Teej, a festival of Adilabad Tribals

Teej Festival in Tribal tandas_ruralmedia2

ప్రకృతి పండుగ ‘తీజ్‌ ‘
ఈ నెల నాలుగో తేదీ నుండి మొదలైన తీజ్‌ సందడి నేడు జరిగే నిమజ్జనంతో ముగుస్తుంది. తీజ్‌ ఉత్సవాన్ని తెలంగాణ తండాల్లోని పెళ్లికాని ఆడపిల్లల చేస్తారు.వర్షాకాలం తొలకరి సమయంలో కనిపించే ఎర్రని ముఖమల్‌ లా ఉండే ఆరుద్ర పురుగును తీజ్‌ అంటారు. గోండు గిరిజనులు గోధుమ మొలలను కూడా తీజ్‌ అని పిలుస్తారు.బతుమ్మను తంగేడు పూలతో అలంకరించినట్టే, తీజ్‌ను గోధుమ మొలకలతో పేర్చుతారు.వర్షాకాలం మెదలై నాట్లు పూర్తయిన తరువాత తీజ్‌ను జరుపుతారు. ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, దొడందా,గట్టేపల్లి తండాల్లో గోండు,మధురా,కొలాం తెగల ఆదివాసీలు జరుపుకుంటున్న ‘తీజ్‌’పండుగ సందడి ఇది.
క్రిమిసంహారక మందులతో పొలాల్లో మట్టి కలుషితమై పోతుండటంతో గిరిజన ఆడబిడ్డలు పవిత్రమైన మట్టికోసం అడవుల్లో పుట్టను తవ్వి మట్టిని సేకరించి తీజ్‌ పండుగను జరుపుకుంటారు. వానలు కురిసి పంటలు పండాలని తమ బతుకులు బాగుండాలని ప్రకృతిని ప్రార్ధించడమే తీజ్‌ వెనుక పరమార్ధం.

Teej Festival in Tribal tandas_ruralmedia

Teej Festival in Tribal tandas_ruralmedia

పండుగ ఇలా…
గిరిజన తండాల్లోని యువతులంతా కలిసి పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకున్న తరువాత ఇంటింటికి తిరిగిన వేడుకల కోసం ఇచ్చినంత విరాళం తీసుకుంటారు. ఆ డబ్బుతో గోధుమలు,ఇతర సామాగ్రి తెచ్చుకుంటారు.సాయంత్రం గోధుమలు నీటిలో నానపెడతారు.మరుసటి రోజు దుసేరు తీగతో అల్లిన చిన్న బుట్టలలో పుట్టమట్టిని తెచ్చి అందులో ఆదివాసీల దేవతలు సేవాభయా,దండియాడి పేర్లతో మొదటగా తండా నాయకుడి చేత ఎరువు కలిపిన మట్టిని పూయిస్తారు. ఈ బుట్టలన్నింటినీ ఒక పందిరి కింద ఉంచి,వాటిపై నీళ్లు చల్లుతూ, అక్కడ రోజూ ఆడపిల్లలంతా కలిసి ఆడుతూ పాడతారు.
”గోధుమలను బుట్టలో చల్లేరోజు సాయంత్రం బోరడి గష్కేరో నిర్వహిస్తారు. పెళ్లికాని ఆడపిల్లలంతా రేగుముళ్లకు శెనగలు గుచ్చేటపుడు వరుసైన మగాళ్లు వాటిని కదిలిస్తూ ఆటపట్టిస్తారు.అయినప్పటికీ శెనగల్ని గుచ్చాల్సిందే. కొన్ని తెగల్లో అన్నలు కూడా చెల్లెలను ఏడిపిస్తారు.” అని తీజ్‌ పండుగలోని ఒక ముచ్చటను వివరించింది దొడందా తండాకు చెందిన డిగ్రీ చదువుతున్న గోండు విద్యార్ధిని.
చుర్మో….కడావో
” రొట్టెలు,బెల్లం కలిపిన ముద్దను దేవుడికి సమర్పించడాన్ని చుర్మో(కొన్ని తెగలు ఢమోళి అంటారు) అంటారు.ఇది ఏడవ రోజున జరిపే కార్యక్రమం. అందరూ తలో కొంత బియ్యం సేకరించి పాయసం(కడావో) వండుతాం. ఎనిమిదో రోజున మా ఆదివాసీ ఆరాధ్య దేవతలను మట్టితో చేసి వాటికి పెళ్లి చేస్తాం.” అని వివరించారు గట్టేపల్లి గ్రామస్ధులు.
నిమజ్జనమిలా…
తొమ్మిదో రోజున తీజ్‌ నిమజ్జనానికి బంధువులను పిలుస్తారు.తండాలన్నీ పండుగ వాతావరణం సంతరించుకుంటాయి.కొత్త దుస్తులు ధరించి సేవాలాల్‌,మేరామా భవానీ కి పూజలు చేసి తొమ్మిది రోజుల పాటు పెంచిన గోధుమ పిలకల బుట్టల ముందు కొబ్బరి కాయలు కొట్టి మొదటి తీజ్‌ను నాయక్‌ రుమాలులో పెట్టిన తరువాత ఆపదల నుండి తమను కాపాడాలని అన్న దమ్ములకు గోధుమ నారు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.
అమ్మాయిలంతా తీజ్‌ బుట్టలు పట్టుకొని వరుసగా నడుస్తూ పాటలు,కేరింతలు,డప్పుల మధ్య సమీపంలోని నీటి చెలమల్లో తీజ్‌ నిమజ్జనం చేస్తారు.
….. శ్యాంమోహన్‌ (రూరల్‌మీడియా) ఫోటోలు.కె.రమేష్‌బాబు

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *