హైదరాబాద్‌ టు అరకు , అందాల రహదారి

Google+ Pinterest LinkedIn Tumblr +

అరణ్యమార్గంలో మరో జాతీయ రహదారి
లంబసింగి, చింతపల్లి, మీదుగా కొత్త బాట
రూ.2వేల కోట్లతో ప్రాజెక్టు?
…………………………………
హైదరాబాదులో కారు స్టార్టు చేసి , అడవి అందాలు ఆస్వాదిస్తూ కొండ కోనలూ. జలపాతాల మధ్య ప్రయాణిస్తూ… నేరుగా అరకు అందాల మధ్యకు చేరుకోవడం ఓ అందమైన కల.
ఈ ఆకుపచ్చని స్వప్నం నిజం కాబోతోంది. ఇక రాజమండ్రి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రంపచోడవరం మీదుగా విశాఖ ఏజెన్సీలోని లంబసింగి చేరుకోవచ్చు. దారిలో అటూ ఇటూ విస్తరించిన దండకారణ్యం , గలగల పారే సెలయేళ్లు. సందడి చేసే జలపాతాలు.గిరిజన సంస్కృతి మధ్య ఆహ్లాదమైన ప్రకృతి ఒడిలో సేద తీరుతూ అరకు లోయకు చేరుకోవచ్చు. దారి పొడవునా చలి గిలిగింతలు పెట్టే చింత పల్లి కొండలు…పాడేరు మైదాన ప్రాంతాల గుండా ప్రయాణం, ఆదివాసీ జాతుల సంప్రదాయ జీవనం… పర్యాటకులకు పసందైన కను విందు.
సమయం,దూరం తగ్గుతుంది…
ఇదివరకటిలా రోడ్డు మార్గాన ప్రయాణించి అరకు చేరాలంటే విశాఖ పోనక్కర్లేదు. నేరుగా విజయనగరం జిల్లా లోని మైదాన. అటవీ ప్రాంతాలు దాటి అరకు చేరుకోవచ్చు. దాదాపు 50 కిలో మీటర్ల దూరం కలిసివస్తుంది. హైదరాబాదు నుంచి విశాఖకు విమాన ప్రయాణం, రెండు చోట్లా ఎయిర్‌ పోర్టులో మళ్లీ వెయిటింగ్‌ లాంటి తిప్పలన్నీ తప్పుతాయి. విశాఖ ఏజెన్సీ నుంచి జస్ట్‌ మరో 120 కిలోమీటర్లు రోడ్డుమార్గాన ప్రయాణిస్తే చాలు, మూడుగంటల్లోనే అరకు చేరుకోవచ్చు. విశాఖ నుంచి రైలు మార్గాన అరకు వెళ్లాలంటే నాలుగు గంటలు పడుతుంది. ఈ రోడ్డు మార్గంలో అయితే ఒక గంట తక్కువ సమయంలోనే అరకు చేరుకోవచ్చు.అది కూడా అందాలు చిందే తూరుపు కనుమల మధ్య, ఘాట్‌ రోడ్డుమీద ఆహ్లాదకరమైన ప్రయాణం.
ఈ కలని నిజం చేస్తూ రాజమండ్రి నుంచి అరకు వరకూ అరణ్యమార్గంలో మరో జాతీయ రహదారి రాబోతోంది. రంపచోడవరం ,లంబసింగి, చింతపల్లి, సృంగవరపుకోట మీదుగా ఈ రాదారి పోతుంది. ఈ కొత్తజాతీయ రహదారికి ఎన్‌ హెచ్‌ 516-జు గా పేరు పెట్టినట్టు. జాతీయ రహదారులు రోడ్డురవాణా ప్రాంతీయ అధికారి ఎస్‌.కె.సింగ్‌ అంటున్నారు. పది మీటర్ల వెడల్పు ఉండే ఈ జాతీయ రహదారికి సబ్‌ వేలు కూడా ఉంటాయి.

ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ప్రాజెక్టు నివేదిక రెడీ అవుతుంది. ఈ ప్రాజెక్టుకు 2వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. మొత్తం ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుందని సింగ్‌ చెప్తున్నారు.
” ఈ రోడ్డు పూర్తయితే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, టూరిస్టులు రోడ్డు మార్గాన విశాఖను టచ్‌ చెయ్యకుండానే అరకు చేరుకోవచ్చని,ఈ రహదారిలో పర్యాటకుల కోసం లంబసింగిలో రిసార్టులు కూడా నిర్మిస్తున్నట్లు ఎపిటూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు ‘రూరల్‌మీడియా’కు చెప్పారు. వీటి నిర్మాణానికి ఐదుకోట్లు ఖర్చవుతుంది.ఈ ప్రాజెక్టు మొదటి దశరోడ్డు నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే 17వందల 93కోట్లు మంజూరు చేసిందని అధికారులంటున్నారు. ఈ ప్రాజెక్టు పై కేంద్రం చకచకా అడుగులు వేస్తోంది. మొత్తం ఖర్చంతా భరిస్తోంది. నిధులకి లోటు లేదు. తర్వలోనే ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ నుంచి అరకులోయదాకా అడవి అందాల మధ్య విస్తరించిన జాతీయ రహదారిపై ప్రయాణం.ఓ అందమైన అనుభవం కాబోతుంది.
విశాఖ నుండి రూరల్‌మీడియా ప్రత్యేక ప్రతినిధి

Share.

Leave A Reply