జర్నలిజం జిగేలు రాణీగా మారి…

Google+ Pinterest LinkedIn Tumblr +

జర్నలిజంలో, అనగా దినపత్రికల్లో వార్తలకు హెడ్డింగ్ పెట్టడానికో ప్రత్యేకతా, ప్రాధాన్యతా వున్నాయి. శీర్షిక బావుంటే, వార్త చదివే ఆసక్తి కలుగుతుంది పాఠకుడికి. కనక హెడ్డింగ్ catchyగా ఉండటానికి తెగ తాపత్రయ పడతారు జర్నలిస్టులు. చిన్న ట్విస్టు, శ్లేష, వ్యంగ్యం, మెరుపుల్లాంటివి శీర్షికను బతికిస్తాయి. శీర్షికల వెనక వెలుగులోకి రాని కథలుంటాయి. అవి బావుంటాయి.

సోవియెట్ లో గోర్బచెవ్ నాయకత్వాన కమ్యూనిస్టుల పాలన కుప్పకూలిపోయింది. అప్పుడు అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పెట్టిన శీర్షిక:
The Party Is Over.
సోవియట్ యూనియన్ని 16 సంవత్సరాలపాటు పరిపాలించాడు లియోనిద్ బ్రెజ్నెవ్. అధ్యక్షునికి జబ్బు చేసి ఆస్పత్రిలో చేరాడు. బ్రెజ్నెవ్ కి ఏమైందని మాస్కోలోని విదేశీ విలేకరులు అడిగారు. ‘‘బాగా జలుబు చేసింది’’ అని అధికారులు చెప్పారు. మరో నెల తర్వాత విలేకరులు ఎంక్వయిరీ చేశారు. He is suffering with severe cold అని జవాబు. మరో 15 రోజుల తర్వాత బ్రెజ్నెవ్ చనిపోయారు. అప్పుడు ఖ్యాతిగాంచిన అమెరికన్ TIME magazine పెట్టిన పెద్ద శీర్షిక:
LEONID BREZHNEV DIED WITH HISTORIC COLD.
ఓ సారి మతగురువు పోప్ అమెరికా వెళ్లారు. న్యూయార్క్ లో విలేకరుల సమావేశం. ‘‘అయ్యా, మీరిక్కడ ఏం చూడాలనుకుంటున్నారు? నైట్ క్లబ్స్ భలేగా ఉంటాయి. వాటిని సందర్శిస్తారా?’’ అని ఓ విలేకరి అడిగాడు. ఆశ్చర్యపోయిన పోప్, ఇక్కడ నైట్ క్లబ్బులు వున్నాయా? అని అడిగారు. మర్నాడు, ప్రతిష్ఠాత్మకమైన అమెరికా దినపత్రిక- వాషింగ్టన్ పోస్ట్ ప్రధాన శీర్షిక:
ARE THERE ANY NIGHT CLUBS IN NEWYORK?- POPE ENQUIRED.
వక్రీకరణకు ఆదిగురువు అమెరికన్ జర్నలిజమే!

*** *** ***

జర్నలిజం పవిత్రమైనదనీ, ప్రజల కోసం, దేశం కోసం అహోరాత్రాలూ శ్రమించేదనీ మనందరికీ తెల్సిందే. అది రానురానూ వ్యాపారంగా మారింది. బ్లాక్ మెయిలింగ్ పవర్ గా ఎదిగింది. జర్నలిజం జిగేలు రాణీగా మారి… పొలిటికల్ బ్రోకర్ గా సరికొత్త డాన్సులు నేర్చింది. అచ్చూ మన కమర్షియల్ తెలుగు సినిమాలాగా తయారైంది. ఎన్టీరామారావు అనే ‘అతి’పెద్ద నటుడు జయప్రదని ఉప్పెంక్కించుకుంటాడు. శ్రీదేవి వీపుమీద గుద్దుతాడు. మన ఆరాధ్య దేవత జయసుధని కాలితో తంతుంటాడు. చెప్పుకోలేని దారుణాలన్నీ చేస్తుంటాడు. సినిమా చూసేది రిక్షావాళ్లు, ఆటో డ్రైవర్లు, నిరక్షరాస్యులు, రోజు కూలీలు, ఏడో క్లాసు మూడు సార్లు తప్పినోళ్లు… ఇలాంటి అమాంబాపతు గాళ్లని సినిమా వాళ్లకు బాగా తెలుసు. కొడితే వాళ్లనే కొట్టాలి. డబ్బులు జలజలా రాలాలంటే ఈ వెర్రిజనం సలసలా మరిగిపోవాలి. కొంచెం అటుఇటుగా వార్తా పత్రికలదీ అదే ఎత్తుగడ.

పొద్దున్నే న్యూస్ పేపర్
ఎవరు చదువుతారు?

పెద్దవాళ్లూ, నాయకులూ సరే, ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలూ, అభిమానులూ… అసలు సిసలు సీరియస్ రీడర్స్ వీళ్లే! రాజశేఖర్ రెడ్డనీ, చంద్రబాబనీ, కేసీఆరనీ పొద్దున్నే చొక్కాలు చించుకుని, కర్రలు పట్టుకుని బయల్దేరేది యీ పిచ్చి పార్టీ కార్యకర్తలే!
దిగువ మధ్య తరగతి వాళ్లూ, బిలో ది పావర్టీలైనుగాళ్లూ, సెన్సిబుల్ సెమీ యిల్లిటరేట్స్ మాకు కాప్టివ్ ఆడియెన్స్… అని జర్నలిస్టులకు తెలుసు.
ఇక వాళ్లని ఇంప్రెస్ చేశావా… నీ సినిమా హిట్టయినట్టే. గతంలో మాస్ అనీ, ఇపుడు ఊరమాస్ అనీ అంటున్నది వాళ్లనే.
*** *** ***

1982. తిరుపతి ‘ఈనాడు’ ఎడిషన్.
ఆఫీసు రేణిగుంటలో. ప్రఖ్యాత రచయిత కె.ఎన్.వై.పతంజలి మా బాస్. నేను షిఫ్టు ఇన్ ఛార్జిని. అంటే వో పాతిక మంది సబ్ ఎడిటర్లు, అనేక మంది విలేకరులు రాసిన, పంపిన వార్తలతో రేపటి పేపర్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రతి రోజూ ఒక లోకల్ వార్తని మొదటి పేజీలో హైలైట్ చేస్తాం. అది గోల్డెన్ రూల్. సర్క్యులేషన్ పెంచుకునే చిట్కా.

చిత్తూరు జిల్లా వార్త ఒకటి పేజీలో పెట్టాలి. అప్పట్లో బగ్గిడి గోపాల్ అని చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వుండేవాడు. 82కి తెలుగుదేశం గాలి వీస్తోంది గనక అతను టీడీపీలో చేరవచ్చు అనే వూహాగానమే వార్త. కాంగ్రెస్ కి గోపాల్ రాజీనామా? అని హెడ్డింగ్ పెట్టా. పతంజలి గారు మార్చమన్నారు. ‘తెలుగుదేశంలో చేరనున్న గోపాల్?’ అని పెట్టా. ఎప్పుడూ ఇవేనా కొత్తగా పెట్టండి అన్నారాయన. నా పిచ్చి మొహం చూసి, పతంజలిగారు ‘‘గెంతాడనో, దూకాడనో…. పెట్టొచ్చుగా’’ అనేసి వెళ్లిపోయారు. సరే, అనుకుని ‘‘గోడ దూకనున్న గోపాల్?’’ అని పెట్టాను మొదటి పేజీలో కొట్టొచ్చినట్టుగా. మర్నాడు మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లేసరికి, చిత్తూరు విలేకరి వున్నాడు, ఒంటినిండి దెబ్బలతో. ‘‘కొట్టారు సార్.. గోపాల్ రౌడీముండా కొడుకు సార్. హెడ్డింగులు నేను పెట్టను. అక్కడ పతంజలీ, ప్రకాషూ అని వుంటారు అని చెబితే, నా కొడుకులు వాళ్లిద్దరి చేతులూ, కాళ్లూ విరగ్గొడతాం అంటూ దారుణంగా కొట్టారు’’ అని చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లకుండా ఇటొచ్చావేం అని అడిగితే మీకు చూపిద్దామని అన్నాడు. సరే యిప్పుడేం చేయాలి? ఎమ్మెల్యే ఖండన, సుదీర్ఘ వివరణని వార్తగా రాశాం. దానికి ‘‘నేను గోడ దూకడం లేదు: గోపాల్’’ అని హెడ్డింగ్ పెట్టాను.
‘‘ఆ గోడేంట్రా… ఆ దూకడమేంట్రా…’’ అంటూ మర్నాడు చిత్తూరు విలేకరిని యువర్ మదర్స్… అండ్ అదర్స్ అని తిడుతూ మళ్లీ చచ్చేట్టు కొట్టారు. Those were the problems of working in a popular daily.
*** *** ***

T.prakash

మేం రేణిగుంట ఈనాడులో పని చేస్తున్నపుడే పురిపండా అప్పలస్వామిగారు చనిపోయారు. పురిపండా నాకు బాగానే తెలుసు. విశాఖలో ఆయన ఇంటికెళ్లి చాలాసేపు మాట్లాడాను కూడా. ఒరియా సాహితీ చరిత్ర రాసిన తెలుగువాడు పురిపండా! శ్రీశ్రీ తొలి కవితని అచ్చేసిన వాడు. రామాయణ, మహాభారతాల్ని వాడుక భాషలో రాసినవాడు. ఆయనంటే నాకు బాగా సెంటిమెంటు. దాంతో, ఆవేశపడి ఆయన మరణ వార్తని వివరంగా శ్రద్ధగా రాశాను. ఫస్ట్ పేజీ బాటమ్ లో పెద్ద వార్త. ‘‘వ్యవహారిక భాషోద్యమ కరదీపిక పురిపండా అస్తమయం’’ అని హెడ్డింగ్ పెట్టాను. ఆ హెడ్డింగ్ ఉన్న న్యూస్ ప్రింట్ కాగితాన్ని తీసుకుని, డస్ట్ బిన్ లో పడేశారు పతంజలి. ప్రాణం చివుక్కుమంది. ఆయనేమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాల తర్వాత ఇంకో కాగితంపై హెడ్డింగ్ రాసిచ్చారు. పతంజలి పెట్టిన శీర్షిక:
‘‘వినపడని దూరాలకు వెళిపోయిన పురిపండా’’.. వెలిగిందా? నాకైతే వెలగడం మాట అటుంచి బుర్ర తిరిగిపోయింది. జీవితాంతమూ వాడుక భాష గురించి పోరాడిన ఒక మహానుభావుడు చనిపోతే, నేను పూర్తిగా సంస్కృత పదాల్తో హెడ్డింగ్ పెట్టాను. అంతకంటే అపచారం ఏముంటుందీ? పతంజలితో అదే వచ్చింది. చెప్పడు… షాకిస్తాడు. నిద్రపడితే ఒట్టు ఆ రాత్రి!
*** *** ***

విశాఖ ‘ఈనాడు’ 1980 కావొచ్చు.
పతంజలి దగ్గర పని చేస్తున్నా. ఆయన మా షిఫ్టు ఇన్ ఛార్జి. త్వరలో పార్టీ పెట్టబోయే ఎన్టీరామారావు పట్టరాని ఆవేశంతో వూగిపోతూ ‘‘ఛివరి రఖ్తపు భొట్టు దాఖా…’’ అంటూ తెగ మాట్లాడాడు. టెలీ ప్రింటర్ మీదొచ్చిన కాగితాలు నాకిచ్చి, మొత్తం రాయండి అన్నాడు పతంజలి. పెద్ద న్యూస్ ఐటం. రాశాను. హెడ్డింగ్ పెట్టాను. తీసిపారేశాడు పతంజలి. ఇంకో హెడ్డింగ్ పెట్టాను. ‘‘ఇలా వద్దులెండి’’ అన్నాడు. దానికి ఆ రోజు పతంజలి పెట్టిన పతాక శీర్షిక: యావజ్జీవ ప్రజాసేవ! అది రామోజీ రావు పత్రిక. ఎన్టీరామారావు ప్రసంగం. అలా కామెంటు చేయకూడదనీ, జర్నలిజం రూల్స్ ప్రకారం అనైతికమనీ ఆయనకి తెలుసు. కావాలంటే ఎన్టీయార్ వోవర్ యాక్షన్ చేశాడని మర్నాడు ఎడిటోరియల్ రాసుకోవచ్చు. తిట్టొచ్చు. జోకులేసుకోవచ్చు. ఎన్టీయార్ ప్రసంగం చదివి పతంజలికి కోపం వచ్చింది. పతంజలి రాజు గారు కదా… ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా అస్సలు పట్టలేం. దేన్నీ లెక్క చేయడు. అది ఆయన వ్యక్తిత్వం! అదే తిరస్కారం!
– తాడి ప్రకాష్, 97045 41559

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg4

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

………………………………………………

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి,  https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply