ఉద్యమాల భూమిలో…మల్బరీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉద్యమాల భూమిలో …మల్బరీ
ఉన్నత చదువున్నా, ఉద్యోగం రాక పోవడంతో నేల తల్లిని నమ్ముకున్నాడీ ప్రేమ్‌ కుమార్‌ . 
తనకున్న రెండెకరాల ఎర్రమట్టి నేలలో సాగు చేయాలనుకున్నాడు. బీడు భూమిని సాగు భూమిగా మార్చాడు కానీ , తన పొలానికి పక్కనే అటవీ శాఖ యూకలిప్టస్‌ తోటలను పెంచుతోంది. ఆ చెట్లు భూగర్బ జలాలను విపరీతంగా పీలుస్తాయి. అందువల్ల ఆ ప్రాంతంలో మిగతా పంటలు పంటలకు నీరు అందదు. ఇలాంటి ప్రమాదాల మధ్య అర ఎకరాలో గత ఏడాది పందిర్లు వేసి బీర,సొర,దొండ పండించాడు. అతి కష్టం మీద అన్ని ఖర్చులు పోనూ రూ.40వేలు మాత్రబమే చేతికొచ్చింది. 
ఇలా సాగు చేస్తే లాభం లేదని వ్యవసాయ నిపుణులకు తన నేలలో మట్టిని చూపించి మల్బరీ పంటకు పనికొస్తుందేమో పరీక్షించ మన్నాడు. వారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ప్రేమ్‌ కుమార్‌ వెన్ను తట్టారు. రెండు ఎకరాలో ఈ సారి మల్బిరీ మొక్కలు నాటాడు. డ్రిప్‌ పైపులు వేసి చుక్కలసేద్యం చేస్తున్నాడు. ముదురాకు పచ్చదనంతో తళతళ మెరుస్తున్న అరచేయంత ఆకులతో ఉన్న మొక్కలను మాకు చూపించాడు. 
మీ ప్రాంతంలో అందరూ పత్తి, మొక్కజొన్న వేస్తుంటే, దీనికి భిన్నంగా మల్బరీ పండించడంలో నీ ధీమా ఏమిటీ? అని అడిగితే..? 
” ఈ మొక్కలు ఒక్క సారి నాటితే పదేళ్ల వరకు ఆదాయం వస్తూనే ఉంటుంది. పెరిగిన ఆకులను తెంపితే మళ్లా చిగురిస్తాయి. పట్టు పురుగుల కోసం షెడ్‌ కట్టుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తామంది. మిగతా పంటల అవసరమైనంత ఎరువులు,నీరు కూడా మల్బరీ కి అవసరం లేదు. చీడ,పీడల సమస్యలు లేవు. నీళ్లు మాత్రం సక్రమంగా పెడుతుండాలి. దాని కోసం డ్రిప్‌ సిస్టం పెట్టాను. ఈ పంట వల్ల 
నెలకు రూ.20 వేల ఆదాయం గ్యారంటీ… ఏ పంట మీద ఇంత వస్తుంది చెప్పండి?” అని తోటలో బోరు ఆన్‌ చేయడానకి బయలు దేరాడు. 
కరీనగర్‌ జిల్లా, కాటరాం మండలం దశాబ్దం క్రితం తీవ్రవాద ఉద్యమాల నేపథ్యం ఉండేది. ఉపాధి లేని యువతరం తీవ్రసంఘర్షణకు లోనయ్యే వారు. అలాంటి నేలలో నేడు మార్పు వస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ది బాటలో అడుగుల వేస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈ యువ రైతు ప్రేమకుమార్‌ సాగులోని వైవిధ్యాన్ని గమనించిన ఇతర రైతులు కూడా కొత్త దారిలో పయనిస్తూ సాగు బడిలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు.

(Shyammohan/MGNREGA/ Ruralmedia)

.

Share.

Leave A Reply