గిరిజన పల్లెలకు సౌర వెలుగులు ?

solar power for Tribal hamlets ?

గిరిజన పల్లెలకు  సౌర వెలుగులు ?

  • గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటుకు విదేశీ కంపెనీల సంసిద్థత
  • మారుమూల గిరిజన నివాసాల్లో సౌర విద్యుత్
  • వచ్చే ఏడాది ఉత్పత్తి లక్ష్యం 4వేల మెగావాట్లు

విజయవాడ, జూలై 23 :    ( Ruralmedia With I&PR,RRW Inputs )

విద్యుత్ ఖర్చు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యుత్ రంగంలో అనేక ఘనవిజయాలు సాధించి, విద్యుత్ పొదుపులో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన మన రాష్ట్రం సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన రాష్ట్రంగా ఏపి రికార్డు నెలకొల్పింది. మారుమూల గ్రామాలలోని అన్ని ఇళ్లకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో దాదాపు విజయం సాధించినట్లే భావించవచ్చు. అతి మారుమూల ఉన్న కొద్దిపాటి గిరిజనుల ఇళ్లకు తప్ప అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదు. అందువల్ల ఆ ఇళ్లకు సౌర విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సౌర విద్యుత్ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, దాని ఉత్పత్తి పెంచడానికి ప్రాధాన్యత ఇస్తోంది. 2017 జూలై నాటికి రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుచ్ఛక్తిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ రంగంలో గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటుకు విదేశీ కంపెనీలు కూడా తమ సంసిద్థతను తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీలలో ఒకటైన నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ కూడా మన రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది.

రాష్ట్రంలో 30వేల కోట్ల రూపాయలతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పరుస్తున్నారు. ఎన్.టి.పి.సి. ద్వారా అనంతపురం జిల్లాలోని సౌర విద్యుత్ పార్కు నుంచి మొదటి దశ కింద 250 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 10 నెలల్లోనే దీనిని అభివృద్ధిపరిచారు. రెండవ దశలో 2017 మార్చి నాటికి మరో 750 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేనున్నారు. ఇదే జిల్లా తాడిపత్రిలో ఏపి జెన్ కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ పార్కును నెలకొల్పనున్నారు. ఎన్.వి.వి.ఎల్. ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ఎస్ బి ఎనర్జీ, సన్ ఎడిసన్, అజూర్ పవర్, అదాని గ్రూపు చేపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కడప జిల్లా గాలివీడులో సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేపడుతోంది. ఇదే జిల్లా మైలవరం ఎంపిటిసి, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాల ఆధ్వర్యంలో 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోనే మొదటిసారిగా వంద మెగావాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ నిల్వ యూనిట్లను కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నారు.

సౌర విద్యుత్ పంపు సెట్ల పథకంలో భాగంగా 5,013 పంపు సెట్లు బిగించి దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రానున్న మూడేళ్ల కాలంలో ఏడాదికి పది వేల చొప్పున 30వేల పంపు సెట్లు బిగిస్తారు. ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల విషయంలో ఇప్పటికే మన రాష్ట్రం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. భవిష్యత్ లో సౌరవిద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు..

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *