ముఖ్యమంత్రి గ్రామం మంచిగుందా…?

Chintamadaka needs KCR's attention

ముఖ్యమంత్రి గ్రామం మంచిగుందా…?
……………………………………………………
తెలంగాణ ఆవిర్భావ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా,  పల్లెలెట్లా ఉన్నవో చూద్దామని చింతమడక గ్రామంలో అడుగు పెట్టినపుడు కనిపించిన దృశ్యాలివి. రాష్ట్రావతరణ వేడుకల సందడి ఈ ఊర్లో ముచ్చుకైనా కానరాలేదు.పెంకులూడి పోతూ, శిధిలమైన గోడల మధ్య మట్టి ఇండ్లు, ఇరిగి పోతున్న గుమ్మాల కింద బీడీలు చుట్టుకుంటూ రోజుకు యాభై రూపాయలు కూడా కిట్టుబాటు కానీ ఆడబిడ్డల నిరాశ నిండిన చూపులు, డిగ్రీలు చదివినా ఉపాధి లేక రోడ్లుమీద ఉసూరు మంటూ తిరుగుతున్న యువతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లయినా మారని తమ ఊరుని చూస్తూ నిస్సాహాయంగా అరుగుల మీద కూలబడిన విద్యార్ధులు, రోడ్డు విస్తరణలో కూలిన ఇళ్లను చూసి ఏం చేయాలో తోచని గ్రామస్ధులు… ఇదీ ఈ గ్రామంలో ఎవరిని కదిలించినా కనిపించే నిరాశా, నిస్తేజం.


సీఎం సొంతూరు చింతమడక (సిద్ధిపేట జిల్లా ) జీవన చిత్రమిది. ”గ్రామంలో రాములోరి గుడి కడతామని, రోడ్‌ విస్తరణలో 70వరకు ఇండ్లు కూల్చేశారు. మాకు డబుల్‌ బెడ్‌ రూంలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు కానీ ఇంత వరకు కార్యాచరణ లేదు” అని ఆవేదనగా అంది జల్లా రాములు భార్య బాలనర్సు.

సమస్యల ముల్లె,సీఎం పల్లె
2 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో అన్నీ సమప్యలే అంటారు ఇక్కడి జనం.సరైన రహదారులు లేవు.పక్కా స్కూల్‌ భవనాలు,పోలీసు స్టేషన్‌,బీసీ హాస్టల్‌, డ్రైనేజీ సదుపాయాలు లేవు, ఆస్తి పన్నులు,నీటి బిల్లుల ద్వారా ఏడాదికి రూ.70వేలు ఆదాయం పంచాయితీకి వస్తోంది.
సిద్దిపేట నుండి 18కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతమడక ను మండల హెడ్‌ క్వార్టర్‌గా మార్చాలని, నిరుద్యోగ తదితర సమస్యలు తీర్చాలని కొన్ని నెలల క్రితం గ్రామస్తులు ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకున్నారు కానీ ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదనే నిరాశ ఇక్కడి ప్రజల్లో ఉంది.
”30పడకల ఆసుపత్రి,పంచాయితీభవనం నిర్మించినా నేటికీ ప్రారంభోత్సవం చేయలేదు.దమ్మ చెరువు కట్టకు మట్టి పోసి వదిలేశారు పనులు పూర్తి చేయలేదు” అని చింతమడక గ్రామస్తులు తమ ‘చింతలు’ రూరల్‌మీడియాకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే ‘గమ్యాన్ని ముద్దాడినట్లు’ కాదన్న అవగాహన పాలకులకు ఉండాలి.
ఇంకా చాలా చేయవలసి ఉన్నది.
తెలంగాణ ప్రజల ‘ఆర్తి’తీర్చడానికి ఇంకా శ్రమపడవలసి ఉన్నదనే తెలివిడి కూడా ఉండాలి.

………………………………………………..
ఫోటోలు… కె.రమేష్‌బాబు(రూరల్‌మీడియా)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *