2009 – 2019 ఒక సక్సెస్ స్టోరీ

Google+ Pinterest LinkedIn Tumblr +
srinivasareddy_family_2009-2019

చిత్తూరు జిల్లా రైతు శ్రీనివాసులు రెడ్డి తన భూమిని పరిశ్రమలకిస్తున్నాడని తెలిసి, అతనికి భూమి విలువ చెబుతామని, ఈ మట్టి దిబ్బల దారిలో సత్యవేడు దగ్గర చిగురు పాళెం వెళ్లాం. ఒక పూరింట్లో భార్యా,కూతురుతో బిక్కుబిక్కుమంటూ కనిపించాడు. ” మా తాతల కాలం నుండి ఈ ఐదున్నర ఎకరాల భూమిని నమ్ముకునే బతికాం.వర్షాధార వ్యవసాయం. నానా తంటాలు పడి సాగుచేస్తే ఏడాదికి 30 వేలు కూడా రావడం లేదు. చుట్టూ అప్పులు , కూతురికి పై చదువులు చదివిద్దామంటే చిల్లిగవ్వలేదు. ఇలాంటి పరిస్ధితిలో కంపెనీలు వస్తున్నాయంటే సర్కారుకి భూమిని ఇచ్చాను. 17లక్షలు పరిహారం ఇచ్చారు…” అని చెప్పాడు. మరో ఇద్దరు రైతులను కలిసినా ఇదే ముచ్చట చెప్పారు.


ఒక చురుకైన అధికారి రైతులను ఒప్పించి,మార్కెట్‌ ధర కంటే రెట్టింపు పరిహారం ఇప్పించడంతో 7వేల ఎకరాల బీడు భూముల్లో శ్రీసిటీ ఏర్పాటయి, 2019నాటికి ఇలా మారింది.ఇపుడు 40వేలమందికి బతుకు తెరువు అయింది. ఈ అభివృద్ది వెనక ఆనాటి ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య కృషిని, అక్కడ ఉపాధి పొందిన వారు ఇప్పటికీ చెబుతారు. 

ఇదంతా 2009నాటి సంగతి. నేడు ఆ ప్రాంతం శ్రీసిటీ పారి శ్రామిక వనంగా మారి, 40 వేల మందికి జీవనోపాధి అయింది. మరి శ్రీనివాసుల రెడ్డి పూరిల్లు ఏమైందో తెలుసుకోవాలని మళ్లీ వెళ్లాం… 
అతని పూరింటి స్దానంలో అందమైన మిద్దె ఇల్లు వచ్చింది. పరిహారపు డబ్బులో కొంత పొదుపు చేసి,కూతురు చెంచులక్ష్మిని డిగ్రీ చదివించాడు.ఆమెకు పక్కనే ఉన్న కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. పారిశ్రామిక పార్క్‌లో కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నట్టు మాతో చెప్పాడు. 
మనిషికి భూమికి ఉన్న అనుబంధం గొప్పదే, కానీ, ప్రకృతి సహకరించనపుడు, వ్యవసాయం భారమైనపుడు, ఇలాంటి రైతులు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్‌ని తీర్చిదిద్దుకుంటారు. పారిశ్రామిక అభివృద్ధికి శ్రీనివాసుల రెడ్డి ఒక రోల్‌ మోడల్‌ మిగిలాడు. ఈ దశాబ్దంలో ఒక విజయవంతమైన పారిశ్రామిక ఛాలెంజ్‌ ఇది.

Share.

Leave A Reply