‘‘మీలాంటి వారిని పిలిచే స్థాయి, వనరులు నాకు లేవు సార్!’’

Google+ Pinterest LinkedIn Tumblr +

మన రాజకీయ నాయకులు ప్రజల డబ్బుతో ఆడంబరాలకు పోయినప్పు డల్లా భారతదేశంలో రెండవ పెద్ద రాష్ట్రం బిహార్‌కు రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ గుర్తుకొస్తారు. గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన అధికారిక గృహ సముదాయ ప్రవేశం చేసినప్పటి దృశ్యాలు టీవీలలో చూసినప్పుడు, వార్తాపత్రికలలో ఆ వార్తలు చదివినప్పుడు కర్పూరీ ఠాకూర్ మరొక్కసారి గుర్తుకొచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు కర్పూరీ ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని పితుంజియా. ఒక పేద క్షురకుల కుటుంబంలో జన్మించిన కర్పూరీ మొట్టమొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి. ఆయన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఆందోళనలో భాగస్వామి కూడా.

karpoori-thakur-india-stamp-1991

karpoori-thakur-india-stamp-1991

ప్రస్తుత క్రియాశీల రాజకీయ నాయకులు లాలూప్రసాద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్, బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వంటి పలువురు కర్పూరీ ఠాకూర్ శిష్యులే. బిహార్ ప్రజలు ఆయనను ‘జన నాయక్’ అని పిలుచుకునేవారు. కర్పూరీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన కుటుంబం స్వగ్రామంలోనే ఉండేది. భార్యాపిల్లలు, తండ్రి, తమ్ముడు అందరూ. ఆయన పూర్వీకుల ఆస్తి నాలుగు గుడిసెలు. ఒక ప్రముఖ పత్రికా విలేకరి ముఖ్యమంత్రి గ్రామానికి వెళ్లి ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్‌ను పలకరించినప్పుడు ‘‘కొడుకు ముఖ్యమంత్రి కదా! మీరేమిటి ఇలా?’’ అని అడిగితే ‘‘అయితే ఏమిటి’’ అని జవాబిచ్చాడట గోకుల్. ఆ విలేకరి రాష్ట్ర రాజధాని పట్నా తిరిగొచ్చి ముఖ్యమంత్రిని కలసి, ‘ఏమిటి? మీ కుటుంబం అలా పల్లెలో, పేదరికంలో?’’ అని అడిగితే ‘‘నేను అంత తెలివి గలవాడిని కాదేమో’’ అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చారట.

ఒక రోజు కర్పూరీ ఠాకూర్ అప్పటి బిహార్ గవర్నర్‌ను కలసి ప్రభుత్వ వ్యవహారాలు ఏవో చర్చించి వెళ్లిపోయారు. మరునాడు పత్రికల్లో ముఖ్యమంత్రి కుమారుడి వివాహం జరిగిన వార్త చూసిన గవర్నర్ ఆయనకు ఫోన్ చేసి, ‘‘ఇదేమిటి నన్ను పిలవలేదు మీ ఇంట పెళ్ళికి?’’ అని అడిగితే ‘‘మీలాంటి వారిని పిలిచే స్థాయి, వనరులు నాకు లేవు సార్!’’ అని వినమ్రంగా జవాబిచ్చారట. ఈ రోజుల్లో ఇటువంటివి కనీసం ఊహించగలమా? పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల కుటుంబాలు పేదరికంలోనే ఉండిపోవాలని కాదు, ఈ ఉదాహరణ కర్పూరీ నిరాడంబరత్వాన్ని గుర్తు చెయ్యడానికి మాత్రమే.

– దేవులపల్లి అమర్

Share.

Leave A Reply