చు. అప్పుడే పిల్లలు ఇష్టపడుతారని, ఇలా చేశాడు సంతోష్‌. స్కూలు ప్రారంభించిన కొత్తలో చాలా తక్కువ మంది వచ్చేవారు. నిత్యం పండ్లు, బిస్కట్‌లు ఇస్తుండటంతో పిల్లల సంఖ్య పెరిగింది. బాలల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఆటల పోటీలు నిర్వహిస్తాడు. బాగా చదువుతున్నవారికి బహుమతులు ప్రకటిస్తాడు. మార్కులను బట్టి కాకుండా పిల్లల పరిశుభ్రతను బట్టి, చురుకుదనాన్ని బట్టి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తయారు అవుతుంది. పది రోజులకు ఒకసారి బెస్ట్‌ స్టూడెంట్స్‌కు మంచిమంచి బహుమతులు ఇస్తున్నారు. వాళ్లకు ప్రాథమిక అక్షర జ్ఞానం వచ్చాక.. దగ్గర్లో ఉన్న హాస్టల్‌లో చేర్పించాలని సంతోష్‌ ఆలోచన. ఆతర్వాత కూడా పూర్తిగా వదిలిపెట్టకుండా.. పదిహేను రోజులకు ఒకసారి హాస్టల్‌కు వెళ్లి, వాళ్లకు మద్దతుగా ఉండాలన్నది తన నిర్ణయం. ఇక్కడి పిల్లల్లో పోషకాహార లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో.. రోజూ  పోషక విలువలతో కూడిన ఆహారం  అందిస్తున్నాడు. ‘మేం కూలీ పనికో, కట్టెలకో పోయినప్పుడు మా పిల్లలను పట్టించుకొనే వారు ఉండరు. ఇప్పుడు బడి వచ్చింది. పిల్లలంతా అక్షరాలు నేర్చుకోవడం సంతోషంగా ఉంది. మాకెట్లనో చదువు లేదు. బిడ్డలైనా చదువుకుని బాగు పడతారని ఆశ…’ అంటారు గ్రామస్తులు మడివి భద్రయ్య, పద్దం సంధ్య. ప్రస్తుతం ఈ సెంటర్‌లో నలభైమంది చిన్నారులు ఉన్నారు. అందరూ ఆరేండ్ల లోపువాళ్లే. ఎవరికి తెలుసు, వాళ్లలో డాక్టరో, లాయరో, కలెక్టరో, అంబేడ్కరో, కొమ్రుం భీమో..  ఉండవచ్చు! -Shyammohan

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg4

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

………………………………………………

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply