దిక్కూ మొక్కూ లేని వాళ్లకు ఆమె చుక్కాని

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆమె సైతం…
(దిక్కూ మొక్కూ లేని ఆడవాళ్లకు ఆమె చుక్కాని)
…………………….
” మా అమ్మా,నాన్నా చెమటోడ్చి కూడబెట్టిన పైసలతో నా పెండ్లి ఘనంగా జరిపిండ్రు. భవిష్యత్‌ గురించి ఎన్నో ఆశలతో, రాత్రి శోభనం గదిలోకి అడుగు పెట్టాను…కానీ, అక్కడ నా భర్త, తన వదిన వరుసైన ఆమెతో నాముందే కులుకుతున్నాడు…. గట్లాంటి బాడుకావ్‌ తో ఎట్లా కాపురం చేయాలన్నా.. ” కాళ్ల పారాణి ఆరక ముందే, తన జీవితంలో ఎదురైన ఘోరాన్ని,మాకు చెప్పి విలపించింది సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇరవై ఏళ్ల యువతి.

అలాంటి మహిళను అక్కువ చేర్చుకొని ధైర్యం చెప్పి,జీవితంలో స్ధిరపడేలా స్వయం ఉపాధి కల్పిస్తోంది శ్రావ్య.
ఇలా భర్తలను వదిలేసిన భార్యలు, పిల్లలు పట్టించుకోని వృద్ద తల్లులు, భర్త వదిలేస్తే , కూలీనాలి చేస్తూ, కాలం వెళ్లదీస్తున్న మహిళలు, దిక్కూ,మొక్కూ లేని 73 మంది ఒంటరి స్త్రీలకు చుక్కాని అయింది, 28 ఏళ్ల మందాడి శ్రావ్య రెడ్డి దేశ్‌ముఖ్‌.
వాళ్ల కష్టాలను విని, నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఊరుకోకుండా, వారు ఆర్ధికంగా నిలదొక్కుకొనేలా సాయపడుతోంది. వి అండ్‌ షీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒంటరి స్త్రీలతో కలిసి చేసిన ప్రయాణం ఆమె మాటల్లోనే….
కలెక్టర్‌గా సాధించలేనిది …
” హైదరాబాద్‌లో పుట్టిపెరిగాను. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తవ్వగానే కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. కానీ, బయట ప్రపంచంలో నా తోటి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తూ, నాలుగు గోడల మధ్య జీతం కోసం పని చేయలేక పోయాను. కొన్ని నెలలకే ఉద్యోగం మానేసి, కలెక్టర్‌ అయితే ప్రజల కష్టాలు తీర్చే అవకాశం ఉంటుందని గ్రూప్స్‌కి ప్రిపేర్‌ అయాను. రెండుసార్లు ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయి మెయిన్స్‌ రాశాను కానీ, పాసవ్వలేదు.” అన్నారు శ్రావ్య.
అయినప్పటికీ ఆమె ఫీలవ్వలేదు. కలెక్టర్‌గా సాధించలేనిది, కామన్‌ వుమెన్‌గా సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది.
నెల రోజులు తెలంగాణా చుట్టిముట్టి…
” మా అమ్మ నీరజ లాయర్‌, నాన్న చంద్రశేఖర్‌రెడ్డి కాంట్రాక్టర్‌, ఒక చెల్లెలుతో సొంత ఇంట్లో హ్యాపీగా ఉంటున్నాం. మరి మా లాగే లోకమంతా ఎందుకు సుఖంగా ఉండదు? బాధల్లో ఉన్నవారి గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ల బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? అందుకే, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తెలుసుకోవాలనుకున్నాను. కొన్ని ప్రధాన సమస్యలు గుర్తించి, అన్ని జిల్లాలు నెల రోజులలో తిరిగి, సమస్యలు రికార్డు చేసి, మహిళల అభివద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయొచ్చు అనే నివేదికను తయారు చేశాను.” అని తన జర్నీని వివరించారు.
ఆమె గుర్తించిన కొన్ని సమస్యలు

జీవితం లో దెబ్బ తిన్న మహిళకు అండగా శ్రావ్య

జీవితం లో దెబ్బ తిన్న మహిళకు అండగా శ్రావ్య

” జూలై 1న హైదరాబాద్‌లో ప్రారంభమైన మా ప్రయాణం 31న నాగర్‌కర్నూల్‌ జిల్లాతో ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,200 కిలోమీటర్లు తిరిగాం. విద్యార్థులు, అంగన్‌వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, మహిళా సర్పంచులు, రైతులు,రైతుకూలీలు, పారిశుధ్య కార్మికులు,స్మశానాల్లో కాటికాపరులు, ఇలా 73 మందిని కలిశాను వీరిలో ఎక్కువ శాతం దళితులు,గిరిజనులే… కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా వెతికాం.
1, ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి, ఒక రోజంతా వారితో గడిపి వారుతినే ఆహారం తిని, నేలమీదనే నిద్రించాను. అప్పుడే అక్కడి సమస్యలు తెలిశాయి. ప్రస్తుతం వంట గదికి అవసరమైన సామాగ్రిని కొనిచ్చాను.
2, పోచంపల్లిలో ఒక చీర నేత కోసం, 120కిలోమీటర్ల దారాన్ని ఆసుపోయడానికి నేత కార్మికులు తన చేతిని సుమారు 9000 సార్లు పైకి కిందకి కదిలించాలి. అలా తయారైన చీర కు రూ.5 వేలు అవుతుంది. దాన్ని కనీసం రూ.300 లాభానికి దళారులకు ఇస్తున్నారు. అదే చీరను షాపుల్లో రూ.16 వేల వరకూ అమ్ముతున్నారు. ఈ దోపిడీ నుండి కాపాడడానికి, చేనేత కార్మికులే నేరుగా అమ్ముకునేలా, హైదరాబాద్‌లో ఓ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయబోతున్నాను.
3, నిర్మల్‌ అటవీ ప్రాంతంలో కొందరు నిరుపేద గిరిజన మహిళలను కలిశాను. వారికి ఆర్ధికంగా సాయపడటం కోసం, నాదగ్గరున్న రూ.2000 నోట్‌ని ఇవ్వ బోయాను. వారంతా దానిని ఆశ్యర్యంగా చూశారు. అసలు వారెపుడు అంత పెద్దనోట్‌ చూడలేదట. పేదరికం ఎంత ఘోరంగా ఉందో అర్దం అయింది. వారికి స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నాను. ”
ఇతరుల జీవితాలను మార్చడానికి ఈ ప్రయాణం ప్రారంభించినప్పటికీ తన జీవితం మీద ప్రభావం చూపించింది అంటారు శ్రావ్య.
ముసలి అవ్వకు నీడ

 అవ్వకు చేయూత


అవ్వకు చేయూత

” ఒక రోజు రాత్రి గాలివాన వచ్చింది. నా పూరిల్లు కూలిపోయి,శిధిలాల మధ్య ఇరుక్కు పోయి అతి కష్టంగా బయటపడ్డాను. ముగ్గురు కొడుకులున్నా ఒక్కరూ నన్ను పట్టించుకోలేదు. అలాంటి సమయంలో శ్రావ్యమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను ఆదుకుంది. నా మందుల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చింది…” అని సంతోషంగా మాతో చెప్సింది, మహబూబాబాద్‌, దళితవాడలో సక్కుబాయి అవ్వ.
ఆమెకు వృద్దాప్య పెన్షను వచ్చే ఏర్పాటు చేసి, కూలిన ఇల్లు కట్టించే బాధ్యత తీసుకున్నారు శ్రావ్య. ఇప్పటికే ఇంటి నిర్మాణం సగం అయింది.
మన చుట్టూ ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు అనే ఫిర్యాదు దోరణిలో ఉంటాం, కానీ పౌరుడుగా మనం ఏం చేస్తున్నాం అని కొందరైనా ఆలోచిస్తే మార్పు సాధ్యమే అంటారు శ్రావ్య.
” ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలను ‘ వీ అండ్‌ షీ ‘ ద్వారా వీలైనంతలో పరిష్కరిస్తాను, మిగిలినవి డాక్యుమెంట్‌ చేసి, ప్రధాని, సీఎంతో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులందరికీ సమర్పిస్తాం. అందులో ఎవరు స్పందించినా, కొందరి జీవితాలన్నా మెరుగుపడతాయనేది నా ఆకాంక్ష. మహిళలకు న్యాయ సహాయం అందించ డానికి లా చదువుతున్నారు. ఉచితంగానే పేద స్త్రీల కేసులు వాధిస్తాను” అంటారు శ్రావ్య.(contact -9398084720)
 – శ్యాంమోహన్‌ /ruralmedia/nirmaan
……………

Share.

Leave A Reply