గమ్యం లేని విశాఖ మన్యం?

Google+ Pinterest LinkedIn Tumblr +

గమ్యం లేని విశాఖ మన్యం?
(తూరుపు కనుమల నుండి రూరల్‌ మీడియా టీం)
సిల్వర్‌ ఓక్‌ చెట్లకు అల్లుకున్న మిరియాల తీగల కింద, కాఫీ తోటలతో,ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు మెట్లసాగులతో అందాల లోయలు, మంచుకమ్మిన కొండలు, మెలికలు తిరిగే రహదారులు, జలజలా జాలువారే జలపాతాలతో, కూల్‌గా ఉండే అరకులో ఇపుడు ఎవరిని కదిలించినా బెరుకుగా చూస్తున్నారు. ప్రకృతి అందాల విశాఖ మన్యం! ఇపుడు అగమ్యగోచరంగా ఉంది.
ఇటీవల ఇద్దరు ప్రజాప్రతినిధులను(కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ) మావోయిస్టులుగా అనుమానిస్తున్న వారు పట్టపగలు హతమార్చడంతో విశాఖ మన్యం ఉలిక్కిపడింది. 13 ఏళ్ల తరువాత ప్రజాప్రతినిధులు బలి అవ్వడంతో మొన్నటి వరకు ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని తూరుపు కనుమల ప్రాంతాన్ని జల్లెడ పట్టడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. దీంతో మన్యం ప్రజలుఎప్పుడేం జరుగుతుందోనని, భయంగా బతుకుతున్నారు.
……
ఇలాంటిఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అసలు మావోలు ఇంత అశాంతికి ఎందుకు ఒడిగట్టారు.? గిరిజనులకు అండగా ఉన్న కొండలను ధ్వంసం చేస్తున్నందు వల్లనే వారీ హింసకు పాల్పడ్డారా? అడవి బిడ్డలు ఎలాంటి పరిస్దితుల మధ్య జీవిస్తున్నారు? ప్రభుత్వ స్కీమ్‌లు వారికి అమలవుతున్నాయి? కనీస మౌలిక వసతులు ఉన్నాయా? మొదలైప అంశాలపై నాలుగు గ్రామాల్లో క్షేత్రస్దాయి పరిశీలన ఇది.
‘ అడవి జంతువుల మధ్య బతుకుతున్నాం’

గుత్తంగ్రామంలో, తాగునీరు కోసం రెండు మైళ్లు నడవాలి

గుత్తంగ్రామంలో, తాగునీరు కోసం రెండు మైళ్లు నడవాలి

అరకు వ్యాలీ నుండి పాడేరు వెళ్లే దారిలో, విశాఖ ఏజన్సీలో విసిరేసినట్టున్న గ్రామాలు కిమ్మిడి పుట్టు, గాలిపాడు, జంగం పుట్టు, గత్తుం. ఇవి హుకుంపేట మండలంలో ఉన్నాయి. సముద్రమట్టానికి 900 మీటర్లు దాటిన ఎత్తయిన కొండ ప్రాంతాలివి. ‘గత్తుం’ వరకు మాత్రమే రహదారి ఉంది. మిగిలిన గ్రామాలకు కాలిబాటలో 3 నుండి నాలుగు కిలో మీటర్లు నడిచి వెళ్లాలి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ గిరిజన పల్లెలకు ఇంకా చేరలేదు. సమీపంలోని ఎండిన బావుల్లో అడుగంటిన నీళ్లతో వీరి గొంతు తడుపుకుంటున్నారు. విద్యుత్‌ లేక, కిరోసిన్‌ గుడ్డి దీపాల్లో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఒకటీ ఆరా కరెంట్‌ పోల్స్‌ వేసినా వారానికో సారి విద్యుత్‌ వస్తుంది.
” కరెంట్‌ లేక పోవడం వల్ల చీకటి పడితే బయటకు రాలేం, పొలాలకు వెళ్లలేం.చుట్టూ కొండలు, మధ్యలో మా గ్రామం. అడవి జంతువులు మా చుట్టూ తిరుగుతుంటాయి.వీటి నుండి కాపాడుకోవడానికి మాకు కనీసం సోలారు లైట్లయినా కావాలి మూడేళ్ల క్రితం ఇంటికో సోలారు లైట్‌ను రామకష్ణమిషన్‌ వారు పంచారు. కానీ అవికూడా రిపేర్లు వచ్చి మూలన పడ్డాయి. ” అన్నారు జంగం పుట్టు గ్రామస్దులు దేవుడమ్మ,రాజారావు.
ఇక్కడ ఒక అంగన్‌ వాడీ కేంద్రం ఉంది కానీ దానికీ కరెంట్‌ లేదు. ఇరవై మంది చిన్నారులు, కొందరు గర్బినీ స్త్రీలు రోజూ ఇక్కడికి వస్తారు.
సుమారు ఏడు వందల మంది ఈ మూడు గ్రామాల్లో జీవిస్తున్నారు.

ఈ గున్నమామిడి గ్రామస్తులకు విద్యుత్‌ ఎలా ఉంటుందో తెలీదు.

ఈ గున్నమామిడి గ్రామస్తులకు విద్యుత్‌ ఎలా ఉంటుందో తెలీదు.

అక్కడక్కడా కొన్ని విద్యుత్‌ పోల్స్‌ వేశారు. ఒక్క వీధి లైట్‌ కూడాలేదు. ఒక్కో పోల్‌ మధ్య దూరం 300 నుండి 400 మీటర్లు వరకు ఉంటుంది. కొన్ని చోట్ల గ్రామస్ధులే అనధికారికంగా పోల్స్‌ వేసుకోవడం మా దృష్టికి వచ్చింది.
ఆ గ్రామాలన్నీ , చీకట్లో …
” విజయ నగరం, విశాఖ,శ్రీకాకుళం జిల్లాల్లో రెండేళ్ల క్రితం విద్యుత్‌ లేని 172 గ్రామాలను గుర్తించి సోలారు లైట్లు ఇచ్చాం. కానీ అవి తాత్కాలికమే,వారికి సంపూర్ణ విద్యుత్‌ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తే ప్రజల జీవితం మెరుగవుతుంది. ” అని విశాఖలోని రామకృష్ణామిషన్‌ ఆశ్రమ కార్యదర్శి ఆత్మవిదానంద మాతో అన్నారు.
” కొన్ని గ్రామాలకు విద్యుత్‌ లేని మాట నిజమే. అవి కొండల మీద ఉండటం వల్ల వైర్లు వెళ్లవు. కొన్ని చోట్ల విద్యుత్‌ లైన్‌లు ఉన్నా కరెంట్‌ లేక పోవడానికి కారణం తరచూ విద్యుత్‌తీగలు చోరీకి గురవుతుంటాయి. ‘ అని పాడేరు ఏజెన్సీ విద్యుత్‌ శాఖ ఏఇ ప్రభాకర రావు, చెప్పారు.
రహదారులు లేవు

తాగునీటికి,సాగునీటికి ఈ ఊటకుంటే గాలిపాడు ప్రజలకు ఆధారం.

తాగునీటికి,సాగునీటికి ఈ ఊటకుంటే గాలిపాడు ప్రజలకు ఆధారం.

జంగం పుట్టు, గత్తుం గ్రామాల్లో దాదాపు 150 మంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 30మంది ఇంటర్‌ నుండి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్చోగులే ,ఉపాధి లేక పొలం పనులు చేసుకుంటున్నారు. సరైన రహదారులు సమాచార వ్యవస్ధ లేక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వీరికి తెలీదు. ఉద్యోగ అవకాశాల సమాచారం లేక నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. పాడేరు వైపు వెళ్లే ప్రధాన రహదారికి చేరుకోవాలంటే కాలిబాటలో రెండు కిలో మీటర్లు వరకు నడిచి రావాలి.
‘ ఇప్పటి వరకు ఏ పత్రిక వాళ్లు ఇక్కడికి రాలేదు’
” మేం ఎలా బతుకుతున్నాం ? ఏం తింటున్నాం? అసలు బతికే ఉన్నామా? అని చూడ డానికి ఒక్క నాయకుడు కానీ, పత్రికల వాళ్లు ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడికి రావడానికి సరైన దారులు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. నీటివసతి, రహదారులు ,విద్యుత్‌ కల్పించ మని ఎన్నోసార్లు పాడేరు ఐటిడిఏ వారికి మొర పెట్టుకున్నాం కానీ వినేవారు లేరు. ఈ రోజు మా మధ్యకు మీరొచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. కనీసం మీ ద్వారా అయినా మా కష్టాలు అధికారులకు తెలుస్తాయి. ” అని ఆశగా అన్నాడు గాలిపాడులో స్కూల్‌ టీచర్‌ మూర్తి.

ఇంత వరకు తమ గ్రామంలోకి పత్రికల వారు రాలేదంటున్న గాలిపాడు గ్రామస్తులు.

ఇంత వరకు తమ గ్రామంలోకి పత్రికల వారు రాలేదంటున్న గాలిపాడు గ్రామస్తులు.

వీరి సమస్యను పాడేరు సమగ్రగిరిజనాభివృద్ది అధికారుల దృష్టికి మేం తీసుకెళ్లాంకానీ, రహదారులు వేయడానికి ప్రతిపాదనలు చేశాం. ఇంకా అమలు దశలో ఉన్నాయి అన్నారు.
దత్తత గ్రామంలో, అభివృద్ధి అంతంతే?
అరకు వ్యాలీకి ఐదుకిలో మీటర్ల సమీపంలో ఉన్న గ్రామం పెదలబుడు. పొలం పనులు దొరికితే తింటారు. లేక పోతే పస్తులే. సరైన విద్య,వైద్య సౌకర్యాలు లేవు. తాగునీటి వసతి అంతంత మాత్రమే. 2015 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, గ్రామాన్ని దత్తత తీసుకోవడం విశేషం.
ఈ పంచాయితీలో 21 కుగ్రామాలున్నాయి. మొత్తం జనాభా 11,280.
ఇక్కడ ఒక్క ప్రాధమిక ఆరోగ్యకేంద్రం కూడా లేదు. ఒక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మాత్రం ఉంది కానీ, మేం ఉవయం 11 గంటలకు అక్కడికి చేరుకున్నప్పటికీ అక్కడ సిబ్బంది లేరు. అపుడపుడు వచ్చి పోతుంటారని అక్కడి ప్రజలన్నారు.

పెదలబుడులో సిమ్మెంట్‌ రోడ్లు వేసినా ఇరువైపులా డ్రైనేజీ లైన్లు వేయని గ్రామీణాభివృద్ధి శాఖ

పెదలబుడులో సిమ్మెంట్‌ రోడ్లు వేసినా ఇరువైపులా డ్రైనేజీ లైన్లు వేయని గ్రామీణాభివృద్ధి శాఖ

స్కూల్‌ మూతపడింది …
పెదలబుడు పంచాయితీ పరిధిలోని లిట్టిగూడ గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్‌ మూతపడింది. విద్యార్ధుల సంఖ్య తక్కువ ఉందనే సాకు తో ఈ స్కూల్‌లో పాఠాలు చెప్పడం లేదు. దీనివల్ల ఇక్కడ చదువుతున్న 23 మంది విద్యార్ధులు 2కిలో మీటర్లు నడిచి మరో స్కూల్‌కి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
”అరకులోని 11 మండలాల్లో పిల్లలు తక్కువ ఉన్నారనే కారణంతో ఇప్పటి వరకు 70 పాఠశాలలు మూతపడ్డాయి.దీంతో బడిమానేసే పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగి పోతుంది.” అని ఒక గిరిజన యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
తాగునీటికి కటకట
పెదలబుడు లో 3,116 కుటుంబాలు బతుకుతున్నాయి కానీ రోజూవారీ అవసరాలకు తగినంత నీటిసరఫరా లేదు. అక్కడక్కడా ఉన్న ఆరు బావుల నీరే ప్రజలకు ఆధారం. కేవలం 119 చేతిపంపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.వాటిలో కొన్ని రిపేరులో ఉన్నాయి.
గరడగుడ,గంజాయిగుడ గ్రామాల్లో కొండలమీదున్న ఊటనీటి కుంటలనుండి దిగువకు ప్రవహించే నీటిని గిరిజన మహిళలు కుండల్లో మోసుకుంటూ తెచ్చుకోవాల్సిందే. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా పంచాయితీలో ప్రతీ ఇంటికీ మంచి నీటిని అందించాలనే ప్రతిపాదన ఉంది కానీ,అదింకా పూర్తిగా అమలుకు నోచుకోలేదు.

పెదలబుడులో ఉపాధి పనులు లేక దిగులుగా ఉన్న మహిళ

పెదలబుడులో ఉపాధి పనులు లేక దిగులుగా ఉన్న మహిళ

చిత్తశుద్ధి లేని పారిశుద్ధ్యం
పెదలబుడులో అతిపెద్ద సమస్య పారిశుద్ధ్యం. గ్రామంలో అడుగు పెడితే ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తుంది. మురుగు నీటి పారుదల వ్యవస్ధలేదు. చినుకు పడితే చిత్తడే. వీధుల్లో నీరు నిలిచి పోతుంది. దీంతో దోమలు పెరిగి గిరిజనులు అంటు వ్యాధులకు లోనవుతున్నారు. ఉపాధి హామీ నిధులతో ఒక చెత్తశుద్ధి కేంద్రం నిర్మించాలనుకున్నారుకానీ, అదింకా పూర్తికాలేదు.
చినుకు పడితే చిత్తడే
గ్రామ మాజీ సర్పంచ్‌ సమర్ధి గులాబిని ‘రూరల్‌మీడియా’ సంప్రదించగా, ‘ దత్తత గ్రామం అయినప్పటికీ, అభివద్ధి అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. ఈ ప్రాంతమంతా వర్షాధార పంటలే సాగు చేయాలంటే బోర్లు కావాలి. ఆ మధ్య ఎన్టీఆర్‌ జలసిరులు అనే పథకం ప్రకటించారు. దానిని మా గ్రామంలో పూర్తిగా అమలు చేసి బోర్లు ఇస్తే రైతులు బాగు పడతారు. విత్తనాలు కూడా విత్తునాటే సమయంలో ఇవ్వకుండా సీజన్‌ అయిపోయాక ఇస్తున్నారు. దీని వల్ల రైతులంతా నష్ట పోతున్నారు. గ్రామంలో సిమెంట్‌
రహదారులు వేస్తున్నారు కానీ, వాటి పక్కన సైడు కాల్వలు నిర్మించక పోవడం వల్ల వానలు కురిసినపుడు నీరంతా రోడ్లుమీదకు చేరుతోంది. కొంత ఇండ్లలోకి వస్తోంది.
చాలా మంది ఆడోళ్లు కట్టెల పొయ్యిలే వాడుతున్నారు. 300 వరకు గ్యాసు కనెక్షన్లు అవసరం ఉంది. 150మంది నిరుద్యోగులు చదువుకొని ఖాళీగా తిరుగుతున్నారు. వారికి ఉద్యోగాలు ఇప్పించాలి.” అని అని వివరించారు.
అన్నీ అమలు దశలోనే…
పెదలబుడు అభివద్ధి పై అరకులోయలో పలువురు అధికారులను ‘రూరల్‌మీడియా’ సంప్రదించినపుడు గ్రామాభివ ద్ధికి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ అవన్నీ అమలు దశలో ఉన్నాయంటున్నారు. కానీ పనుల్లో వేగం కనిపించడం లేదని గ్రామ ప్రజలంటున్నారు.
మన్యం అభివృద్దికి ఏం చేయాలి?
మేం చూసిన నాలుగు గ్రామాల్లోని సమస్యలు మన్యం దుస్ధితికి దర్పణం. ఇలాంటి సరిస్దితిల్లో తీవ్రవాదం చోటు చేసుకొని అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. అడవి బిడ్డలకు అండగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను సత్వరం చేయాల్సిన అవసరం ఉంది.
1, ఉపాధి అవకాశాలు లేక గిరిజన నిరుద్యోగులు నిరాశకు లోనై బతుకు తెరువు కోసం వలసలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరికి వెంటనే ఉద్యోగాలు కల్పించక పోయినప్పటికీ, వారి అర్హతలకు తగిన నైపుణ్యం పెంచుకునే శిక్షణను ఇచ్చే కేంద్రాన్ని అరకులో ఏర్పాటు చేయాలి.
2, కొండ ప్రాంతంలో తరచూ ఈదురు గాలులు వీచి విద్యుత్‌ ఆగి పోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సోలారు వీధి లైట్లు వేస్తే విద్యుత్‌ని పొదుపు చేయవచ్చు. అవసరమైతే ఇంటింటికి సోలార్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయవచ్చు. రహదారి సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం బైక్‌ ఆంబులెన్సులు తిరగ గలిగిన దారులైనా నిర్మించాలి.
3, పెదలబుడు జనాభాలో 5,185 మంది మహిళలే. వీరిలో 1,625 మంది స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. వీరికి పలు వత్తుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం కల్గించాలి. ఆర్గనిక్‌ పంటల సాగు పై వారికి అవగాహన కల్గించాలి.
4, విద్యార్ధుల సంఖ్య తక్కువ ఉందనే కారణంతో పాఠశాలలు మూయడం సరికాదు. దీని వల్ల 2కిలో మీటర్లకు పైగా పిల్లలు నడిచి వేరే బడికి పోవాల్సిన పరిస్ధితి ఏర్పడి వందలాది పిల్లలు చదువు మానేస్తున్నారు. ఈ సమస్యను నివారించాలంటే విద్యార్ధులను ఆటోల ద్వారా స్కూల్‌కి చేరుకునే సౌకర్యం కల్పించాలి. లేదా పంచాయితీ పిల్లలందరికీ ఒకే చోట చదువు అందేలా హాస్టల్‌ వసతి కల్పించాలి.
5, వర్షాధార పంటల మీదనే రైతులు ఆధార పడుతున్నారు కాబట్టి పండ్లతోటలు,కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలి. బోర్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌ సదుపాయాలు కల్పించాలి. సకాలంలో విత్తనాలు అందేలా చేయాలి.
6, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి పనుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ó పనులు కల్పించి జీవనో పాధులు మెరుగుపర్చాలి.
7, పెదలబుడు పంచాయితీ పరిధిలో 1,589.51 ఎకరాల బంజరు భూమి ఉంది. గ్రామీణ ఉపాధి హామీపథకం ద్వారా ఈ పోరంబోకు భూమిని అభివ ద్ధి చేసుకోవచ్చు. వాటర్‌ షెడ్‌ ద్వారా రాతికట్టలు,చెక్‌డ్యాంలు నిర్మించి వాన నీటిని ఒడిసిపట్టవచ్చు. నాబార్డు గిరిజనాభివ ద్ధి నిధి ద్వారా పండ్లతోటలు పెంచి తద్వారా వచ్చే ఆదాయంతో పంచాయితీని మరింత తీర్చిదిద్ద వచ్చు.
8, కిమ్మిడి పుట్టు, గాలిపాడు, జంగం పుట్టు, గత్తుం వంటి కనీస మౌలిక వసతులు లేని గ్రామాలను గుర్తించి అక్కడ వెంటనే అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతీ గ్రామంలో కమ్యూనిటీ గ్రంధాలయాలు ఏర్పాటు చేసి, సోలార్‌ విద్యుత్‌ని ఏర్పాటు చేసి సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌లకు అవకాశం కల్పించాలి. కొన్ని గ్రామాలకు సిగ్నల్స్‌ అందటం లేదు కాబట్టి ల్యాండ్‌ లైన్‌ టెలిఫోన్లు ఏర్పాటు చేయాలి.

అసమానతలను తొలగించే గట్టి ప్రయత్నం జరగాలి
అరకు సంఘటన మరొక్కసారి, తీవ్రవాద సమస్యకు పరిష్కార మార్గమేమిటి అనే ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చింది.   మాజీ పోలీసు అధికారి,కాలమిస్టు రావులపాటి సీతారాంరావు ఒక ప్రముఖ పత్రికలో ఇలా రాశారు.
” బీదతనం, అవిద్య, ఆర్థిక అసమానతలు, పెట్టుబడి దారీ తనం, పెత్తందారీ తనం, అణిచివేత ధోరణి వున్నంత కాలం, మావోయిజం వుంటుందన్నది చరిత్ర చెప్తున్న సత్యం.
మావోయిస్టుల అవసరమున్న పేదలకు, ఆర్థికంగా అన్ని రకాలుగా నలిగిపోతున్న బడుగు బలహీన వర్గాలకూ, వారి మీద మోజు పోవాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పోలీసు బలగాల మీద ఆధారపడటం మానేసి, రాజకీయ నిర్ణయాలతో అసమానతలను తొలగించే గట్టి ప్రయత్నం తలపెట్టినప్పుడే, కొంత వరకు ఫలితాలు వచ్చే అవకాశాలు వున్నాయి. కేవలం బల ప్రయోగం ద్వారా వచ్చే విజయాలు క్షణికం! ప్రభుత్వాలు చేసే అభివద్ధి కార్యక్రమాల మీద, ప్రజలకు నమ్మకం, వచ్చినప్పుడు, అన్ని రంగాల్లోనూ, అట్టడుగున వున్న వారు కొంతలో కొంత పైకి వస్తున్నప్పుడు మావోయిస్టు సిద్ధాంతం కనుమరుగు అవుతుంది.”
ఇది అక్షర సత్యం.
……….
శ్యాంమోహన్‌ ( This article is presented under RuralMedia-Nirmaan partnership )
డియర్‌ రీడర్స్‌ ఈ స్టోరీని చదివి ఊరుకోకుండా, సమస్య పరిష్కారం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి. విశాఖజిల్లా అధికారుల దృష్టికి ఈ స్టోరీ లింక్‌ని పంపండి.

District Collector’s Office, Maharani Peta, Visakhapatnam – 530002

Office Phone : (0891) 2563257 ,Residence Phone : (0891)2526999,2754106 E-mail : collector_vsk@ap.gov.in

Share.

Leave A Reply