జయమ్మ జీవితం పై విద్యార్థుల అధ్యయనం

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రతి సమస్యకు పరిష్కారం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ ప్రతి పరిష్కారం వెనుకా ఓ పోరాటం మాత్రం ఉండి తీరుతుంది. దీనిని ఫోకస్‌ చేయడమే మా లక్ష్యం, అందుకే రూరల్‌మీడియా ను వేదికగా చేసుకున్నాం.
ఇక్కడన్నీ, బతుకు మీద మమకారాన్ని పెంచే కథనాలు.
భవిష్యత్‌ పట్ల ఆశను పెంచే శుభ సంకేతాలు .
మనిషి మారిపోలేదనడానికి,మానవత్వం కనుమరుగై పోలేదని చెప్పడానికి గుండెల్లోని తడింకా ఇంకిపోలేదని రుజువు చేయడానికి ఎన్నో వార్తా కథనాలు పాఠకులకు అందిస్తున్నాం..
కర్షకులు,కార్మికులు,గిరిజనులు, పురజనులు,మానవత్వమున్న మహానుభావులు, ఎవరైనా సరే , ఈ సమాజ ప్రగతిలో,అభివ ద్దిలొ,ఉత్పత్తిలో భాగస్వాములైతే వారి విజయాలను లోకానికి చాటుతాం…
విద్యార్థులకు కేస్‌ స్డడీగా…
ఈ నేపథ్యంలో  ఆదివాసీ రైతమ్మ బొగ్గం జయమ్మ బతుకు పోరాటంలో సాధించిన విజయాన్ని మేం డాక్యుమెంట్‌ చేసినపుడు

National Council of Rural Institutes  ఛైర్మన్‌ ప్రసన్న కుమార్‌ గారు ఆమె విజయగాథను తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులకు కేస్‌స్టడీగా ఎంపిక చేశారు. బీడు నేలను సస్య శ్యామలం చేసిన అమె శ్రమ చైతన్యాన్ని విద్యార్థులు స్టడీ చేయడం వల్ల గ్రామీణాభివృద్ధిని అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం
జయమ్మ విజయ గాథ Women development and child welfare departmentను కదిలించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8.3.2018ప ఆమెకు ఉత్తమ మహిళా రైతుగా అవార్డు ఇచ్చి రూ.1లక్ష నగదు పురస్కారం ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి రూరల్‌మీడియాకు తెలియ చేశారు.
జయమ్మ బతుకు చిత్రం …
కేవలం రెండెకరాలున్న ఆదివాసీ రైతుకూలీ బొగ్గం జయమ్మ (రాజాపురం, ముల్కలపల్లి మండలం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా). ఆ భూమి సేద్యానికి అనువుగా లేని ఎగుడు దిగుడు వర్రెలు, వంకలు, ముళ్ల చెట్లతో నిండి పోయింది. దీనికి తోడు ఆ ప్రాంతంలో వర్షాధారం మీద మాత్రమే సాగు చేయాలి. అలాంటి కరవు నేలను చదును చేసుకునే స్తోమత లేని ఈ పేద దంపతులు ఉపాధి హామీ కూలీ పనుల మీద ఆధార పడి బతికేవారు .ఆ పని కూడా కేవలం వందరోజులే .
ఇలాంటి పరిస్థితిల్లో ఎలాగైనా తమ బంజరు భూమిని సాగులోకి తెచ్చే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ , జయమ్మ భర్త నర్సింహారావుతో కలిసి గ్రామ సభలో తన సమస్యను చెప్పుకున్నారు . అది తీర్మానంగా మారి జిల్లా పాలనాధికారికి చేరింది. పటిష్ట భాగస్వామ్య ప్రణాళిక ప్రక్రియ (ఐపీపీఈ-1)లో భాగంగా ఈ రైతు భూమిని అభివృద్ధి చేసుకోవడానికి 2015 ఏప్రిల్‌లో డ్వామా ద్వారా ఉపాధిహామీ పథకంలో నిధులు మంజూరు కాగా రెండెకరాల భూమిని ఆమె కుటుంబం,ఉపాధి కూలీలతో కలిసి చదును చేశారు. ఎత్తు, పల్లాలుగా ఉన్న మట్టి దిబ్బలను తవ్వి ఎగువ ప్రాంతంలోని మట్టిని దిగువ ప్రాంతంలో వేయడం ద్వారా భూమిని సాగుకు అనువుగా మార్చారు.
జయమ్మ దంపతులు రాత్రిపగలు కష్టించి, భూమిని అభివృద్ధి చేసి, సాగునీటికోసం తన భూమిలోనే చిన్ననీటి కుంటను తవ్వుకుని వాననీటిని నిలువ చేసి, భూమిలో తేమను పెంచారు. అరఎకరాలో వరి పండించి సుమారు 15 బస్తాల దిగుబడి సాధించారు. మిగిలిన ఒకటిన్నరెకరాల్లో జామాయిల్‌ తోటను పెంచుతున్నారు.
గతంలో కేవలం దినసరికూలీగా బతికిన ఈ దంపతులు పట్టుదలతో కష్టించి తమ బీడుభూమిని సాగు భూమిగా మార్చుకుని రైతులుగా మారారు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ సుస్థిర ఆదాయం పొందుతున్నారు.
జయమ్మ శ్రమ ఫలితాలివి…
1, తమ సమస్యలు గ్రామసభలో పెట్టి, వివిధ ప్రభుత్వ విభాగాల సహకారంతో ఉపాధిహామీ పథకం ద్వారా ఆదివాసీ రైతులకు భూమి అభివృద్ది కార్యక్రమాలకు సాయం అందడంతో వీరు ఆదర్శ రైతులుగా మారారు ” అంటారు సర్పంచ్‌ పత్తిలాల్‌ .
2, గతంలో ఈ కుటుంబం కూలీ పనుల మీదనే ఆదారపడి బతికే వారు. ఒక్కొ సారి అదికూడా దొరక్క వలస పోవాలనుకున్నపుడు, బంజరు నేలను అభివృద్ది చేసుకునే అవకాశం కలిగింది. ఉత్పాదకత పెరిగి సుస్థిర ఆదాయం పొందుతున్నారు.
3, వీరు సాధించిన ప్రగతి చూసి మిగతా రైతులు తమ భూములను అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Shyammohan/9440595858

Share.

Leave A Reply