మూడేళ్ల సమస్య… మూడు రోజుల్లో…

Kisan Mitra Helpline for Telangana Farmers

మూడేళ్ల సమస్య… మూడు రోజుల్లో…
మల్లప్ప తన బంజరు భూమిని సాగులోకి తేవాలనుకున్నాడు . బోరులో జలాలు అడుగంటాయి.
చుక్కల సేద్యంతో నాలుగు గింజలు పండించుకొని బతకాలనుకున్నాడు. ‘డ్రిప్‌’ కోసం వికారాబాద్‌ వ్యవసాయ శాఖ అధికారులను కలిస్తే, డ్రిప్‌కి సబ్సిడీ ఇవ్వాలంటే పొలం వివరాలు కావాలన్నారు.
అక్కడ మొదలైంది అసలు కత.
పెద్దెముల్‌ మండల్‌, బండమీది పల్లెకు చెందిన మల్లప్ప రెండెకరాల పొలం చనిపోయిన తండ్రి పేరున ఉంది. కాగితాల్లో తండ్రి పేరు తప్పుగా ఉంది.దానిని మార్చి మల్లప్ప పేర రిజస్టర్‌ అయితేనే డ్రిప్‌ పైపులు ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు.దీని కోసం మల్లప్ప మండల ఆఫీసు చుట్టూ తిరడం మొదలు పెట్టాడు. ఎమ్మార్వోలు మారుతున్నారు కానీ,మల్లప్ప భూమి సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు.
చుక్కల సేద్యం చేయాలనుకున్న ఆ పేద రైతుకు చుక్కలు చూపించారు అధికారులు.
అతడికి ఇద్దరు కూతుర్లు.సాధ్విక మానసిక వికలాంగురాలు, స్వాతి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. వైద్యం కోసం పొలం మీద అప్పు తెచ్చుకుందామంటే భూమి సమస్య ఇంకా తీరలేదు.
బిడ్డకు జబ్బు నయం చేయించలేని నిస్సహాయత…
డ్రిప్‌ లేక సాగు బడి ఆగింది…
తల్లి,భార్యబిడ్డలను పోషించ డానికి ఉపాధి లేదు…
భవిష్యత్‌ అంతా అంధకారంగా ఉంది..
మల్లప్ప తల్లడిల్లిపోయాడు.
ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని పురుగుల మందు తెచ్చుకున్నాడు.
మల్లప్ప పరిస్థితిని గమనించిన గ్రామస్తులు ‘ కిసాన్‌మిత్ర ‘హెల్ప్‌ లైన్‌కి ఫోన్‌ చేయమని సలహా ఇచ్చారు.
ఆఖరి ప్రయత్నంగా టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-120-3244 కి ఫోన్‌ చేసాడు మల్లప్ప.
అరగంటలో కిసాన్‌మిత్ర కార్యకర్త సంగమేశ్వర్‌ ఆ ఇంటి ముందున్నాడు.
మల్లప్ప కష్టాలన్నీ విని, సమస్యలకు చావు పరిష్కారం కాదని,పోరాడి సాధించాలని ధైర్యం చెప్పాడు. సమస్యను అధికారుల ముందుంచాడు సంగమేశ్వర్‌.
రెండో రోజు ఎమ్మార్వో తులసీరాం,వీఆర్వో శేఖర్‌… బండమీది పల్లె లో మల్లప్ప ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు.
ఇదంతా కలో నిజమో అర్థం చేసుకునే లోపే, మల్లప్ప కుటుంబాన్ని కారులోనే ఎమ్మార్వో ఆఫీసుకు తీసుకెళ్లి భోజనం పెట్టించి, పట్టాదారు పాసు పుస్తకం వారి చేతిలో పెట్టారు.

manemma-with-pattadaarpassbook

manemma-with-pattadaarpassbook

మూడేళ్లుగా తిరిగినా తీరని మల్లప్ప సమస్య కేవలం మూడు రోజుల్లో పరిష్కారం అయింది.
దటీజ్‌ కిసాన్‌ మిత్ర.
ఆ కుటుంబం ఇపుడు బిడ్డకు వైద్యం చేయించారు. డ్రిప్‌తో చెరకు పంట సాగు చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు.
” బతుకు మీద విరక్తి కలిగిన నా బిడ్డకు భవిష్యత్‌ పట్ల మమకారం కలిగించిన వికారాబాద్‌ కలెక్టర్‌ దివ్యమ్మకు జీవితాంతం రుణపడి ఉంటాం,కిసాన్‌ మిత్ర కార్యకర్తలకు ధన్యవాదాలు…” అంటూ చందమామ వోలె నవ్వింది మల్లప్ప తల్లి మణెమ్మ.
……
రైతన్నలకు భరోసా ‘ కిసాన్‌ మిత్ర ‘
తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో రైతుల కుటుంబాల్లో తీవ్రసంక్షోభం ఉంది.పంటల ఉత్పత్తి ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవడం, నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం,సబ్సిడీలు అందక పోవడం, భూమి సమస్యలు, అప్పుల వల్ల రైతులు తీవ్ర వత్తిడికి లోనవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు భరోసా నిచ్చే వినూత్న కార్యక్రమం ‘కిసాన్‌ మిత్ర’.వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ చొరవతో రైతన్నలకు ఆసరాగా’కిసాన్‌మిత్ర’ హెల్ప్‌లైన్‌ని ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఆధ్వర్యంలో 14.4.2017న ప్రారంభించారు.
టోల్‌ ఫ్రీ నెంబర్‌(1800.-120-3244) కి గ్రామస్తులు ఏ నెట్‌ వర్క్‌ నుంచైనా ఉచితంగా ఫోన్‌ చేసి తమ సమస్యలను వివరించవచ్చు. హెల్ప్‌లైన్‌ కార్యాలయంలో ఆ సమస్య రికార్డు అవుతుంది.అంతే కాకుండా ఆసమస్యను సంబంధిత మండల అధికారికి పంపిస్తారు. వారు రైతుతో మాట్లాడి పరిష్కారం చేస్తారు.

kisanmitra- poster

kisanmitra- poster

ఈ కిసాన్‌ మిత్ర ప్రాజెక్టులో రైతు స్వరాజ్యవేదిక వాలంటీర్లు స్వచ్ఛందంగా పని చేస్తారు. ఇప్పటి వరకు 1732 సమస్యలు రికార్డ్ కాగా, 398 మంది రైతుల సమస్యలను పరిష్కరించి వారిలో ఆత్మవిశ్వాసం కలిగించారు.

రైతులకు కొండంత అండగా ఉన్న ‘కిసాన్‌ మిత్ర’ను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని పలువురు రైతులు రూరల్‌మీడియా తో అంటున్నారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *