సింహా ‘జలం’
………….
ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టి, భవిష్యత్‌లో నీటి ఎద్దడి జాడ లేకుండా చేసేందుకు విశాఖలోని సింహాచల దేవస్థానం అధికారులు కొండమీద కురిసిన వాన చినుకులను అక్కడే ఇంకేలా వినూత్న ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇంజక్షన్ వెల్స్ నిర్మాణం, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులను అవలంభిస్తూ, భూగర్భ జలమట్టాలను పెంచి, సేంద్రీయ సాగు చేస్తూ అటు ఆధ్యాత్మికానికి ఇటు పర్యావరణానికి తోడ్పడుతున్నారు.
ఈ జల సంరక్షణ వెనుక సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త, అశోక్‌గజపతిరాజు ప్రత్యేక చొరవ అడుగడుగునా కనిపిస్తుంది. కొండలన్నీ పచ్చదనంతో నిండి, పూర్తి తేమను కలిగి ఉండాలని ఆయన ఆధికారులను ఆదేశించడంతో, విశాఖ జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల అంతరించి పోతున్న భూగర్భ జలాలు మళ్లీ జీవం పోసుకునేలా అధికారులు నీటి లభ్యతను పెంచే ప్రణాళికలను అమలుచేస్తున్నారు.
సింహాచలం కొండ విస్తీర్ణం 5,400 ఎకరాలు. గతంలో ఇక్కడ కురిసిన వాన ఒక్క చుక్క కూడా ఇంక కుండా వృధాగా కిందికి పోయేది. ఆ నీటిని నిలవరించడానికి ఇంజక్షన్ వెల్ పద్ధతిని అనుసరించారు.
ఇంజక్షన్ వెల్ నిర్మాణం ఇలా..
ఇరవై అడుగుల గొయ్యి తీసి, అందులో 200 అడుగుల బోరుబావి తవ్వుతారు. అందులోకి రంధ్రాలున్న పైపులు దించి చుట్టూ వరలు అమర్చుతారు.
ఈ బోరుబావి గొయ్యికి పది అడుగుల దూరంలో మరో ఐదు అడుగుల గొయ్యి తీస్తారు. ఈ రెండు గొయ్యిలను అనుసంధానం చేస్తారు. బోరుబావిని మొత్తం ఐదు పొరలుగా విభజించి కంకర, బొగ్గు, కార్బన్, చిన్న కంకర, ఇసుక, ఫిల్టర్ బెడ్‌తో నింపుతారు. బోరుబావిలోకి వెళ్లే రంధ్రాల గొట్టానికి చివరన వీ వైర్ స్క్రీన్ అనే పరికరాన్ని అమర్చుతారు. సింహాచలం కొండమీద వర్షం నీరు అధికంగా ప్రవహించే ప్రదేశాలను గుర్తించి, అక్కడ వథాగా పోతున్న నీటిని చిన్న గొయ్యికి అనుసంధానం చేస్తారు. అందులో చెత్తాచెదారాలు ఫిల్టర్ అయి, నీరు బోరు బావిలోకి చేరుతుంది. అందులో ఉండే ఐదు పొరల్లో నీరు మరింత శుద్ధి అవుతుంది. దీని ద్వారా కొండ మీద వథాగా పోయే లక్షలాది లీటర్ల వాన నీటిని తిరిగి భూమిలోకి పంపవచ్చు.
బిల్డింగ్‌ల మీద కురిసిన వాన కూడా…
దేవస్థానం పరిధిలో పెద్ద భవనాలు అనేకం ఉన్నాయి. వాటిపై పడుతున్న వర్షపు నీరు కూడా వథాగా పోకుండా, ఆ నీటిని ఒడిసి పట్టేందుకు రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ విధానాన్ని దేవస్థానం అధికారులు చేపట్టారు. కొండపై అన్నదాన భవనం, గజపతి సత్రం, పీఏసీఎస్ భవనాల మీద పడే వర్షపు నీటిని, పైపులైన్ల ద్వారా సమీపంలోని బోరుబావిలోకి పంపుతారు.
దానివల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలు సమద్ధిగా ఉంటాయి.
పుష్కలంగా నీరు… సేంద్రీయ సాగు
ఇలా జలసంరక్షణ పనులు చేపట్టడం వల్ల వేసవిలో కూడా భూగర్భ జలమట్టం తగ్గడం లేదు. దీంతో కొండ దిగువన వంద ఎకరాల్లో సేంద్రీయ సాగు చేస్తూ కూరగాయలు,పూలు,పండ్లు పండిస్తున్నారు. ప్రతీ రోజు భక్తుల కోసం నిర్వహించే అన్నదానం కోసం ఈ ఆర్గానిక్ కూరగాయలతోనే వంటకాలు చేస్తున్నారు.
అరకిలో పిడకలు అరవై రూపాయలు
కొందరు భక్తులు గోవులను దానం ఇస్తుంటారు. అలాంటి 200 దేశవాళీ గోవులను కొండ దిగువన నసింహవనంలో గోశాలలో సంరక్షిస్తున్నారు. ఇక్కడే గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు. దేశవాళీ గోవు పేడతో పిడకలు, ప్రమిదలు, పిడకలు కాల్చగా వచ్చే కచ్చిక ను అమ్ముతూ పర్యావరణ హితానికి తోడ్పడుతున్నారు. రోజుకు 600 పిడకలు,400 ప్రమిదలు ఇక్కడ తయారవుతున్నాయి.
సహజ ఎరువులు
గోశాలలోని పశు వ్యర్ధాలతో వర్మీకంపోస్ట్ యూనిట్‌ని నిర్వహిస్తున్నారు. కూరగాయల వ్యర్ధాలను ఎరువుగా మార్చే బయో డైజెస్టర్ యంత్రాన్ని కూడా సమకూర్చుకొన్నారు. ఈ ఎరువుల వాడకం వల్ల కూరగాయల దిగుబడి రెండింతలు పెరిగిందని తోటలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు అంటున్నారు.
కోటి లీటర్ల నీటిని ఒడిసి పడుతున్నారు
” నీటి లభ్యత తక్కువగా వున్న ప్రదేశాల్లో అతి తక్కువ ఖర్చుతో ఈ వెల్స్ ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో కోటి లీటర్లకు పైగా వాన నీరు ఇంకుతుంది. అది
కూడా భూమిలో కాబట్టి ఆవిరి అయ్యే అవకాశం ఉండదు. జల సంరక్షణ వల్ల కొండ కింద కూరగాయలు పండించడమే కాక, నిత్యం దేవాలయాన్ని సందర్శించే పదివేల మంది భక్తుల నీటి అవసరాలు తీరుస్తున్నాం. గోసంరక్షణ కోసం గోశాలను నిర్వహిస్తున్నాం.
గోవు పేడతో పిడకలు, ప్రమిదలు తయారు చేసి లాభాపేక్ష లేకుండా భక్తులకు అందిస్తున్నాం. కొన్ని పండుగల సందర్భంలో ప్రమిదల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు. పేడతో చేసిన ఈ ప్రమిదల్లోని దీపాలు అరిన తరువాత నీటిలో కరిగి మట్టిలో కలిసి పోతాయి, తద్వారా భూసారం పెరుగుతుంది.నదీ జలాలు శుద్ది అవుతాయి.” అని సింహాచలం దేవస్ధానం ఇవో రామచంద్రమోహన్ వివరించారు.
భవిష్యత్ అవసరాల కోసం
” ప్రస్తుతానికి ఇక్కడ నీటి కొరత లేదు, అలాగని ఉన్న నీరంతా తోడేస్తుంటే జలమట్టాలు పడిపోయే ప్రమాదం తప్పదని పర్యావరణ వేత్తల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని , ఆంధ్ర ప్రదేశ్ లోనే తొలిసారిగా, వాననీటి సంరక్షణకు ఇంజక్షన్ వెల్ పద్ధతిని అనుసరించాం. సింహగిరిపై రెండు,నసింహవనంలో రెండు బావులను నిర్మించాం.వీటి నిర్మాణం తేలిక, ఖర్చు కూడా బాగా కలిసి వస్తుంది. వీటి వల్ల భవిష్యత్‌లో నీటి కొరత ఉండదు.” అని దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. మల్లేశ్వరరావు అంటున్నారు.
జలసంరక్షణ కోసం దేవస్థానం చేపడుతున్న ఈ కార్యక్రమాల పై ఇతర రాష్ట్రాల పరిశీలకులు ఆధ్యయనం చేస్తున్నారు.జర్మనీకి చెందిన జీఏఎస్ సంస్థ ప్రతినిధులు, రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులు దేవస్థానాన్ని సందర్శించి ,బావులను పరిశీలిస్తున్నారు.
- Shyammohan
- ( This article is presented under RuralMedia-Nirmaan partnership )