
ఈ పురుషులంత గలిపి, ఇల్లాలమంత గలిపి
……………………………………………..
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి, ఉత్తేజితపరిచిన పాటల్లో ఇది ప్రముఖమైనది. దీనిని సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేసిన, నల్గొండ జిల్లాకు చెందిన జి.యాదగిరి వ్రాశాడు.సాయుధ పోరాటం కథా వస్తువుగా నరసింగరావు తీసిన మా భూమి చిత్రంలో యాదగిరి పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గద్దర్ ఈ పాట పాడాడు. ఆ తరువాత కాలంలో ఈ పాట అనేక సినిమాలలో వినిపించింది. దీన్ని అనుకరిస్తూ అనేక పేరడీలు కూడా వచ్చాయి.
నేపథ్యం
రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు సృష్టించిన భీభత్సాల కంటే నైజాం ఆకృత్యాలు మీరిపోయాయని, రాజకీయ ఎత్తుగడలతో బలవంతులంతా కలిసి తెలంగాణ ప్రజలని దోచుకొన్నారనీ, రైతులని శారీరకంగా మానసికంగా హింసించిన నీకు గోల్కొండ కోట కింద శ్మశానం కడతామని గద్దర్ తన కోపాన్ని వెళ్ళగ్రక్కాడు.
పాట- సాహిత్యం
…………………………………………
బండెన్క బండి గట్టి, పదహరు బండ్లు గట్టి
యే పల్లే బోతవ్ కొడుకో నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
పోలీసు మిల్ట్రీ రెండు బలవంతులానుకోని
నువు పల్లెలు దోస్తివి కొడుకో, ఓహో పల్లెలు దోస్తివి కొడుకో
అహ పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
జాగీరుదారులంతా, జామీనుదారులంతా
నీ అండా జేరి కొడుకో నీ అండా జేరి కొడుకో
నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
ఈ పురుషులంత గలిపి, ఇల్లాలమంత గలిపి
వరిసేల రాళ్ళు నింపి వడివడిగ గట్టితేనూ
కారాము దెచ్చి నీకు కండ్లల్ల జల్లితేనూ
ఈ మిల్ట్రి వారి పోరు ఈ మిల్ట్రి వారి పోరు
నైజాము సర్కరోడా
||బండెన్క బండి గట్టి||
చుట్టుముట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేదైద్రబాదు, దాని పక్కా గోలుకొండ
గోలుకొండా కిల్ల కింద గోలుకొండా కిల్ల కింద
నీ గోరి గడ్తం కొడుకో నైజాము సర్కరోడా
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=gXVmvLsC6tQ వినండి!
(సేకరణ)
టీవీయస్. శాస్త్రి