సీఎం దత్తత గ్రామంలో ఏం జరుగుతోంది?-1

AP,CM adopted village has no school and Water

(1)
ఆకు పచ్చని అరకు కొండలమధ్య విసిరేసినట్టున్న పంచాయితీ పెదలబుడు.అక్కడికి వెళ్లడానికి సరైన దారి లేదు.ఇక్కడ ఎక్కువ శాతం ఆదివాసీలే, కాయకష్టం చేసి బతుకుతుంటారు. పొలం పనులు దొరికితే తింటారు. లేక పోతే పస్తులే. సరైన విద్య,వైద్య సౌకర్యాలు లేవు. తాగునీటి వసతి అంతంత మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో 2015 అక్టోబర్‌లో ఈ గ్రామస్తులకు ఒక తీపి కబురు అందింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గారు ఈ గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడమే దానికి కారణం.
ఇపుడు ఈ దత్తత ఈ గ్రామంలో ఎం జరుగుతోంది?
ప్రజలు ఎలా బతుకుతున్నారు?
గ్రామాభివృద్ధికి ఏం చేస్తున్నారు? కనీస వసతులు కల్పించారా?
మొదలైన అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇది… కొన్ని గంటల పాటు రూరల్‌ మీడియా పెదలబుడు గిరిజనుల మధ్య తిరుగుతూ వారి బతుకు చిత్రాన్ని రికార్డుచేసింది.
అరకు నుండి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న పెదలబుడు పంచాయితీలో 21గ్రామాలున్నాయి. మొత్తం జనాభా 11,280.( వీరిలోమహిళలు5,150,గిరిజనులు 8,758, ఎస్సీలు 208,ఇతరులు 2,314.)
ఆరోగ్య కేంద్రం ఎక్కడా?
పదకొండు వేల జనాభా ఉన్న ఈ పంచాయితీలో ఒక్క ప్రాధమిక ఆరోగ్యకేంద్రం కూడా లేక పోవడం ఈ గిరిజనులు దురదృష్టం. ఒక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మాత్రమే ఉంది. అక్కడ అన్ని రోగాలకు పరిష్కారం ఉండదు. ప్రజలు రోగాల భారిన పడితే అరకు, లేదా విశాఖ కు పొవాల్సిందే.
మూత పడిన బడి
పెదలబుడు పంచాయితీ పరిధిలోని లిట్టిగూడ గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్‌ ఇటీవల మూతపడింది. విద్యార్ధుల సంఖ్య తక్కువ ఉందనే సాకు తో ఈ స్కూల్‌లో పాఠాలు చెప్పడం లేదు. దీనివల్ల ఇక్కడ చదువుతున్న 23 మంది విద్యార్ధులు 2కిలో మీటర్లు నడిచి మరో స్కూల్‌కి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

•Tribal kids stage dharna at the Collectorate demanding reopening of the school

• Tribal kids stage dharna at the Collectorate demanding reopening of the school

”అరుకు లోయలో కొండల పక్కనుండి అంత దూరం నడవడం చాలా రిస్కు. సరైన రహదారులు లేవు. వానా కాలంలో కాలిబాటలు తెగిపోతాయి. ఈ బాధలు భరించలేక పిల్లలు మధ్యలోనే చదువు అపేసే పరిస్ధితి ఏర్పడుతుంది.”అని కొందరు గిరిజన పెద్దలు రూరల్‌మీడియా తో చెప్పారు.
తమ బడిని తిరిగి తెరవాలని విద్యార్ధులంతా విశాఖలోని కలెక్టరేట్‌ ముందు ధర్నా కూడా చేశారు కానీ వారి సమస్య పరిష్కారం కాలేదు.
”అరకులోని 11 మండలాల్లో పిల్లలు తక్కువ ఉన్నారనే కారణంతో ఇప్పటి వరకు 70 పాఠశాలలు మూతపడ్డాయి.దీంతో బడిమానేసే పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగి పోతుంది.” అని ఒక గిరిజన యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ముఖ్యమంత్రిగారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన తరువాత కూడా పిల్లలకు చదువు అందుబాటులో లేక పోవడం ఆదివాసీలను నిరాశ పరుస్తోంది.
తాగునీటికి కటకట
పెదలబుడు లో 3,116 కుటుంబాలు బతుకుతున్నాయి కానీ రోజూవారీ అవసరాలకు తగినంత నీటిసరఫరా లేదు. అక్కడక్కడా ఉన్న ఆరు బావుల నీరే ప్రజలకు ఆధారం. కేవలం 119 చేతిపంపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.వాటిలో కొన్ని రిపేరులో ఉన్నాయి. ఇక తాగునీరు అంతంత మాత్రమే.

తాగునీటికి ఇలాంటి బావులే ఆధారం

తాగునీటికి ఇలాంటి బావులే ఆధారం

గరడగుడ,గంజాయిగుడ గ్రామాల్లో కొండలమీదున్న ఊటనీటి కుంటలనుండి దిగువకు ప్రవహించే నీరే ఈ ఆదివాసీల దాహార్తి తీరుస్తోంది. గిరిజన మహిళలు ఆ నీళ్లను కుండల్లో నింపి మోసుకుంటే సుదూర తీరంలో ఉన్న ఇళ్లకు నడిచి పోవాల్సిందే. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా పంచాయితీలో ప్రతీ ఇంటికీ మంచి నీటిని అందించాలనే ప్రతిపాదన ఉంది కానీ,అదింకా పూర్తిగా అమలుకు నోచుకోలేదు.

  • -shyammohan(9440595858)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *