పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య…

Google+ Pinterest LinkedIn Tumblr +

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య…

ఆర్థిక స్థోమత కలిగిన వారి పిల్లలు ఎలాగూ మంచి పాఠశాలలకు వెళ్లి చదువుకుంటారని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పేద విద్యార్థుల చదువు కోసం పెట్టిన ఖర్చు భావితరాలను బాగు చేయడానికి ఉపయోగపడుతుందని, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతీ ఏడాది 20 వేల కోట్ల రూపాయలకు పైగా విద్య కోసం ఖర్చు పెడుతున్నప్పటికీ, ప్రభుత్వ విద్యలో అనుకున్న ఫలితాలు రావడం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న అన్ని విద్యాసంస్థలు మెరుగైన పద్దతుల్లో నడిచే విధంగా, మంచి విద్య విద్యార్థులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. పేద విద్యార్థులకు ఎల్.కె.జి. స్థాయి నుంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి అనుగుణంగా విద్యా విధానం ఉండాలని, దానిని పరిగణలోకి తీసుకునే బడ్జెట్ ప్రతిపాదనలుండాలని, విద్యారంగానికి పెట్టే ఖర్చు కూడా ఈ లక్ష్యం చేరుకునేలా చేయాలని సిఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న హాస్టళ్లను దశల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని సిఎం చెప్పారు.

బడ్జెట్ సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం విద్యాశాఖపై చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి  కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి  ఈటెల రాజెందర్, ప్రభుత్వ సలహాదారుడు శ్రీ జిఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి రాజీవ్ రంజన్ ఆచార్య, సిఎంఓ ముఖ్య కార్యదర్శి     నర్సింగ్ రావు, వివిధ శాఖల సీనియర్ అధికారులు     బిపి ఆచార్య,  రామకృష్ణారావు,  శివశంకర్,  నవీన్ మిట్టల్,  జి. కిషన్,  వాణీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.

“విద్యాశాఖలో 14 విభాగాలున్నాయి. అన్ని అవసరం లేదు. అధికారులు కూడా లేరు. కాబట్టి విభాగాలను తగ్గించాలి. అవసరం లేని వాటిని తొలగించాలి. ఒకే స్వభావం ఉన్న విభాగాలను కలిపేయాలి. ఆర్కైవ్స్, గ్రంథాలయాల లాంటి విభాగాలను కల్చరల్ శాఖకు అప్పగించాలి. అన్ని భాషల అకాడమీలను ఒకే అకాడమీగా మార్చాలి. అన్ని రకాల విద్యను విద్యాశాఖ పరిధిలోకే తేవాలి. ఐటిఐని కార్మిక శాఖ నుంచి సాంకేతిక విద్య శాఖకు బదిలీ చేయాలి. ఇలా ప్రతీ విభాగం గురించి లోతుగా అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన ప్రతీ పథకాన్ని, ప్రతీ విషయాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏది అవసరమో దాన్ని కొనసాగించాలి. అవసరం లేని దాన్ని రద్దు చేసుకోవాలి. విద్యాశాఖలో ప్రచురణల విభాగం నిరర్థకం. అలాంటి వాటిని తొలగించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.

“పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రస్తుతమున్న విద్యాసంస్థలెన్ని? అవి ఎలా నడుస్తున్నాయి? అనే విషయంలో లోతుగా అధ్యయనం జరపాలి. ఉన్న విద్యాసంస్థలు బాగా నడిచే విధంగా చూడాలి. ఆ విద్యాసంస్థలు అత్యున్నతంగా నడిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. యూనివర్సిటీలంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు యూనివర్సిటీల వ్యవహారం గందరగోళంగా మారింది. స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్య, వివిధ సొసైటీల ద్వారా నడుస్తున్న విద్యాసంస్థల గురించి సమగ్ర సమచారం ఒకే దగ్గర ఉండాలి. ఎన్ని విద్యాసంస్థలున్నాయి? వాటిలో వసతులు ఎలా ఉన్నాయి? విద్యార్థులెంతమంది ఉన్నారు? ఉపాధ్యాయులెంతమంది ఉన్నారు? ఇంకా ఏమైనా నియామకాలు చేపట్టాలా? అవసరం లేని చోట ఎక్కువ మంది ఉంటే వారిని వేరే చోటికి ఎలా తరలించాలి? తదితర విషయాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇందుకోసం ఓ అధికారిని నియమించి అన్ని రకాల గణాంకాలు నమోదు చేయాలి. దానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ మంది విద్యార్థులున్న విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. కొత్తగా భవనాలు కట్టుకుంటూ పోవడం కాకుండా, ఉన్న వాటికి కావాల్సిన ఫర్నిచర్, విద్యుత్ లాంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి” అని సిఎం కేసీఆర్ సూచించారు.

“కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పథకాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులేమిటనే విషయం గమనించాలి. కేంద్రం చేసే ఆర్థిక సహాయంలో కోతలు పెడుతున్నారు. రాష్ట్ర వాటా పెంచుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాల అమలుపై కూడా సమీక్ష జరుపుకోవాలి. వారిచ్చే నిధులను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో స్పష్టత ఉండాలి. కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులను రాష్ట్ర పథకాల్లో ఎలా కలుపుకోవాలో ఆలోచించాలి. దానికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలుండాలి” అని కేసీఆర్ సూచించారు.

“ప్రభుత్వ పరంగా అనేక విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ప్రైవేటు రంగంలోనూ అనేక విద్యా సంస్థలు నడుస్తున్నాయి. అక్కడేమి జరుగుతుంది? ఇక్కడేమి జరుగుతుందనే విషయంలో విద్యాశాఖకు స్పష్టత ఉండాలి. ఎక్కడేమి జరుగుతుందో తెలుసుకుంటేనే ఎక్కడ ఏ మార్పులు చేయాలో, ఎంత సమర్థంగా విద్యను పేదలకు అందించగలుగుతామనే అంచనా దొరుకుతుంది. విద్యార్థులు లేకున్నా కొన్ని పాఠశాలలు మాత్రం నడుస్తున్నాయి. వాటిని ఏం చేయాలో ఆలోచించాలి. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి ఇలాంటి విషయంలో ఓ విధానం రూపొందించాలి” అని సిఎం అన్నారు.

“చాలా పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది. మంచి నీళ్లుండవు. పరిశుభ్రత ఉండదు. మరుగుదొడ్లు శుభ్రం చేయరు. పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్వరు. మొక్కలు నాటరు. పచ్చదనం పెంచరు. ఈ విషయాల్లో గ్రామ పంచాయితీలను బాధ్యులను చేస్తూ చట్టం చేస్తాం. పాఠశాలలు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నడవాలి. విద్యాసంస్థలకిచ్చే కాంటిజెన్సీ నిధులు కూడా సక్రమంగా ఉపయోగపడాలి” అని సిఎం అన్నారు.

 

Share.

Leave A Reply