ఆ స్కూల్‌లో కోడిగుడ్డు వెరీ బ్యాడ్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆ స్కూల్‌లో కోడిగుడ్డు వెరీ బ్యాడ్‌
షేక్‌ అమీన్‌, హంసరాజ్‌,సాయి కిరణ్‌ హైదరాబాద్‌, ఓల్డ్‌సిటీలో మహేశ్వరి విద్యాలయలో 8వతరగతి చదువుతున్నారు. ఒక రోజు మధ్యాహ్నం లంచ్‌బాక్స్‌ ఓపెన్‌ చేసి భోజనం చేదద్దామనుకుంటున్న సమయంలో టీచర్లు అభ్యంతరం పెట్టారు. దానికి కారణం, వారి బాక్స్‌లో ఎగ్‌ కర్రీ, చికెన్‌ ఉండటమే… అప్పటి నుండీ వారు చపాతీలు మాత్రమే మధ్యాహ్న భోజనంలో తింటున్నారు.
హైదరాబాద్‌,ఛార్మినార్‌ సమీపంలో ఓల్డ్‌ ఖబుదర్‌ ఖానాలో ఉంది మహేశ్వరి విద్యాలయం. ఇక్కడ తెలంగాణ నుండే కాక, గుజరాత్‌,బెంగాల్‌,మహారాష్ట్ర నుండి వచ్చి హైదరాబాద్‌లో స్దిర పడిన కుటుంబాల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.
నిజమే, మా స్కూల్లో నాన్‌ వెజ్‌ నిషేదం
” మహేశ్వరి సేవాట్రస్టు ఆధ్వర్యంలో ఈ స్కూల్‌ నిర్వహిస్తున్నాం. పిల్లలను చేర్చుకునేటపుడే, నాన్‌వెజ్‌, లంచ్‌బాక్స్‌లో పెట్టవద్దని పేరెంట్స్‌కి ఖచ్చితంగా చెబుతాం. పిల్లల మధ్య తారతమ్యాలు ఉండ కూడదనే మా సంస్థ ఈ నియమం పెట్టుకుంది. బయటకు వెళ్లాక వారు ఏదైనా తినవచ్చు. స్కూల్‌ క్యాంపస్‌లో మాత్రం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. 1998లో ఈ స్కూల్‌ని ఏర్పాటు చేశాం.అప్పటి నుండి ఇదే పద్దతి అనుసరిస్తున్నాం. కొన్ని పత్రికలు మమ్మల్ని కలువకుండానే ఏవోవో రాశాయి. మీరొక్కరే మా స్కూల్‌కి వచ్చి వివరణ అడుగుతున్నారు. ” అని అన్నారు స్కూల్‌ కరస్పాండెంట్‌ శివకుమార్‌ భంగ్‌.
ఉల్లి,వెల్లుల్లి వద్దపి తల్లులకు చెబుతున్నారు

school-admin-mounica

school-admin-mounica

” ఈ స్కూల్‌లో మాంసాహారం నిషేదం ఒక్కటే కాదు, చాలా ఆంక్షలున్నాయి. చపాతీ, ఒక పొడి కూర మాత్రమే తెచ్చుకోవాలి,నూడుల్స్‌ వద్దంటారు. కూరల్లో ఉల్లి,వెల్లుల్లి వాడకూడదు అని పేరెంట్స్‌ నుండి మాకు ఫిర్యాదులు వచ్చాయి. వారు ముందుకు వచ్చి చెబితే పిల్లల భవిష్యత్‌ దెబ్బతింటుందని భయపడుతున్నారు. పిల్లల లంచ్‌బాక్స్‌లను టీచర్లు రోజూ చెక్‌ చేస్తుంటారు. ఇదంతా బాలల హక్కులకు భంగకరమే ‘ అని  అన్నారు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు.

bha-complaint copy

bha-complaint copy

కోడిగుడ్డు శాకాహారం అని మహాత్మాగాంధీ ఎపుడో చెప్పారు. మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారాయన.
ఈ విద్యాలయం పై విద్యాశాఖ అధికారులకు ఆచ్యుత రావు ఫిర్యాదు చేశారు.
” చాలా మంది తల్లులు బాక్స్‌ల్లో ఎక్కువ అన్నం పెట్టేసి పంపుతుంటారు. అదంతా తిన లేక పిల్లలు వదిలేస్తున్నారు. ఎనిమిది వందల మంది విద్యార్దుల్లో సగం వరకు ఇలాగే జరిగితే వృధా అయిన ఆహారాన్ని తీసిపారేయడానకి మా ఆయాలకు ఇబ్బంది కదా… అందుకే చపాతీ వంటి ఆహారం పంపమని పేరెంట్స్‌కి చెబుతున్నాం. వెల్లుల్లి వద్దని మేం చెప్పలేదు ‘ అంటారు స్కూల్‌ అడ్మిన్‌ మౌనిక.
” అనేక మతవిశ్వాసాలున్న పిల్లలందరూ ఒక చోట కూర్యొని లంచ్‌ చేస్తున్నపుడు కొందరు నాన్‌ వెజ్‌ తింటే ఇతరులకు ఇబ్బంది కదా . ఆకర్షణీయంగా కనిపించే గుడ్డును చూసినపుడు ఇతర పిల్లలకు కూడా వాటిని రుచి చూడవచ్చు. అలవాటు లేని తిండి వల్ల వారికేమైనా ఐతే ఎవరిది బాధ్యత ? అంటున్నారు స్కూల్‌ టీచర్లు అనితాయాదవ్‌, సునీత.
800విద్యార్ధులున్న ఈ స్కూల్‌లో 40 శాతం ముస్లిం విద్యార్దులున్నారు. చేపలు ఆహారంగా తీసుకునే బెంగాలీ విద్యార్దులు కూడా ఇక్కడ చదువుతున్నారు. నర్సరీ నుండి టెన్త్‌ వరకు ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఒక విద్యార్ధికి రూ.3,200నుండి రూ.5000 వరకు మాత్రమే ఫీజులు ఉండటంతో మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా వస్తుంటారు.
ఆహారం పై నిబంధనలు పెట్టుకోవచ్చా?
” పిల్లల ఆహారం పై నిబంధనలు పెట్టుకునే అవకాశం ప్రైవేట్‌ విద్యాలయాల యాజమాన్యాలకు ఉందా ?” అని ruralmedia హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది.
” పిల్లల ఆహారం పై ఆంక్షలు పెట్టే అధికారం ఏ స్కూల్‌కి లేదు.
ఎవరికి నచ్చిన ఫుడ్‌ వారు తినొచ్చు. మహేశ్వరి విద్యాలయంలో విద్యార్దులతో మాట్లాడి లంచ్‌ బాక్స్‌లు పరిశీలించాం. దీనిపై స్కూల్‌ యాజమాన్యం వివరణను రాతపూర్వకంగా ఇమ్మని కోరాం. అది అందగానే తదుపరి చర్యలు ఉంటాయి.” అని డిప్యూటీ డిఇఓ నెహ్రూబాబు చెప్పారు.
చిన్నారులకు ప్రోటీన్స్‌, విటమిన్స్‌ అవసరం
” హైదరాబాద్‌లో కొన్ని స్కూల్స్‌ నాన్‌ వెజ్‌ని తెచ్చుకోనివ్వడం లేదనేది నాకు తెలుసు.

nonvegtrns-Aman Sheik, ashis,sandeep,hansraj,saikiran

nonvegtrns-Aman Sheik, ashis,sandeep,hansraj,saikiran

వివిధ వర్గాల పిల్లలు చదివే విద్యాలయాల్లో ఆహారపు అలవాట్లను నియంత్రించడం మంచిది కాదు. ఎదిగే పిల్లలకు రోగనిరోధక శక్తినిచ్చే మైక్రో న్యూట్రీయన్స్‌ అందాలంటే, క్యాలరీస్‌,ప్రోటీన్స్‌,విటమిన్స్‌ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. దాల్‌, ఎగ్‌, చికెన్‌,రాజ్మా,చపాతీ తో పాటు అన్నిరకాల ఆకుకూరలు,కాయగూరలు,పండ్లలో అవి పుష్కలంగా ఉంటాయి.’ అని  పోషకాహార నిపుణురాలు జానకీ శ్రీనాథ్‌ చెప్పారు.
కాల్షియాన్ని గ్రహించడానికి అవసరమైన డి విటమిన్‌ , కంటి జీవకణాన్ని రక్షించే ఎ, ఇ విటమిన్‌లు జింక్‌, సెలీనియం గుడ్డులో ఉన్నాయి. గుడ్డుని తినడం వలన కండరాలు దఢంగా అవుతాయి. ఇది క్రీడాకారులుకు మంచి ఆహారం అని ఆహార నిపుణులంటున్నారు.
గుడ్డు శాకాహారమా?
ఆవు, గేదె నుండి వచ్చే పాలు జీవశాస్త్రం ప్రకారం మాంసాహారమే, కాని దానిని శాకాహారంగా భావిస్తున్నారు. అలాగే కోళ్ళ ఫారంలో పుంజులుండవు. పెట్టలైన కోళ్ళు సమగ్ర ఆహారం తిని పుంజు కలయిక లేని జీవంలేని గుడ్లు ఇస్తాయి. కాబట్టి పాల, తేనె లాగ, దీనిని కూడా శాకాహారంగా భావించవచ్చు. అంటారు అచ్యుతరావు.
దేశంలోని 15 రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు గుడ్డు స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాల్లో పిల్లల మధ్యాహ్న భోజన పథకాల్లో అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు వారానికి నాలుగు రోజులపాటు పిల్లలకు ఆహారంలో కోడి గుడ్డును సరఫరా చేస్తున్నాయి.
తెలంగాణలో కొన్ని చోట్ల మధ్యాహ్మ భోజన పథకాలను అమలు చేస్తున్న అక్షయ పాత్ర, హరేకృష్ణ ఫౌండేషన్‌ సంస్థలు గుడ్లు ఇవ్వడం లేదు. కూరల్లో ఉల్లివెల్లుల్లి కూడా వేయడం లేదని ruralmedia పరిశీలనలో తెలిసింది.
2006లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారత్‌లో 60 శాతం మంది మాంసాహారులున్నారు. సంపన్న వర్గాల్లో శాకాహారులు ఎక్కువగా ఉండగా, దళిత, నిమ్న వర్గాల్లో మాంసాహారాలు ఎక్కువగా ఉన్నారు.
….
శ్యాంమోహన్‌

Share.

Leave A Reply