మన్యంలో బాలింత నరకయాతన

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒరిస్సా నుండి ఆంధ్రా వరకు కొండప్రాంతాల్లో గిరిజన రోగులను డోలీలో మోసుకురావడం అందరికీ తెలిసిందే. ‘ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణులను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడం వల్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో , అంబులెన్సుల్లోనో, ఒక్కోసారి రహదారుల పక్కనే జరుగుతున్నా అధికారయంత్రాంగంలో కదలిక రావడం లేదు ఆఖరికి 108 వాహనాలు సక్రమంగా పనిచేయడం లేదు, బైక్‌ ఆంబులెన్స్‌లు రావడానికి దారి ఉండదు, చీకటి పడితే గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో వైద్యం అందట్లేదని, పార్వతీ పురం ఏజెన్సీ ప్రాంత వాసులు  rural mediaతో  అంటున్నారు. 

సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందే అనే మహిళ ప్రసవ కష్టాలు, అక్కడి దయనీయ పరిస్థితుల్ని వివరించే కథనాలు  మీడియాలో రావడం తో దాన్ని సుమోటాగా తీసుకున్న దిల్లీలోని జాతీయ మానవహక్కుల కమిషన్‌ పార్వతీపురం ఐటీడిఎ గిరిజన ప్రాంతాల్లో, రహదారుల సమస్య, వైద్య సదుపాయాల తీరు పై నాలుగువారాల్లోగా సమాధానమివ్వాలంటూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా డిఎంహెచ్‌ఓ డా.విజయలక్ష్మిని  సంప్రదించగా,
” విజయనగరం జిల్లా, సాలూరు మండలం, గిరిశిఖర కొడమ పంచాయతీ, సిరివరలో కొండతామర గిందే అనే మహిళకు నెలలు నిండకుండానే పురిటినొప్పులు వచ్చి ,కాన్పుకావడంతో పుట్టిన బిడ్డ చనిపోయాడు. గిందే పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కాని సిరివర నుంచి ఆసుపత్రికి వెళ్లాలంటే 12 కిలోమీటర్ల దూరం కాలినడకన కొండ దిగి దుగ్గేరు వచ్చి, అక్కడి నుంచి ఏదైనా వాహనం పట్టుకుని వెళ్లాల్సిందే. ఆ సమయంలో గిందెకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో, ఆమె భర్త డుంబ్రి, స్దానిక ఆశావర్కర్‌ సాయంతో చీరతో డోలీకట్టి అందులో గిందెను ఉంచి, 12 కి.మీ.కు పైగా కొండ పై నుండి కిందికి జోరు వర్షంలో నడిచి దుగ్గేరుకు తీసుకువచ్చారు.
ఆశా వర్కర్‌ ముందుగానే సమాచారం ఇవ్వడంతో కొండ కింద ఎఎన్‌ఎం మంగ 108 వాహనంతో సిద్ధంగా ఉండటంతో గిందె ను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి సోమవారం రాత్రి 9.30 గంటలకల్లా తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.’ డిఎంహెచ్‌ఓ వివరించారు.
గింద జాతాపు తెగకు చెందిన ఆదివాసీ మహిళ. ఆమెకు తెలుగు భాష రాక పోవడం వల్ల ఆమె సమాచారం తెలుసుకోవడంలో కొంత ఇబ్బందులు పడినట్టు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

konda taamaara ginde

Konda taamara Ginde

రెండు గంటల్లో 12కిలో మీటర్లు… 
ఆసుపత్రిలో గిందెకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో సహకరించిన విజయనగరం, డిప్యూటీ డిఎమ్‌హెచ్‌ఓ రవికుమార్‌ రెడ్డి, ఇలా అంటున్నారు
” సిరివర గ్రామం నుండి కిందికి రావాలంటే దుగ్గేరు నుండి రావాలి. కాలి నడక తప్ప వేరే మార్గం లేదు. ఆ కొండదారిలో 12 కిలో మీటర్లు నడవాలంటే, మన లాంటి వారికి అయిదు గంటలు పడుతుంది. గిరిజనులకు అలవాటు కాబట్టి రెండు గంటల్లో కిందికి చేరుకున్నారు. సకాలంలో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించాం. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ఆమె క్షేమంగా ఉంది. రెండు రోజుల్లో డిచ్ఛార్జి చేస్తారు.’ అన్నారు రవికుమార్‌.
ఈ ప్రాంతంలో 24 బైక్‌ ఆంబులెన్స్‌లున్నప్పటికీ కనీసం అవి వెళ్లడానికి కూడా రహదారుల సౌకర్యం లేదు.
రహదారులు లేక నరకయాతన… 
” జిల్లా పరిధిలోని ఏజెన్సీలో 300కు పైగా ఆవాస ప్రాంతాలకు రహదారుల అనుసంధానం లేదు. వాటినే ఉపాధి హామీ పథకంలో తొలి ప్రాధాన్యంగా తీసుకుని వేస్తున్నాం. ఇప్పటివరకూ 160 వరకు రహదారులు పూర్తయ్యాయి. మిగతావి ప్రగతిలో ఉన్నాయి. ఇప్పటికీ ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే కొండలపై నిట్టనిలువునా నడవాల్సి ఉంటుంది. సాలూరు, పాచిపెంట ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రాణాల మీదికి వచ్చినపుడు, దిగువకు రావాలంటే డోలీలోనే మోసుకురావాల్సి వస్తుంది. సిరివర నుంచి దిగువమెండంగి వరకూ రహదారి వేసేందుకు ప్రతిపాదనలు పెట్టారు. పనులు ప్రారంభించాల్సి ఉంది”అని పార్వతీ పురం డ్వామా ఎపీఓ శ్రీహరిరావు  అన్నారు.

ginde- wwith ddmho

Ginde- with DMHO

వైద్యసేవలు అత్యంత దయనీయం 
ఈ జిల్లా, ఏజెన్సీలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24గంటలు పనిచేస్తాయని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నా. చాలాచోట్ల రాత్రివేళల్లో మూసేస్తున్నారు. ఒకవేళ తెరిచినా డాక్టర్లు  స్థానికంగా  అందుబాటులో లేని పరిస్థితులున్నాయి.
మరోవైపు క్షేత్రస్థాయిలో ఉండే ఎఎన్‌ఎంలు, సూపర్‌వైజర్‌లు గర్భిణిల్ని ప్రసవ తేదీకి కనీసం వారం ముందుగానే ఆసుపత్రికి చేర్చాల్సి ఉన్నా ఈ మారు మూల ప్రాంతంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా హైరిస్క్‌ గర్భిణుల నమోదు, వారిని ఎప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించడంలోను వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. ఈ కారణంగానే పురిటినొప్పులు వచ్చాక అప్పటికప్పుడు ఆసుపత్రికి చేర్చాల్సి రావడం,కొన్ని సార్లు స్థానికులే పురుడు పోయడం జరుగుతోందని స్ధానిక ప్రజలంటున్నారు.
సర్వసాధారణం

” ఇలాంటి సంఘటనలు పార్వతీపురం మన్యంలో సర్వసాధారణం,ప్రతీరోజు చూడవచ్చు. కొండల మీద బతుకుతున్న గిరిజనులు ఆనారోగ్యం పాలైనపుడు నానాకష్టాలు పడి కిందికి చేరుకుంటారు. అక్కడి నుండి పార్వతీపురం ఆసుపత్రికి ఎలాగోలా వస్తారు. అక్కడ వారికి సరైన చికిత్సచేయక విజయనగరం పంపుతారు. విజయనగరంలో కూడా వైద్యులు చేతులెత్తేసి విశాఖపట్నం వెళ్లమంటారు… ఇక ఆ పేద గిరిజనుల పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించండి.అందుకే విజయనగరంలో ఒక మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని ఎప్పటి నుండో కోరుతున్నాం…” అని ఇటీవల విజయనగరంలో మమ్మల్ని కలిసిన ఓ ప్రముఖ వైద్యుడు అన్నారు.

డియర్‌ రీడర్స్‌ ఈ స్టోరీని చదివి ఊరుకోకుండా, సమస్య పరిష్కారం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి.  జిల్లా అధికారుల కి ఈ స్టోరీ లింక్‌ని పంపండి.

1, District Collector Dr. M. Hari Jawaharlal IAS, Contact -08922-276720, E mail – collector_vznm@ap.gov.in

2, Project Officer,I.T.D.A,  Dr.G.Lakshmisha IAS,  Contact –  08963-221152, E mail –  poitdappm@gmail.com

3, Member of parliament,Vizianagaram, P..Ashok Gajapathi Raju , Contact 9440822599

………………………………………………………….
శ్యాంమోహన్‌/Ruralmedia/Nirmaan

Share.

Leave A Reply