దిక్కులేని కుటుంబానికి ‘దివ్య’మైన దారి

bujjamma-kotlapur-ruralmedia

దిక్కులేని కుటుంబానికి ‘దివ్య’మైన దారి
కొత్లాపూర్‌(తాండూరు మండల్‌)లో ఒక ఎకరం పదికుంటల భూమి తప్ప వేరే ఆస్తులేమీ లేవు వెంకటప్పకు.సకాలంలో వానలు లేక ఆ నేలలో ఏం పండించాలో తెలయక ఆందోళన పడసాగాడు. బతుకు తెరువు కు మరో దారి లేక తెలిసినోళ్ల దగ్గర అప్పులు చేసి పొలంలో బోరు వేశాడు.కూరగాయలు పండించి కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు.
నీళ్లయితే పడ్డాయి కానీ బోరు చెడిపోయింది,మోటారు కాలిపోయింది.వెంకటప్ప పరిస్థితి మళ్లా మొదటికి వచ్చింది.
కన్ను మూసినా తెరిచినా బోరు కోసం చేసిన రూ.80వేల బాకీ కనిపిస్తోంది. అప్పులిచ్చిన వారు వెంటపడుతున్నారు.
భార్య బుజ్జమ్మకు సంగతి చెప్పి భోరుమన్నాడు…
సంక్రాంతి పండుగ రోజున ఎవరికీ చెప్పకుండా పొలానికి వెళ్లిన వెంకటప్ప మళ్లా తిరిగిరానిలోకా
లకు వెళ్లి పోయాడు.వికారాబాద్‌ జిల్లా రైతుల ఆత్మహత్యల లిస్టులో అతడి పేరు కూడా చేరింది.
బుజ్జమ్మ,తన ఇద్దరు చిన్నారులతో దిక్కులేనిదయింది.
ఇంట్లో తిండికి గడవని పరిస్థితి, భర్త చేసిన అప్పులు ,పొదుపు సంఘంలో అప్పులు ఆమెను అతలా కుతలం చేశాయి.
భర్త ఎక్స్‌గ్రేషియా కోసం అధికారుల చుట్టూ తిరిగీ తిరిగీ అలసి పోయి, సొమ్మసిల్లి పడిపోయిన బుజ్జమ్మకు కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ పోస్టర్‌ కనిపించింది. ఆఖరి ఆశగా కాల్‌ చేసింది.

baaindlabujjamma with kisanmitra sangameswar

baaindlabujjamma with kisanmitra sangameswar

గంటలోనే ఆమె గుమ్మం ముందు రైతు స్వరాజ్యవేదిక కార్యకర్త సంగమేష్‌ ప్రత్యక్షమయ్యాడు.
ఆమెకు భవిష్యత్‌ గురించి కాస్త నమ్మకం కలిగించాడు. బైండ్ల బుజ్జమ్మ బతుకు చిత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
ఆ పేద మహిళ కన్నీటి గాథ కలెక్టర్‌ దివ్యను కదిలించింది. ఆమెను కలెక్టర్‌ ఆఫీసుకు రప్పించి సబ్‌కలెక్టర్‌ సందీప్‌ ద్వారా రూ.5లక్షల ఎక్స్‌ గ్రేషియాను బుజ్జమ్మ పేర బ్యాంకులో డిపాజిట్‌ చేసి 3 నెలలకోసారి వడ్డీ వచ్చేలా ఏర్పాటు చేశారు.ఆమె అప్పులు సెటిల్‌ చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కూడా మంజూరు చేస్తామన్నారు.కూతురు నికితకు రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సీట్‌ ఇప్పించారు.ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు ఇచ్చారు. తన ఎకరం భూమిని ఒక రైతుకు బటాయికి ఇచ్చి కొంత ఆదాయం పొందుతోంది.
బుజ్జమ్మ జీవితంలోని అమావాస్య చీకట్లు మెల్లగా తొలిగి పోతున్నాయి.
” దిక్కులేని మా కుటుంబానికి కలెక్టరమ్మ ‘దివ్య’ మైన వెలుగును చూపించారు. కిసాన్‌ మిత్ర మా సమస్యలన్నీ తీర్చింది ” అని సంతోషం నిండిన స్వరంతో జిన్‌గుర్తిలో ‘రూరల్‌మీడియా’తో చెప్పింది బుజ్జమ్మ. బతుకంతా దగా చేసినా, చిగురంత ఆశ ఆమెను ముందుకు నడిపిస్తోంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *