విశ్వనగరపు జిలుగు వెలుగులు నడుమ అంధకారం

Google+ Pinterest LinkedIn Tumblr +

” ఈ చీకటి ఇప్పటిది కాదయ్యా , ఇరవై ఏళ్లది… ”
సికింద్రాబాద్‌ సమీపంలో మడ్‌ ఫోర్ట్‌ ఏరియాలోని అంబేద్కర్‌ హట్స్‌కాలనీలో అడుగు పెట్టినపుడు మాతో కాలనీ వాసి పోశమ్మ అన్న మాటలవి.
అక్కడ 520 గుడిసెల్లో కనీస సౌకర్యాలు లేకుండా 12వందల మంది బతుకుతున్నారు. వారిలో కొందరు చెత్తను ఏరే కార్మికులు. కొందరు తాపీ పనులు, మరి కొందరు ఇళ్లలో పనిమనుషులుగా బతుకుతున్నారు. ఎక్కువ శాతం ఎస్టీలు ఉండగా ఆ తరవాత ఎస్సీలు,బీసీలు ఉన్నారు. ఇక్కడ ఒక అంగన్‌ వాడీ స్కూల్‌ ఉంది. సాయంత్రాలు పిల్లలు గాలికి రెపరెపలాడే కిరోసిన్‌ దీపాల కింద హోంవర్క్‌ చేసుకుంటూ ఉంటారు.
వీరి గుడిసెల పైనుండి విద్యుత్‌ తీగలు పోష్‌ కాలనీల వైపు వెళ్తుంటాయి. కానీ వీరికి మాత్రం కరెంట్‌ లేదు.

 అంబేద్కర్‌ హట్స్‌లో కిరోసిన్‌ దీపం కింద చదువులు

అంబేద్కర్‌ హట్స్‌లో కిరోసిన్‌ దీపం కింద చదువులు

” మా అందరికీ రేషన్‌. ఆథార్‌ కార్డులున్నాయి. అందరికీ ఒక పబ్లిక్‌ నల్లా కూడా ఇచ్చారు. కానీ విద్యుత్‌ ఇవ్వడం లేదు. మా ఓట్ల కోసం నాయకులు వస్తారు. కానీ సమస్యలు ఎవరూ పట్టించు కోరు.గత ఇరవై ఏండ్లుగా ఇవే బాధలు..” అంటున్నారు మరియమ్మ,
సంతోషమ్మ , మంగమ్మ,మల్లమ్మ
వెలుగులు ఇవ్వండి
‘ విద్యుత్‌ సౌకర్యం కల్పించ మని అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. 800 మంది చదువుకునే పిల్లలున్నారు. ఇంటికి కనెక్షన్‌ ఇవ్వక పోయినా కనీసం స్ట్రీట్‌ లైట్లు వేసినా మా బిడ్డలు వాటి కింద చదువుకుంటారు.’ అని అన్నారు,అంబేద్కర్‌ హట్స్‌కాలనీసెక్రటరీ రంగప్ప,అధ్యక్షుడు అశోక్‌.
‘సౌభాగ్య’ం కలుగుతుందా?
” వీరికి పబ్లిక్‌ నల్లా, కమ్యూనిటీ టాయిలెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు విద్యుత్‌ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి?” అని కంటోన్మెంట్‌ విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ, మాధవరెడ్డిని ప్రశ్నించగా , ”అంబేద్కర్‌ హట్స్‌లోని, పూరిళ్లకు పట్టాలు లేనందున కరెంట్‌ ఇవ్వడానికి ఇన్నాళ్లు జాప్యం జరిగింది. అయితే కేంద్రప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ‘సౌభాగ్య’ పథకంలో వీరికి విద్యుత్‌ సౌకర్యం కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నాం. స్లమ్‌లో నివశిస్తున్న వారి వివరాలు సేకరించాం. త్వరలోనే మీరు ఇక్కడ పాజిటివ్‌ స్టోరీ చూస్తారు.” అన్నారు.
ప్రతీ రోజూ ప్యారడైజ్‌,ప్యాట్నీ నుండి దక్కన్‌ క్రానికల్‌ వరకు , చెత్తను ఏరుతూ గల్లీలన్నీ శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, తమ బిడ్డలతో చీకట్లో బతుకుతున్న వీరికి ఎప్పటికైనా ప్రభుత్వం వెలుగులు పంచుతుందని ఆశతో ఉన్నారు.

(This article is presented under RuralMedia-Nirmaan partnership, contact- 9440595858)

Share.

Leave A Reply