నవ్వే … నేరమా ? అధ్యక్షా…?

Political Cartoons through a Changing Media

నవ్వే … నేరమా ? అధ్యక్షా…?
……………………………………
” ఇది చేపల మార్కెట్టా… అసెంబ్లీనా …?”
ఇరవై ఏళ్ల క్రితం ఆర్కేలక్ష్మణ్‌ వేసిన జేబులో బొమ్మ అది. రోజూ లక్షలాది మంది చదివే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వేసిన కార్టూన్‌ అది. ఇంతటి ఘోరానికి పాల్పడినందుకు ఆప్పటి ప్రభుత్వం లక్ష్మణ్‌ని అరెస్టు చేయక పోగా పద్మభూషణ్‌తో గౌరవించారు.
రాజీవ్‌గాంధీ పాలన సాగుతున్నపుడు ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌లో రవిశంకర్‌ ఒక ఉద్యమంలా కార్టూన్లు వేశాడు. ప్రతీ రోజూ ఫ్రంట్‌ పేజీలో రాజీవ్‌ పై పంచ్‌లు పేలేవి. అయినా ఆ కార్టూనిస్టు అరెస్టు కాలేదు. సాయంత్రాలు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో కూల్‌ అవుతున్నా ఆ కార్టూనిస్టుని ఎవరూ టచ్‌ చేయలేక పోయారు.
ఓ విజయన్‌,ఆబూ, సుధీర్‌ ధర్‌, ఇర్ఫాన్‌ హుస్సేన్‌ వీరంతా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలా పనిచేశారు. ప్రభుత్వం అవక తవకలపై తమ వ్యంగ్యాన్ని ఎక్కు పెట్టారు.పాఠకులకు నవ్వులు పంచారు.
‘ఉదయం’ పత్రిక మొదలయ్యాక పొలిటికల్‌ కార్టూన్‌ పవర్‌ ఏంటో తొలిసారిగా కార్టూనిస్టు మోహన్‌ రుచి చూపించారు. ఎన్టీఆర్‌ పాలనను నిత్యం ఉతికి ఆరేసే వారు. అయినప్పటికీ కళవిలువ తెలిసిన ఎన్టీఆర్‌ ఎపుడూ మోహన్‌ జోలికి రాలేదు. అయితే రన్నింగ్‌ కామెంటరీ కాలమ్‌కి వేసిన కుక్కపిల్ల కార్టూన్‌కి మాత్రం స్పీకర్‌ వార్నింగ్‌ ఇచ్చారు… తప్ప ఆరెస్ట్‌ చేయలేదు. ఎడిటర్‌ సారీ చెప్పడంతో ఆ వివాదం అలా ముగిసింది. నేను ఆంధ్రజ్యోతిలో ‘మతం మత్తు మందు’ అని వేసిన కార్టూన్‌ పై ఒక పార్టీ వారు కేసు వేశారు తప్ప నన్ను బెదిరించ లేదు. అప్పటి ఎడిటర్‌ నండూరి రామ్మోహన రావు కొంత కాలం కోర్టుల చుట్టూ తిరిగారు చివరికి ఆ కేసు కొట్టేశారు.
ఇదంతా ఒకప్పటి దృశ్యం… ఇపుడు సీన్‌ రివర్స్‌ అవుతోంది…
పత్రికల్లో కార్టూన్‌ మసక బారుతోంది.ప్రభుత్వం పై కాకుండా ప్రతిపక్షం పై కార్టూన్లు వేసుకోవాల్సిన బ్యాడ్‌ టైం ఇది. ఒకపుడు ముఖ్యమంత్రి అంజయ్య గాలిమోటారు ఎక్కినందుకు ఆయనకు హెలికాప్టర్‌ తగిలించి ఎన్ని కార్టూన్లు వేశారు? ఇప్పటి సీఎంలు స్పెషల్‌ ఫ్లైట్లలో తిరుగుతూ స్టార్‌ హోటళ్లలో కుటుంబంతో సహా ఉంటూ నెలకు కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్న ఒక్క కార్టూన్‌ కనబడదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే సామాన్యుడు సోషల్‌ మీడియాను వేదికగా తీసుకొని తన అసహనాన్ని ప్రకటిస్తున్నాడు. సెన్సాఫ్‌ హ్యూమర్‌ మన సంస్క ృతిలో భాగం కావాలి. ఏ సభలోనైనా పెద్దలను గౌరవించాల్సిందే. కానీ పెద్దల ముసుగులో చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపడం తప్పు ఎలా అవుతుంది ?

ఈ ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు ఇలా అన్నాడు.” స్పీచులే గొప్ప కామెడీ గా  ఉంటుంటే మళ్ళీ   ప్రత్యేకంగా  కార్టూన్లు అవసరమా ?”

shyammohan-300x234-shyammohan

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *