అల్లమా… బంతిపూల వనమా?

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లమా… బంతిపూల వనమా? 
ప్రకృతి నేస్తాలు – 1 

………………………..
 ఒకపుడు ఈ బీడు భూమిలో ముళ్లకంపలు పెరిగేవి. దీనిని ఎలాగైనా సాగుకు అనువుగా మార్చాలని దళిత రైతు కంతిబిచ్చప్ప నిర్ణయించుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి నేలను చదును చేశాడు. తన మూడు ఎకరాల పొలంలో అల్లం పంట వేసి చుట్టూ సరిహద్దుల్లో మామిడి మొక్కలు నాటాడు. 
ప్రతీ మొక్క మొదలు కాండం నుండి అడుగు దూరంలో చుట్టూ పళ్లెం తవ్వి నీళ్లు పెట్టసాగాడు. దీని వల్ల నీరు భూమి లోపల విస్తరించిన మొక్క వేర్లకు అందుతుంది. ఎండిన ఆకులు రాలి కంపోస్టుగా మారుతాయి. దీంతో మామిడి మొక్క కాండం బలంగా పెరిగింది. 

santakumar-gingercrop

santakumar-gingercrop


భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉండటం వల్ల ప్రతీ నీటి బొట్టును కాపాడుకోవడానికి అల్లం పంటకు డ్రిప్‌ ద్వారా నీరు పెడుతున్నాడు. తన పొలం చుట్టూ కంచెగా తుమ్మ ముళ్ల కంపను వాడాడు. సరిహద్దుల్లో అక్కడక్కడా టేకు చెట్లు వేశాడు.
 అల్లం పంటకు ముందు వరసలో బంతిపూల చెట్లను నాటాడు. ఎందుకలా అని అడిగితే ఇలా అంటాడు బిచ్చప్ప… 
” అల్లం పంటను కొన్ని రకాల కీటకాలు నాశనం చేస్తాయి. అవి రాకుండా బంతిపూలు ఆకర్షిస్తాయి. అలాగే టేకు చెట్లు కూడా కొన్ని రకాల కీటకాలు అల్లం పంటవైపు రాకుండా ఆపుతాయి. కొన్నేళ్లు పోతే, టేకు కలప వల్ల అదనపు ఆదాయం వస్తుంది. ” 
పర్యావరణ ప్రేమికుడు 
బిచ్పప్ప సాగు చేస్తున్న విధానంలో పర్యావరణ అంశాలు దాగి ఉన్నాయి. 
1, రాలిన ఎండుటాకులనే ఎరువుగా వాడుతూ ఎరువుల వాడకం తగ్గించాడు. 
2, అల్లం పంటపైకి దండెత్తే కీటకాల కోసం క్రిమిసంహారకాలను వాడకుండా బంతిపూల తో వాటిని ఆకర్షించేలా చేస్తున్నాడు. 
3, సాగు నీరు వృధా కాకుండా చుక్కల సేద్యం చేస్తున్నాడు. 
ఇలా భూమిని నీటిని కాపాడుతూ ప్రకృతిని ప్రకృతితోనే రక్షిస్తున్నాడు. 
………………………………………. 
రైతు – కంతి బిచ్చప్ప, 
గ్రామం- బాబానగర్‌, రంజోల్‌ పంచాయితీ,జహీరాబాద్‌ , మెదక్‌ జిల్లా 

Share.

Comments are closed.