అభివృద్దికి అడుగు జాడ ….’ దుప్పాడ ‘
విజయ నగరం జిల్లా కేంద్రానికి3 కిలో మీటర్ల సమీపంలోని దుప్పాడ గ్రామంలోకి అడుగు పెట్టగానే ఆకర్షణీయమైన పంచాయితీ భవనం ఆకుపచ్చని మొక్కలతో స్వాగతం పలుకుతుంది. అద్దంలా మెరిసే సీసీరోడ్లు,అందంగా తీర్చిదిద్దిన ఎన్టీఆర్ గృహాలు, నిండిన పంటకుంటలతో అడుగడుగున అభివృద్ది కనిపిస్తుంది. ఈ గ్రామస్తులు నరేగా పథకంలోని అన్ని పనులను చేపట్టారు.
99శాతం మరుగుదొడ్లు, పంచాయితీ భవనాన్ని,అంగన్వాడీ కేంద్రం,శ్మశాన వాటికను అభివృద్ది చేసి రహదారులు వేయడంతో కాటి కష్టాలు తీరాయి. 300ల మొక్కలు నాటారు.గ్రామ పంచాయితీ,ఎంపీ ల్యాడ్స్ నిధులతో సోలార్ పంప్ సెట్‌ని ఏర్పాటు చేసుకొని చెరువు నీటిని వాటర్ ట్యాంక్ పైకి పంపుతూ ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు.
” జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మా గ్రామస్తులకు ఆర్ధికంగా తోడ్పడి, మౌలిక వసతులు కల్పనకు చేయూతనిచ్చింది. మొత్తం జాబ్‌కార్డుల సంఖ్య 520. గ్రామ జనాభా 4500. నాడెప్ కంపోస్టుపిట్లు, ఎన్టీఆర్ గృహాలు, సీసీ రోడ్లు నిర్మించుకున్నాం.
గతంలో వృధాగా పోయే వాన నీటిని, పంటకుంటల్లోకి మళ్లించి, భూగర్బజలాలను పెంచాం. పంచాయితీ సభ్యుల నిధులతో 118 మంది విద్యార్దులకు పుస్తకాలు,బ్యాగులు ఇచ్చాం.రామాలయం నిర్మించుకున్నాం.ఎల్ఇడి స్ట్రీట్ లైట్లు,మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. గ్రామీణాభివృద్ది శాఖ సహకారంతోపాటు వ్యవసాయ శాఖ,ఎంపీ ల్యాడ్స్‌తో, ప్రజల సహకారంతో దుప్పాడను ఆదర్శ గ్రామంగా మార్చుకున్నాం”.అంటారు గ్రామసర్పంచ్ సైలాడ అరుణ.