పంట నష్టం, రాకపోకలకు అంతరాయం…

Google+ Pinterest LinkedIn Tumblr +

పంట నష్టం, రాకపోకలకు అంతరాయం…
(ఆదిలాబాద్‌ జిల్లా నుండి రూరల్‌మీడియా టీం)
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. బంగారుగూడ, తంతోలి దిగువ వంతెనలపై నుంచి వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలతో ఇంకా చాలా గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలోనే అవస్థలు పడుతున్నారు. మండలంలోని గిరిజన గ్రామాలు ఇంకా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
పరామర్శించిన జిల్లా కలెక్టర్‌ దివ్య
గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురవడంతో పంటలకు నష్టం వాటిల్లింది, రైతులు అధైర్య పడవద్దన్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని కలెక్టర్‌ దివ్య భరోసా ఇచ్చారు.
గుడిహత్నూర్‌ మండలంలోని మన్నూర్‌ పంచాయతీలోని ఎస్సీకాలనీ వరద బాధిత కుటుంబాలను సోమవారం జిల్లా కలెక్టర్‌ దివ్య పరామర్శించి, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కాలనీలో సరైన మురుగు కాల్వలు లేకపోవడంతో , జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామంలో సర్వీసు రహదారులు, అండర్‌పాస్‌ వంతెనలు సక్రమంగా నిర్మించకపోవడంతో వరద నీరు గ్రామంలో వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. గ్రామంలో అపరిశుభ్రత నెలకొనకుండా వెంటనే చర్యలు చేపట్టాలని మండల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
40 శాతం పంటనష్టం
‘ ఈ సారి వానలకు జిల్లాలో రైతులందరికీ 40 శాతం పైగా పంట నష్టం జరిగింది. మాకున్న 30 ఎకరాలో సోయ,పత్తి,జొన్న వేశాం. చాలా వరకు పంటనష్టం జరిగింది. అరకిలోమీటరు దూరం ఉన్న చంద్రపూర్‌ బ్రిడ్జి దెబ్బతిన్నది.’ అని ఆదిలాబాద్‌ రైతు సతీష్‌కుమార్‌ దేశ్‌పాండే రూరల్‌మీడియాకు చెప్పారు.

బోథ్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పత్తి, సోయా పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పంటలు చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు నేల పాలు చేశాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు వేడుకున్నారు. భారీ వర్షాలకు నక్కల్‌వాడ గ్రామం వద్ద వంతెన పై నుంచి కరత్‌వాడ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ పారుతుండడంతో కొత్తపల్లె, నక్కల్‌వాడ, రేండ్లపల్లె, లక్ష్మిపూర్‌ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Share.

Leave A Reply