ఊరి పేరు కోసం, ఊరంతా కదిలింది …

Rural Transformation of a Tribal Village

వరంగల్‌ నుండి 73 కిలో మీటర్ల దూరంలో సమ్మక్క,సారాలక్క జాతర జరిగే సమీపం లోని గోవిందరావు పేట మండలం(జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా) అటవీ ప్రాంతపు గ్రామంలోకి అడుగు పెట్టగానే, తునికాకులు ఎండపెడుతున్న గిరిజన మహిళలు కనిపించారు. మీ ఊరి పేరేంది అని అడిగితే ‘ ఫ్రూట్‌ ఫారం’ అని వారు చెప్పిన సమాధానం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. తునికి,ఇప్పచెట్లు తప్ప పండ్లతోటలు కన్పించని ఒక మారు మూల గిరిజన పల్లెకు ఆ పేరెలా వచ్చిందనే ప్రశ్న మెదిలింది.
60 ఏళ్ల క్రితం ఆ గ్రామం పండ్ల తోటలకు ప్రసిద్ది. కాలక్రమంలో తోటలన్నీ అంతరించి పోగా ,ఐదేళ్ల క్రితం 33మంది గిరిజనులు ఆ ఊరికి పునర్వై భవం తెచ్చారు.. వారి క షి వెనుక ఉన్న ఆసక్తి కరమైన కథనాన్ని ఆ గ్రామస్ధులే ఇలా వివరించారు.
‘ ఫ్రూట్‌ ఫారమ్‌’ పేరు వెనుక…
” ఇదంతా 1958 నాటి ముచ్చట. వరంగల్‌ జిల్లా, గోవిందరావు పేట మండలంలో ల్యాండ్‌ లార్డ్‌ వెంకటపతి రాజు కి వేలాది ఎకరాలుండేవి. జంపన్న వాగు సమీపంలో సర్వేనెంబర్‌ 667లోని అతని 30ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ వాగు సమీపంలో పూరిళ్లు వేసుకొని బతుకుతున్న15మంది కోయగిరిజనులతో ఆ భూముల్లో మామిడి,జామ,బత్తాయి పండ్లతోటలు సాగు చేయించారు. తోటలు పెంచినందుకు గిరిజనులకు కూలీని చెల్లించేవారు. పది సంవత్సరాల తరువాత 1968లో అప్పటి ప్రభుత్వం ఆ గిరిజనులతో ‘కోయ కోఆపరేటివ్‌ కలెక్టివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌’ సంస్ధను ఏర్పాటు చేయించి , ఆ భూములను వారికే అప్పగించారు. అప్పటి నుండి ఫలసాయాన్ని గిరిజనులు పొందసాగారు. అనేకమంది అధికారులు సందర్శించి, గిరిజనుల సమష్టి సాగును పరిశీలించే వారు ఇదే క్రమంలో ఐటిడిఎ నుండి పిఓ శర్మ అనే అధికారి ఆ పండ్లతోటలను చూసి ‘మీ గ్రామం పేరేంటి?’ వారిని అడగ్గా,’ తోటల గ్రామం ‘ అని చెప్పారు. ఆయన దాన్ని ‘ఫ్రూట్‌ఫారమ్‌’ అని మార్చగా అప్పటినుండి ఇప్పటి వరకు ఆ గ్రామానికి అదే పేరు స్ధిర పడింది.” అని వనసమాఖ్య స్వచ్ఛంద సంస్థ సిఇఒ శ్రీనివాసులు అంటారు.

frutfarm-1

frutfarm-1

పండ్లు అమ్మిన చోటే తునికాకులు అమ్ముతూ…
కాల క్రమంలో సాగునీటి కొరత వల్ల ఆ పండ్లతోటలన్నీ అంతరించి పోయి ‘ఫ్రూట్‌ఫారమ్‌’ పేరు మాత్రమే మిగిలింది. ఒకపుడు పండ్లతోటల సాగుతో ఏ లోటు లేకుండా బతికిన గిరిజనులు ఆ తరువాత తునికాకు,ఇప్పపూల సేకరణే జీవనాధారంగా బతక సాగారు. మరి కొందరు సమీప నగరాలకు వలస పోయేవారు.
ఊరంతా కదిలింది
ఇలాంటి స్ధితిలో తమ ఊరి పేరుకు తగినట్టు ఒకప్పటిలా పండ్లతోటలు ఎందుకు సాగు చేయకూడదని గిరిజనులంతా కలిసి చర్చించుకున్నారు. వారి పొరుగు గ్రామాల్లో తునికాకు సేకరణలో,అమ్మకంలో సాయపడుతున్న ‘వనసమాఖ్య’ స్వచ్ఛంద సంస్ధను సంప్రదించారు.
ఆ సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని కొందరు రైతులతో కమిటీ ఏర్పాటైంది. ఆరేళ్ల క్రితం ఫ్రూట్‌ఫారం సాగునీరు సదుపాయం లేక కరవు తాండవమాడేది.
శ్రమదానంతో పనులు చేస్తే తోటలు పెంచుకోవచ్చని ఎన్జీఓలు చెప్పడంతో కొందరు రైతులు పలుగు, పార పట్టి మామిడి,ఉసిరి మొక్కలు నాటారు. వారి వెనుక ప్రజలంతా కదిలారు.
ఏడాది తరువాత ఊరు మారడం మొదలైంది. ఎన్జీఓల సాయంతో జలసంరక్షణ పద్దతులు తెలుసుకున్నారు. గ్రామం పక్కనే ఎండిపోయిన జంపన్న వాగులో ఫిల్టర్‌ పాయింట్స్‌ వేసి డీజిల్‌ ఇంజన్లతో నీటిని తోడి పండ్లతోటలను పెంచారు. ఎండిన బోర్లకు రీఛార్జ్‌ నిర్మాణాలు చేశారు. వానలు పడినపుడు నీరంతా వథాగా పోకుండా రాతికట్టలు, తోటల చుట్టూ కందకాలు తవ్వి, భూగర్భ జలాలను పెంచారు. తక్కువ ఖర్చుతో చేసే ఈ పనుల వల్ల ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటిని తోటలలోనే ఇంకిపోయేలా చేశారు. అంతకు ముందు ఇప్పపూల సేకరణ మీద ఆధారపడిన గిరిజనులు ఇపుడు పండ్లతోటలకు యజమానులయ్యారు. అంతర పంటలుగా బొబ్బర్లు,కూరగాయలు పండిస్తూ ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నేడు ఫ్రూట్‌ ఫారం గిరిజనుల ఆదాయం ఏడాదికి సుమారు రూ. 36 లక్షలకు చేరిందంటే ఎంత మార్పొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
” మా గ్రామంలో 112 కుటుంబాలుండేవి. వీరిలో కొందరు బతుకు తెరువు కోసం వలసలు వెళ్లారు. ఒకప్పటి ఊరి పేరుని నిలబెట్టాలని 33కుటుంబాలు ముందుకు వచ్చి మామిడి తోటలు పెంచారు. మా కష్టం ఫలించి,అందరికీ ఆదాయం అందుతోంది.” అన్నారు గ్రామ
సర్పంచ్‌ తాటి రమణ.
శ్రమించి సాధించారు
” ఇంతకు ముందు ఎవరికైనా మా ఊరు పేరు చెప్పాలంటే ఇబ్బందిగా ఉండేది. ఆరేళ్లలో పండ్లతోటలు పెంచాం. ఇపుడు మా తోటలు చూపించి ఇదే ఫ్రూట్‌ ఫారం అని గర్వంగా చెప్పుతున్నాం.ఈ మామిడి పండ్ల కోసం హైదరాబాద్‌ నుండి కూడా వస్తున్నారు.” అని తమ చెట్లకు కాసిన తోతాపురి మామిడి పండ్లను చూపిస్తూ , సంతోషాన్ని పంచుకున్నారు గొండి సమ్మక్క.
వీరు తొలి ప్రయత్నంలో 33 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచారు. వీటిని చూసి మరి కొందరు ముందుకు రావడంతో తోటలను విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. వీరు చేపట్టిన నీటిసంరక్షణ పనుల వల్ల భూగర్భ జలాలు ఇప్పటికీ పుష్కలంగా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతమనీ, చదువు లేదనీ, సాగునీరు తక్కువనీ నిరుత్సాహపడకుండా తమకాళ్లపై తాము నిలబడి స్వయం సమద్ధి సాధించి, ఎండిన ఫ్రూట్‌ఫారంని చిగురింప చేశారు ఈ కోయగిరిజనులు.
………………
శ్యాంమోహన్‌

(This article is presented under RuralMedia-Nirmaan partnership. )

 

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *