యువత తుపాకీ ఎందుకు పట్టారు?

Exclusive interview of Janasena Chief-1
( ‘చదువుకునే రోజుల నుండి, ఇప్పటివరకు ఎన్నో దెబ్బలు తిన్నాను, గుర్తింపు ఉన్న నాకే ఇలా జరిగితే సగటు మనుషులకు దిక్కేంటి?’ అని ఆవేశంగా పవర్‌స్టార్‌ టేబుల్‌ మీద చరచగానే మా నోట్‌ ప్యాడ్స్‌ ఎగిరి పడ్డాయి. సగటు సినీజీవులకంటే పవన్‌ వ్యక్తిత్వం విభిన్నం. వ్యవస్ధలో జరుగుతున్న సామాజిక దుర్మార్గాలను చూసి తీవ్రంగా చలించి పోతాడు కానీ, వాటిని ఎదుర్కొనే కార్యాచరణలో స్పష్టత ఉండదు. బహుశా ఆయన్ని గైడ్‌ చేసే సరైన మిత్రులు లేరని పిస్తుంది. గంటన్నరకు పైగా సాగిన ఈ సంభాషణలో ఆఫ్‌ ది రికార్డుగా చాలా విషయాలు చెప్పినప్పటికీ కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. ప్రజారాజ్యం ఏర్పాటుకు ముందు ఒక సాయంత్రం పవన్‌తో జరిపిన ఫేస్‌ టు ఫేస్‌ ఇది. అప్పటి చేగువేరా స్ఫూర్తి ఇప్పటి జనసేనానిలో ఎక్కడ కనిపించక పోవడం ఒక వైరుధ్యం.  – ఎడిటర్‌/ రూరల్‌మీడియా )
‘ఎవరైతే  ముక్కుసూటిగా,  రూల్స్‌  ప్రకారం జీవిస్తారో వారికి ఈ సమాజంలో స్థానం లేకుండాపోయింది. నైతిక విలువలు, సిద్ధాంతాల బాటన నడిచే వారికి ఎప్పుడు అవమానాలే.. చెప్పడానికి కఠినంగా ఉన్నా ఇది వాస్తవం.
ఇదంతా  స్టూడెంట్‌ లైఫ్‌ నుండీ నేనూ అనుభవించాను కాబట్టి ఆ చేదు జ్ఞాపకాలు, అనుభవాల నుండే నేను చెబుతున్నాను. దౌర్జన్యాలు,  అక్రమాలు, లూటీలు చేసేవాడికే నేడు సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి.  విలువలు లేనివారు నేడు రాజభోగాల్ని, సకల సౌకర్యాల్ని అనుభవిస్తున్నారు. నేటి వ్యవస్థ కేవలం కొన్ని అగ్రకులాల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. దశాబ్దాలుగా వీరు సమాజంపై ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. ఈ కులాలే సమాజాన్ని శాసిస్తున్నాయి. వారికి ఇతరుల బాగోగులతో పనిలేదు. వారు, వారి కుటుంబం, వారి బంధువులు బాగుపడితే చాలనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు.
ఎన్నో దెబ్బలు … 
నేను కుల, వర్ణ వివక్ష ఎదుర్కోనప్పటికీ చిన్నప్పటినుంచీ చదువుకునే రోజులనుండీ ఇప్పటివరకు నేను దెబ్బలు తింటూనే వున్నాను. అవి ఎన్నో రకాలుగా కావొచ్చు. హీరోగా గుర్తింపు వున్న నాకే ఇలా జరిగితే ఏ గుర్తింపు లేని సగటు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.
 యువత తుపాకీ ఎందుకు పట్టారు?
దశాబ్దాలుగా మన దేశంలో అధికారం పేరిట దోపిడీ కొనసాగుతున్నందునే దీనిని సహించలేని, ఓర్చుకోలేని యువతరం అతివాదం, నక్సలిజం బాట పట్టింది. నేడు సమాజానికి నక్సలిజం ప్రమాదమనే సాకుతో దానిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయే తప్ప వాటి మూలాల్లోకి వెళ్ళి అసలు కారణాల్ని అన్వేషించలేకపోతున్నారు. యువత తుపాకీ బాటను ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, వాటిని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతకడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. మల్కాన్‌ సింగ్‌ వంటి కరడు గట్టిన నేరగాళ్ళే జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు నక్సలైట్‌ సోదరులు ఎందుకు కలవకూడదు. నేటి వ్యవస్థలో ఆల్టర్‌నేట్‌ సిస్టమ్‌ పనిచేయకపోవడం వల్లే మావోయిసం ప్రబలుతోంది. నిస్సహాయ పరిస్థితులనుండే ఉద్యమాలు పుడతాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగానిదే దీని పూర్తి బాధ్యత.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *