రూ. 286.29 కోట్ల స్ర్తీనిధి రుణాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రూ. 286.29 కోట్ల స్ర్తీనిధి రుణాలు

  • 1,22,221 మంది మహిళలకు ఓ వరం
  • లక్ష్యాలను అధిగమించిన 9 జిల్లాలు
  • 1,2 స్థానాలలో చిత్తూరు, కడప జిల్లాలు
  • రుణం, సంఖ్య రెండింటినీ అధిగమించిన కడప

రాష్ట్రంలో లక్ష్యాలకు మించి స్ర్తీనిధి రుణాలు ఇచ్చారు. పేద మహిళలు జీవనోపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద మహిళలు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా తమ కాళ్లమీద తాము నిలబడేవిధంగా ఈ పథకం ఉపయోగపడుతోంది. స్వయం సహాయక బృందాలకు ఈ పథకం ఓ వరంగా నిలిచింది. పాడి పశువులు కొనుగోలుకు, చిరు వ్యాపారం వంటి వాటికి రూ.75 వేల వరకు రుణం ఇస్తారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణాలు దోహదపడుతున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం(2016-17)లో రాష్ట్రంలోని 13 జిల్లాలలో 6,13,716 మందికి రూ.1100 కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆగస్టు నెల వరకు 1,79,689 మందికి రూ.256.67 కోట్లు ఇవ్వాలని నిర్దేశించారు. 1,22,221 మందికి లక్ష్యాలకు మించి రూ. 286.29 కోట్లు రుణాలుగా ఇచ్చారు. అత్యధిక మొత్తంలో రుణాలు ఇచ్చిన జిల్లాలలో చిత్తూరు, కడప జిల్లాలు 1, 2, స్థానాలలో నిలిచాయి. చిత్తూరు జిల్లాలో ఆగస్టు వరకు రూ.46.67 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా,48.568 కోట్లు, కడప జిల్లాలో రూ. 23.34 కోట్లు లక్ష్యం కాగా, 37.44 కోట్లు ఇచ్చారు. ఈ రెండు జిల్లాలతోపాటు అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి 9 జిల్లాలలో లక్ష్యాలకు మించి రుణాలు ఇచ్చారు.

ఇదిలా ఉండగా, రుణాల సంఖ్య, రుణ మొత్తం రెండింటిలో ఒక్క కడప జిల్లా మాత్రమే అధిగమించింది. ఆగస్టు వరకు కడప జిల్లాలో 14,508 మందికి రూ.23.34 కోట్లు శ్రీనిధి రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 15,518 మందికి రూ.37.44 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. ఈ రుణాల ద్వారా గ్రామీణ మహిళలు ఎక్కువగా లబ్ది పొందుతున్నారు. మొత్తం రుణాలు తీసుకున్నవారిలో 1,02,971 మంది గ్రామీణ మహిళలే ఉండటం విశేషం. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడిగేదెల పెంపకం వంటివాటితోపాటు చిన్న వ్యాపారాలు, టైలరింగ్, బ్యూటీపార్లర్ వంటి వాటి ద్వారా వారు స్వయం ఉపాధి పొందుతున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించడానికి స్ర్తీనిధి రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Share.

Leave A Reply