నమో సింగపూరాయా … నమో షాంఘై…

From Singapore to Andhra …

నమో సింగపూరాయా … నమో షాంఘై

నాచబానా(చంద్రబాబు) గారు, ఆ తరువాత యజమోరె(జగన్) గారు సింగపూర్ భజన చేసారు. ఇక కచశేరా(కెసిఆర్) గారు మొదలు పెడతారని మొన్ననే ముఖపుస్తకంలో భయపడుతూ మీతో షేర్ చేసాను. మొదలైంది చూడండి.

 1. సింగపూర్ హైదరాబాద్ లో సగం కూడా లేని(55 లక్షల జనాభా) ఒక నగర దేశం. విస్తీర్ణం 687 చ।కిమీ మాత్రమే (హెచ్.యండిఎ విస్తీర్ణం 7257 చకిమి). సింగపూర్ లో 33లక్షలమంది మాత్రమే పూర్తి పౌరులు కాగా 20 లక్షలమంది పైగా పర్మనెంట్ సిటిజన్ హోదా ఉన్నవారు, మిగిలిన వారు వ్యాపారార్థం, చదువుకోసం వచ్చిన ఇతరులు. జనాభాలో బౌద్దులు 34%, క్రిస్టియన్లు 18%, ఏ మతానికి చెందనివారిగా ప్రకటించినవారు 16%, ముస్లింలు 14%, తావోయిస్టులు 10%, హిందువులు 5% ఉంటారు. తమిళ భాష అక్కడి అధికార భాషలలో ఒకటి. తమిళులు ఆ దేశాధ్యక్షులుగా కూడా చేసారు, మంత్రులుగా పనిచేస్తున్నారు. ఒకనాటి శ్రీవిజయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కాలనీగా ఉన్నా అనేక ఉద్యమాలలో కొట్టుమిట్టాడింది. 1953లో స్వతంత్రం ప్రకటించుకున్నా తరువాత మలేషియాతో కలసి ఫెడరేషన్ గా ఉండి తరువాత విడిపోయి 9-8-1965 నుంచి స్వతంత్రంగా మనగలుగుతుంది. ప్రస్తుతం జనాభా, అధికారంలో చైనీయులదే అగ్రభాగం. నేను అక్కడికి అనేక సార్లు వెళ్లడం జరిగింది. ఇంకా ముఖపుస్తక మితృలకే నాకంటే అనేక విషయాలు తెలుస్తాయి. కొన్ని విషయాలు మాత్రం ఒకసారి పరికిద్దాం
 1. అక్కడ జిడిపిలో ప్రాథమిక రంగం సమకూర్చేది 0% కాగా సర్వీసెస్ 74, పారిశ్రామిక రంగం 26%. మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మీద నేటికీ ఆధారపడేవారు 55% పైగా ఉన్నారని అంచనా. అక్కడి భవనాలు, అలాగే అభివృద్ది నమూనాలు జూరాంగ్ సంస్థ విధానాలు కొంతవరకూ మాత్రమే మనకి పనిచేస్తాయేమోగానీ అదే మంత్రం జపిస్తే మనకు ఇబ్బందులు తప్పవు.
 1. ఆ నగరదేశానికి సముద్రతీరం ఉన్నా ప్రక్కనే మలేషియా, ఇండోనేషియా దీవులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కనీసం అవసరమైన మంచినీటితో సహా సహజవనరులు ఏమీ లేకుండా, లాజిస్టిక్, పారిశ్రామిక వ్యాపార కేంద్రంగా విలసిల్లే ఒక కాలనీ స్టేట్. అక్కడ ఉన్న చాంగి విమానాశ్రయం కూడా సముద్రాన్ని ఇసుకతో పూడ్చి కట్టినదే. ఒకే మేజర్ పోర్ట్ అనేక టెర్మినల్స్ కలిగి ఉంది. కానీ ఒక నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం 972 కిమీ సముద్రతీరం, సహజ నౌకాశ్రయాలు కలిగిఉంది. సింగపూర్ లో సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని కొంతైనా పెంచుకోకపోతే ఎదుగుదలకి ఆస్కారమే లేని ప్రాంతం. జిడి.పిలో 4.9% రక్షణరంగానికి ఖర్చు పెడుతుంది ( ప్రభుత్వ రెవిన్యూ ఆదాయంలో 22% వరకూ రక్షణరంగానికే ఖర్చు పెడుతుంది) అయితే అక్కడ వయోజనులలో సెకండరీ స్కూలు మొహం చూడనివారే అత్యధికులు!
 1. ఇండియా జిడిపితో పోల్చుకుంటే ఎక్కడో దిగువున ఉంటుంది. అయితే తలసరి ఆదాయం ఎక్కువ. అయితే కార్బన్ డయాక్సైడ్ తలసరి విడుదల మనకంటే 4 రెట్లు ఎక్కువ. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారు దాదాపుగా లేరు. నిరుద్యోగం తక్కువ. లాజిస్టిక్స్, పన్నులు, వ్యాపార మార్పిడి, పరిశ్రమలు, టూరిజం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ద్రవ్బోల్బణంలో మనకి అక్కడికి తేడా 4%. అయితే ఫారెక్స్ రిజర్వ్సలో ఆ దేశం ఏకంగా భారతదేశంతో పోటీపడుతుంది. సరాసరి వయస్సులో ఇండియా(23) కంటే వృద్దదేశం(33)!. విద్య ఇండెక్స్ అక్కడ 0.8 ఉంటే అది ఇండియాలో 0.46. ఆరోగ్య సూచి అక్కడ బావున్నా ఒబెసిటి అక్కడ 7% పైగా ఉంది.

 

 1. సింగపూర్ కి అంతకు ముందు చరిత్ర ఉన్నా, సర్ రాఫిల్స్ ను ఆ నగర పునాది వేసినవారిగా చెబుతారు. ఆ దేశ అభివృద్దికి పునాదులు వేసినది ఆ దేశ ప్రధానమంత్రిగా 1959నుంచి 1990 వరకూ చేసిన లీ కుయున్ యు. తలసరి ఆదాయం $400 నుంచి నేటి 60వేలకు చేరడానికి ప్రధాన కారకుడు. 1990-2004 వరకూ సీనియర్ మంత్రిగా (వారు కుమారుడు ఉప ప్రధానిగా ఉండేవారు) ఆ తరువాత 2004- 2011 వరకూ ఆ దేశ మూడో ప్రధాని తన కుమారుడి మంత్రివర్గంలో మినిస్టర్ మెంటొర్(సలహాదారు) గా పదవులు నిర్వహించారు. తన 32వ ఏట చైనీస్ భాష నేర్చుకున్నారు. ఏ మతానికి చెందనివానిగా ప్రకటించారు. ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ఆయన సక్సెస్ ఒక పాఠ్యాంశం. మన రాష్ట్రానికి కూడా వారు వచ్చారు. His key message on the driving force behind Singapore’s success is simple: “The quality of a nation’s manpower resources is the single most important factor determining national competitiveness. It is the people’s innovativeness, entrepreneurship, team work, and their work ethic that gives them that sharp keen edge in competitiveness.” భౌగోఌకంగా నౌకామార్గంలో ఉండటం, చిన్నదైన ప్రదేశం, నాయకత్వం గట్టి పట్టుదల, ముందస్తు ప్రణాఌక, ప్రజల నిబద్దత, ప్రతీదాన్నీ రాజకీయం చేసే ఆ గందరగోళం లేకపోవడం, దాంతోపాటు అందరి మోటివేషన్ తో… ఆ అభివృద్ది సాధ్యం అయింది.

 

 1. ఆ దేశంలో పీపుల్స్ యాక్షన్ పార్టీ (15వేల మంది సభ్యులు), వర్కర్స్ పార్టీ ఆఫ్ సింగపూర్ రెండే పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీకి 3%(2001), 4%(1968)లో తక్కువగా రాగా అత్యధికంగా 1988లో 16.7% వచ్చినవి. 2011 ఎన్నికలు జరిగే 87 సీట్లకి 81 సీట్లు అధికార పార్టీ గెలుచుకుంది. అనేక సార్లు ఏకగ్రీవ ఎన్నికలే జరిగేవి. ఒకోసారి ఒక్కసీటు కూడా ప్రతిపక్షం నెగ్గలేదు. చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యం 12% మాత్రమే. జనాభాలో మహిళల శాతం మన రాష్ట్రంకంటే తక్కువ. సింగపూర్ లో ఉన్నది ఒక అధారిటేరియన్ డెమోక్రసీ. ప్రజలు ఆ ఒకే పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారు. 21ఏళ్ళు నిండిన ప్రతీ వయోజనుడు ఓటు తప్పనిసరిగా అక్కడ వేయాలి. చట్టం చక్కగా అమలు పరుస్తున్నారు.ఆర్థికనేరస్థులని ఆ దేశం తీవ్రంగా శిక్షిస్తుంది. కాని మన వద్ద ఉన్నది ఒకో స్వామ్యంలో- ప్రజాస్వామ్యం కంటే ఎక్కువే. చట్టం కొందరికి చుట్టం!
  Srinivas Chalasani

  Srinivas Chalasani

 1. అక్కడ 1867 వరకూ భారత ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాలు (బ్రిటిష్ పార్లమెంటుకులోబడి) చెలామణీ అయ్యేవి. అనేక ఆటుపోట్లకు లోనై అంతిమంగా రిపబ్లిక్ అయిన తరువాత 1965నుంచి అక్కడి చట్ట నిబంధనలు అత్యంత కఠినమైనవి. పౌరులు చట్టాన్ని పాటించటానికి నిబద్దులై ఉంటారు. ఎవరైనా మూడోసారి లిట్టరింగ్ అఫెన్స్ చేస్తే (చెత్త వేయకూడని చోటో, రోడ్డు ప్రక్కనో) వేస్తే జైలు శిక్షే. చట్టలో కానింగ్ (బెత్తంతో కొట్టడం) పురుషలకి (<50) నేటికీ అమలు అవుతుంది. పిల్లలను కొట్టడాన్ని పాఠశాలల్లో, అలాగే ఇళ్ళల్లో తల్లిదండ్రులును చట్టం అనుమతిస్తుంది కానీ ప్రోత్సహించదు! డ్రగ్స్ లాంటిది ఒక గ్రాము దొరికినా వారికి మరణశిక్ష వేస్తారు. ఒకవేళ అనధికార ఆయుధంతో కాల్చినా (ఎవరూ చనిపోకపోయినా) మరణశిక్షకు అర్హులు. తీవ్రమైన కిడ్నాపులు లేదా ప్రభుత్వానికి లేదా అధ్యక్షుడి మనుషులకి వ్యతిరేకంగా కుట్రచేసినా అదేగతి. అవినీతిని సహించరు. ప్రయివేటు సంస్థలలో అవినీతి చేసినా శిక్షలు తప్పవు. పత్రికలు ప్రసార మాధ్యమాలపై నియంత్రణ,, అలాగే విదేశాలనుంచి వచ్చే కొన్ని పుస్తకాలపై నిషేదాజ్ఞలు ఉన్నాయి. లెనిన్, మావోలపై కొన్ని పుస్తకాలు అక్కడ నిషేధించారు. ఆ పరిస్థితులు వేరు.

అందువల్ల నమో సింగపూరాయా :, నమో షాంఘై, నమో లండన్ నమో దుబాయి: మంత్రాలు జపించడం మాని మన భౌగోఌక, ఆర్థిక, సామాజిక అంశాల ప్రాతిపదికన అందరికీ అభివృద్ది ప్రాతిపదికన నిర్థిష్ఠ ప్రణాఌకలతో ముందుకు తీసుకువెళ్లడం ముఖ్యం అని ఆ నాయకులందరికి వినయంగా మనవి చేసుకుంటున్నాను. అదే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలో మేటి ఆధునికతతో హరితనగరంగా సామాన్యులు కూడా జీవించే అవకాశాలున్న నగరంగా, వేలాది సంవత్సరాల ఆంధ్రుల చారిత్రాత్మిక ప్రశస్థికి కాణాచిగా సంస్కృతి ఉట్టిపడేటట్లు భారతీయతతో నిర్మించాలి. – చలసాని

( Srinivas Chalasani )

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *