బడ్జెట్ అంటే అభివృద్ధి దిక్సూచి…

Google+ Pinterest LinkedIn Tumblr +

బడ్జెట్ అంటే అభివృద్ధి దిక్సూచి…

…………………………………

ప్రజల అవసరాలు, రాష్ట్ర వనరులకు అనుగుణంగా బడ్జెట్ లో ఆయా శాఖలకు నిధుల కేటాయింపు జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సూచించారు. బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారిగా సమీక్షలను బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. నాక్ లో జరిగిన మొదటి రోజు సమీక్షలో ఆర్ అండ్ బి, రవాణా, ఆర్టీసీ, పోలీస్, జైళ్ల శాఖలపై సమీక్ష జరిపారు. గత బడ్జెట్ లో ఆయా శాఖలకు జరిగిన కేటాయింపులు ఎన్ని? అందులో ఖర్చయినవి ఎన్ని? నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో ఖర్చు కాకపోవడానికి కారణాలేంది? ఒక ఏడాది కోసం కేటాయించిన నిధులు అదే ఏడాదిలో ఖర్చు చేసి, ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.
బడ్జెట్ అంటే కేవలం జమా, ఖర్చుల పద్దులా కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే దిక్సూచిగా, రుగ్మతలు రూపుమార్పే సంస్కరణల మాదిరిగా వుండాలని సిఎం అన్నారు. ఆయా శాఖల్లో ఇప్పటికే అమలయ్యే కార్యక్రమాలు కొనసాగించాలా? మార్పులు చేయాలా? రద్దు చేయాలా ? తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరపాలన్నారు. రాష్ట్రం యూనిట్ గా కాకుండా, జిల్లా యూనిట్ గా, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్ గా ప్రజల అవసరాలేంటి? శాఖల వారీగా ఎన్ని నిధులు అవసరం ? గత బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారు? ఇంకా ఎన్ని నిధులు కావాలి? తదితర అంశాలు పొందుపరుస్తూ డిస్ట్రిక్ట్ కార్డులు తయారు చేయాలన్నారు. అధికార ప్రక్రియల్లో నిధుల విడుదలలో అడ్డంకులు, జాప్యం తొలగిపోవాలని, సరళీకృత పద్ధతులు కావాలని, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కూడా మారాలని సిఎం చెప్పారు. స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ఎలా వినియోగం అవుతుందో అన్ని శాఖల నిధులు కూడా అదే విధంగా ఖర్చు అయ్యేలా విధానం వుండాలన్నారు. ప్రతీ శాఖ తనకున్న ఆదాయ వనరులను పెంచుకోవాలని, గరిష్ట సామర్థ్యంతో పని చేయాలని సూచించారు. ఆయా శాఖలకు అవసరమైన మేర నిధులు కేటాయించడానికి, భవనాలు కట్టడానికి, వాహనాలు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని కెసిఆర్ చెప్పారు. ఆయా శాఖల్లో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు గమనించాలని, ఎక్కడ మంచి విధానం వుందో గుర్తించి, అందులోంచి మంచిని, స్ఫూర్తిని స్వీకరించాలని సూచించారు.

ఎమ్మెల్యే కార్యాలయం పెట్టాలి
——————————
ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయం కట్టాలని, ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కొత్త రహదారులు ఎక్కడ కావాలి? వంతెనలు ఎన్ని కావాలి? మరమ్మత్తులు చేయాలంటే ఎంత కావాలి? అనే విషయాలను నియోజకవర్గాల వారీగా శాఖల వారీగా అంచనా వేసి, బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. కొత్తగా నియమించే ఉద్యోగులు, అందుకు అయ్యే ఖర్చు వివరాలు కూడా ముందుగానే ఇవ్వాలని కోరారు. ఏడాది కాలంలో ఎంత మేర పని చేయగలుగుతామనే విషయంలో కూడా ఆయా శాఖలకు అంచనా వుండాలన్నారు. తమకున్న సామర్ధ్యం ఏమిటనే అంశంలో కూడా ఎవరి అంచనా వారికుండాలన్నారు.

ఆర్టీసిని లాభాల బాట పట్టించాలి
———————————
తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి అవసరమైన వ్యూహం అనుసరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్, రవాణా, ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా రూట్లను ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రతీ డిపో నుంచి తిరుపతి, షిరిడి లాంటి పుణ్యక్షేత్రాలకు, జాతరులకు బస్సులు నడపాలన్నారు. మినీ బస్సులు నడపాలన్నారు. హైదరాబాద్ వచ్చే ప్రయాణీకులను కూడా తమ గమ్యస్థానం దాకా తీసుకెళ్లే వ్యూహం రూపొందించాలన్నారు. అధిక రద్దీ వున్న ప్రాంతాలను గుర్తించి, పోలీస్ శాఖ సమన్వయంతో రద్దీ తగ్గించడానికి, ప్రమాదాలు నివారించాడానికి, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలని చెప్పారు.

శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుపోతుందని, అందుకే పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. పోలీస్ శాఖలోని వివిధ అధికారుల సర్వీస్ అంశాల్లో వివాదాలున్నాయనీ, వాటిని తొలగించాలని సూచించారు. జైళ్ల నిర్వాహణలో సంస్కరణలు రావాలని, ఖైదీలను సంస్కరించే కేంద్రాలుగా జైళ్లు మారాలని సిఎం చెప్పారు. ఈ విషయంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న పద్దతులు అద్యయనం చేయాలన్నారు. హైవేలలో నిఘా పెంచాలని, అదనపు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో, పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు వివిధ అధికారులు, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Share.

Leave A Reply