‘నేను జర్నలిస్టుని, ధర్మం చేయండి బాబూ?’

The Telugu journalist  Became A Beggar

వార్తలు రాయాల్సిన విలేకరి
యాచకుడిగా ఎందుకు మారాడు?
చెన్నయ్‌ నుండి నెల్లూరుకు బయలు దేరింది ప్యాసంజర్‌ రైలు. తడ స్టేషన్‌లో ఎక్కాడు అతడు.  కొందరు పేపరు చదువుతుంటే, మరికొందరు చేతిలోని సెల్‌లో గేమ్స్‌ ఆడుకుంటున్నారు. ఇంతలో వారి ముందు వినయంగా చేయి చాచి నిలబడ్డాడు ఒక యువకుడు. ‘ మీకు తోచిన ధర్మం చేయండి..’ అని ధీనంగా అడుగుతున్నాడు. ఆరోగ్యంగా ఉన్నావు అడుక్కోవడం ఎందుకు అని అడిగిన వారికి తానా పని ఎందుకు చేస్తున్నాడో వివరిస్తూ ఒక్కో సీటు
దగ్గరకు వెళ్తున్నాడు. అతడు చెప్పే ముచ్చటను ఆశ్చర్యంగా వింటూ, తోచినంత అతడి చేతిలో ఉన్న డబ్బాలో వేస్తున్నాడు.
ఒక ప్రముఖ వామపక్ష దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ ఇలా యాచక వృత్తి ఎందుకు చేస్తున్నాడు?
ఇదే సంగతి అతడిని రూరల్‌మీడియా అడిగినపుడు…
” చిన్నతనంలో అక్షరాలు నేర్చుకోవడానికి పడిన కష్టాలే, నాకు జీవితపాఠాలు నేర్పాయి.

Mr. Riyaz with school kids

Mr. Riyaz with school kids

నోట్‌పుస్తకాలు,పెన్‌,పెన్సిల్‌ కొనే స్తోమతు లేక పడిన పాట్లు సామాజిక సేవ కోసం తపించేలా చేశాయి. నా లాగా ఈ తరం బిడ్డలు చదువుకు దూరం కాకూడదని, ప్రజాశక్తి పత్రికలో, జర్నలిస్టుగా చేరి స్దానిక వార్తలు రాసేవాడిని. సగటు ప్రభుత్వపాఠశాలల్లో సమస్యలపై ఎన్నో కథనాలు ఇచ్చాను కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. సమస్యలు ఎత్తి చూపితే చాలదు,వాటి పరిష్కారంలో భాగం కావాలని ఎవరూ నడవని దారిలో ఇలా ప్రయాణం చేస్తున్నాను.. ”అని అన్నాడు.
అలా వార్తలు రాయాల్సిన విలేకరి యాచకుడిగా మారాడు..
ఇపుడు అతడు పేద చిన్నారులకు అండగా మారాడు. పుస్తకాలు లేవని చదువు అపుతున్న చిన్నారులుకు తోడయ్యాడు. వందలాది పేద విద్యార్దులు ముఖాల్లో వెలుగయ్యాడు.
చిత్తూరు జిల్లా,వరదయ్యపాలెంకు రియాజ్‌ జీవన చిత్రం ఇది.

Mr. Riyaz with school kids

Mr. Riyaz with school kids

చదువుకోసం తల్లిదండ్రులు పడిన ఆర్ధిక ఇబ్బందులు ఇప్పటికీ అతడిని వెంటాడుతుంటాయి.
ఇలా భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుతో పేద పిల్లలకు పుస్తకాలు,పెన్నులు కొని అందిస్తున్నాడు. రియాజ్‌ చేసిన చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్నే ఇచ్చింది.
వరదయ్యపాలెం,సత్యవేడు,బుచ్చిరాజునాయుడు కండ్రిగ మండలాల్లో కొన్ని ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువుకు అవసరమైన స్టేషనరీని అందిస్తున్నాడు. ఇటీవల కేరళ వరదల్లో దెబ్బతిన్న స్కూళ్లకు కూడా సాయం అందించాడు.
చదువు ఆగలేదు…
రియాజ్‌ కృషి ఫలించింది. ‘ పుస్తకాలు లేక మధ్యలో చదువుమానేస్తున్న పిల్లలు మళ్లీ బడికి వస్తున్నారు.వారికి అవసరమైన పుస్తకాలు,పెన్నులు అందటంతో హోం వర్క్‌లు చేస్తూ మంచి మార్కులు సాధిస్తున్నారు.’ అంటున్నారు టీచర్లు.
ఈ సేవను మరింత విస్తరిస్తూ, రియాజ్‌ తన మిత్రులతో కలిసి ‘బెటర్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పూర్‌ చిల్డ్రన్‌’ సంస్ధను ఏర్పాటు చేసి తన ఆశయాన్ని మరింత విశాలం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. చదువు కోసం తపించే చిన్నారుల భవిష్యత్‌ కోసం చేయి చాస్తున్న ఈ యువకుడికి రైలు ప్రయాణీకులే కాదు, టీచర్లు,పోలీసులు,ఉన్నతాధికారులు జేజేలు పలుకుతున్నారు.

1500 పిల్లలకు చేయూత…
వారానికి ఒక్క సారి రైలులో నాలుగు గంటలు ప్రయాణం చేసి యాచించగా రోజుకు వెయ్యిరూపాయల వరకు వస్తుందంటాడు రియాజ్‌. ‘ గత రెండేళ్లుగా ఇలా వచ్చిన సొమ్ముతో 15వందల విద్యార్ధులకు పుస్తకాలు సమకూర్చాను. వరదయ్యపాలెం మండల విలేఖరిగా ప్రజాశక్తి దిన పత్రికలో పనిచేస్తున్నందుకు నెలకు రూ.4000 జీతం వస్తుంది.’ అని తన ఆర్ధిక పరిస్దితిని వివరించాడు.

చిన్నారుల భవిష్యత్‌ని తీర్చిదిద్దడానికి క షి చేస్తున్న రియాజ్‌కి సాయం చేయాలనుకుంటున్న వారు సంప్రదించండి.( ఫోన్‌-  9966907644, 7660042390)  email- shak.riyaz09@gmail.com

-Shyammohan ( This article is presented under RuralMedia-Nirmaan partnership )

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *