పొలం ముందే బ్యాంకు సేవలు

Google+ Pinterest LinkedIn Tumblr +

” మల్లవ్వా పొలం కాడికి అస్తున్నవా?”
”ఆఉ! జర్రాగు.. కిసాన్‌ క్రెడిట్‌ కారట్‌ వెతుకుతున్న… లచ్చుమవ్వ రాని!!”
”నేనైతే పోతబిడ్డా… ఏటీఏం బండి వచ్చిందట,పైసలు తీస్కోవాలె, విత్తులు కొనాలె,బాంకిల కిస్తి కట్టొచ్చి పని చేస్కోవాలె.. ”
తొలకరి మొదలైంది…దుక్కి దున్నాలి,విత్తనాలు కొనాలి. బ్యాంకులో పైసలున్నాయి కానీ, తీసుకోవాలంటే పది కిలోమీటర్ల దూరం పోవాలి. ఒక పూట పని పోద్ది, ఎట్లరా దేవుడా… అని దిగాలు పడుతున్న ఈ రైతుల పొలాల ముందు ఒక మొబైల్‌ ఏటీఎం ప్రత్యక్షమవుతుంది. కథగా కల్పనగా కనిపించే వాస్తవ గ్రామీణ ఆర్ధిక చిత్రం ఇది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం,రామనగరంలో రైతుల ముంగిటకు ఏటీఎం సేవలు మొదలయ్యాయి.
బ్యాంకులంటే భయం

తమ పొలం ముందు ఆగిన ఏటీఎం వ్యాన్‌లో డబ్బులు తీసుకుంటున్న రామనగరం రైతు.

తమ పొలం ముందు ఆగిన ఏటీఎం వ్యాన్‌లో డబ్బులు తీసుకుంటున్న రామనగరం రైతు.

బ్యాంకింగ్‌ రంగ సేవల్లో ఇటీవల పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఎటీఎంలు, ప్రజల చేతుల్లో క్రిడెట్‌, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌… ఇలా ఎన్నెన్నో సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, భారతదేశంలో 41 శాతం మందికి బ్యాంకుల సేవలు అందుబాటులో లేవు. 39 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారికి, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 60శాతం మందికి బ్యాంకుల సేవలు అందటం లేదు. పల్లె ప్రజల పట్ల అమర్యాదపూర్వకంగా, బాధ్యతా రాహిత్యంతో అధికారులు ప్రవర్తించటం ఒక సమస్య కాగా, ఖాతా ఓపెన్‌ చేయడానికి అనేక నిబంధనలు, డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలు అందుబాటులో ఉండక పోవడం,ఉన్నా వాటిల్లో క్యాష్‌ లేకపోవడం వంటి కారణాలవల్ల ప్రజలు బ్యాంకులంటే భయపడుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులను ప్రజలకు చేరువ చేయడానికి, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగంగా ఇ లావేదేవీలు, ఎటీఎం కార్డుల వినియోగం, రుణాలు పొందడం, ఫిక్సిడ్‌ డిపాజిట్‌లు వంటి భిన్న అంశాలపై గ్రామీణ ప్రజలకు చైతన్యం కల్పిస్తారు. గహ వినియోగ బడ్జెట్‌ రూపొందించుకోవడం, ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేయడం, పొదుపు ఖాతాల్లో లావాదేవీలను ప్రోత్సహించడం లాంటివి ప్రజలకు అలవాటు చేసేలా, పల్లెల్లో జిల్లా సహకార బ్యాంకు సిబ్బంది సమావేశాలు నిర్వహిస్తారు.

రామనగరం గ్రామానికి వచ్చిన ఏటీఎం వ్యాను దగ్గర కిసాన్‌క్రిడెట్‌ కార్డులతో మహిళలు.

రామనగరం గ్రామానికి వచ్చిన ఏటీఎం వ్యాను దగ్గర కిసాన్‌క్రిడెట్‌ కార్డులతో మహిళలు.

మొబైల్‌ ఏటీఎంలు అంటే?
తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలన్ని బ్యాంకులకు అనుసంధానం చేయడంతో నేటి పరిస్థితుల్లో బ్యాంకుల ప్రాధాన్యత పెరిగింది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు సేవలు విస్త్రతం చేయడానికి జిల్లాసహకార బ్యాంకులు నాబార్ట్‌ సహకారంతో
ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లో (మహబూబ్‌నగర్‌ తప్ప) ఒక్కొక్క ఎటీఎం వ్యాన్‌ను సమకూర్చుకున్నాయి. ఎక్కడో మండల కేంద్రంలో ఉన్న బ్యాంకు వద్దకు వెళ్ల లేనివారికి ఈ మొబైల్‌ ఏటీఎంలు సేవలు అందిస్తున్నాయి.
బయోమెట్రిక్‌ విధానంతో
మొబైల్‌ బ్యాంకులకు తోడు, డీసీసీబీ బ్యాంకు శాఖల ఆధ్వర్యంలో రైతు సంఘాలకు ఒక బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఇచ్చారు. ఈ యంత్రంతో ఖాతాదారుడు నగదు డ్రా చేయడం, నగదు వేయడంగాని చేసుకునే అవకశం కల్పించారు. డబ్బులు తీసుకునే ఖాతాదారులు తమ కిసాన్‌ క్రెటిట్‌ కార్డును బయోమెట్రిక్‌ మిషన్‌కు అనుసంధానం చేసిన అనంతరం ఖాతాదారుడి వేలిముద్రలను తీసుకుంటారు. దీంతో వారికి కావాల్సిన నగదు తీసుకునే అవకాశం ఉంది.
ఈ సేవలు నడవలేని వద్ధులు, దివ్యాంగులకు ఆసరాగా ఉంది. కదల లేని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మొబైల్‌ ఏటీఎంలు ఇంటింటికీ వెళ్లి వారికి సేవలందిస్తున్నారు.
ప్రజలకు చేరువలో
‘ గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి డిసీసీబీ బ్యాంకులు గ్రామాల్లో మొబైల్‌ ఏటీఎంలను నడుపుతున్నారు. ఒక్కొక్క వాహనం కోసం నాబార్డు రూ.15లక్షలు గ్రాంట్‌ మంజూరు చేసింది. ఏటీఎం యంత్రాలు,సిబ్బంది నిర్వహణ డీసీసీబీ లే చూసుకుంటాయి. ప్రజలు సమయాన్ని వథా చేసుకోకుండా నిరంతరం వారికి అందుబాటులో ఈ వాహనాలు పని చేస్తున్నాయి. ప్రజలకు బ్యాంకుల సేవల గురించి తెలిపి, ఆర్థిక అక్షరాస్యతను పెంచుతున్నాం ‘ అని ఖమ్మం జిల్లా నాబార్డు అధికారి రావు అన్నారు.
ఖమ్మం జిల్లాలో బ్యాంకు సౌకర్యం లేని మారు మూల పల్లెలకు ఏటీఎం వ్యాను రపంపుతున్నారు. 1,80,000 కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదారులు ఈ సేవలు వినియోగించుకుంటున్నారు. అని ఖమ్మంలోని డిసిసిబీ అధికారులు చెప్పారు.
అప్పుల పాలవ్వడం తప్పింది

sarpanc-ramanagaram

sarpanc-ramanagaram

” మా ఊర్లో ఏటీఎంలు లేవు. డబ్బులు అవసరమైనపుడు సత్తుపల్లి పోవాల్సి వచ్చేది. అంత దూరం పోయే ఓపిక లేక కొందరు వడ్డీకి అప్పు చేసేవారు. బ్యాంకులో డబ్బులున్నా మాకు ఇలాంటి పరిస్ధితి దాపురించేది. ఇపుడు ఏటీఎంలు మా ఇంటి ముందుకే వస్తున్నాయి. అవసరమైన వారు కార్డు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు.”
…. వేల్పుల కళావతి, సర్పంచ్‌, రామనగరం
ఒక పూట పని నష్టం అయేది
‘ ఇపుడు సాగు సీజన్‌. విత్తనాలకు,దుక్కిదున్నడానికి కూలీలకు డబ్బులివ్వడానికి డబ్బు అవససరం. దీని కోసం పక్క ఊరికి పోవాలంటే ఒక పూట పని మానుకోవాలి. ఇపుడా నష్టం లేకుండా మా పొలం దగ్గరకే ఏటీఎం వ్యాన్‌ వస్తున్నది. సమయం, డబ్బు వృధాకాకుండా అయింది.’ అంటోంది రామనగరం గ్రామస్తురాలు జూపూడి మమత.
………………………………….
శ్యాంమోహన్‌./ruralmedia/nirmaan

Share.

Leave A Reply