‘ ప్రణయ్‌ మొదటి వాడు కాదు, కానీ చివరి వాడు కావాలి’

Google+ Pinterest LinkedIn Tumblr +
 • ” ప్రణయ్‌ మొదటి వాడు కాదు, కానీ చివరి వాడు కావాలి”
   అమృతకు అండగా ‘యువవారధి’
  మిర్యాలగూడలో, ముత్తిరెడ్డికుంటలో అడుగు పెట్టగానే ఒక రకమైన విషాదం అలుముకుంటుంది. ఇటీవల హత్యకు గురైన ప్రణయ్‌ ప్లెక్సీలు అక్కడక్కడా కనిపిస్తాయి. ‘ప్రణయ్‌ నీది చివరి రక్తం కావాలి” అనే క్యాప్షన్‌ ఉన్న ప్లెక్సీని మేం ఫొటో తీస్తుంటే పోలీసు కానిస్టేబుల్‌ వచ్చి అడ్డుకున్నాడు. దానికి కారణం ఆ ప్లెక్సీ పోలీసు అవుట్‌ పోస్టుకు అంటించి ఉండటమే… అవుట్‌ పోస్ట్‌ను ఫొటో తీసుకుంటున్నామని అతను పొరబడ్డాడు. మా గురించి పరిచయం చేసుకోగానే, సంతోషిమాత గుడి దగ్గరే, ప్రణయ్‌ ఇల్లు అని దారి చూపించాడు. ఆ గల్లీకి వెళ్తుంటే ‘జోహార్‌ ప్రణయ్‌’, ‘జైభీమ్‌’ల నినాదాలతో ప్లెక్సీలు వేలాడుతూ కనిపిస్తాయి…
  ప్రముఖులు, మీడియా వాహనాలను దాటుకొని ఇంట్లోకి అడుగు పెట్టాం. ప్రణయ్‌ కుటుంబాన్ని సీఎల్పీనేత జానారెడ్డి, మరికొందరు నాయకులు పరామర్శిస్తున్నారు. మరో వైపు ప్రణయ్‌ సోదరుడ్ని టీవీ ఛానెల్‌ వారు లైవ్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నారు.
  మేం లోపలి గదిలో ఉన్న ప్రణయ్‌ భార్య అమత వర్షిణిిని కలిశాం.
  ప్రణయ్‌ విగ్రహాన్ని నెలకొల్పాలి
  ” నచ్చిన వాడితో బతికే హక్కులేదా? నా భర్తను చంపే హక్కు మా నాన్నకు ఎవరిచ్చారు? నాలాగా మరో ఆడపిల్లకు అన్యాయం జరుగొద్దు అని, సామాజికన్యాయం కోసం నా పోరాటాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రారంభిస్తున్నాను.” అని మాతో అన్నారు. ఆ సమయంలో, ఆమె, ల్యాప్‌ట్యాప్‌లో ప్రణయ్‌ పేరిట ఫేస్‌బుక్‌ పేజీని క్రియేట్‌ చేస్తోంది.
  ” కులతత్వానికి వ్యతిరేకంగా ప్రణయ్‌ ఆశయం కోసం ఇకపై పని చేస్తాను. ఇప్పటికే వేలాది మంది నాకు సోషల్‌ మీడియా ద్వారా మద్దతు తెలిపారు. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చేస్తాను. ప్రణయ్‌ మొదటి వాడు కాదు.కానీ చివరి వాడు కావాలి. మా వెలి ప్రేమకు చిహ్నంగా ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీతో పాటు వెబ్‌సైట్‌ కూడా పెడుతున్నాం. మిర్యాల గూడ చౌరస్తాలో, ప్రణయ్‌ విగ్రహాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం స్థలం ఇచ్చి, అనుమతి ఇవ్వాలి..” అని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. ప్రణయ్‌ ఇపుడు ఒంటరి వాడు కాదు, నాతో పాటు కోట్లాది హృదయాల్లో సజీవంగా ఉన్నాడు..అంటూ ఆమె ఫేస్‌బుక్‌ పేజీలో తొలి వ్యాక్యం రాయబోతున్నట్టు చెప్పారు.
 • వారిపై కేసులు పెడతా?
 • ” సోషల్‌ మీడియాలో మా ప్రేమను అవమానిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రణయ్‌తో ప్రేమ మొదలు, హత్య వరకు నాదే తప్పన్నట్టు,కొందరు పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై కేసులు పెడతాను.” అని అమృత హెచ్చరించారు. ఆమె అత్త ప్రేమలత కూడా ఈ కామెంట్ల పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని అన్నా నా కోడలిని గుండెల్లో పెట్టుకొని దాచుకుంటా, నా కొడుకు కుల అహంకారానికి బలి అయ్యాడు. నా కోడలిని సోషల్‌ మీడియా మానసికంగా వేధించాలని అనుకుంటుందా? అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
 • పసిపిల్లలా చూసుకున్నాడు…
  ” ఏడేళ్ల క్రితం ప్రణయ్‌ పరిచయం అయ్యాడు. అప్పటి నుండి నాన్న నుండి వేధింపులు మొదలయ్యాయి. కింది కులాల వారితో కలవద్దు అని హెచ్చరించేవాడు. నాకు ప్రణయ్‌ వ్యక్తిత్వం నచ్చింది. నన్ను పసిపాపలా చూసుకునేవాడు. నా తిండి,ఇష్టాలన్నీ అతడికి బాగా తెలుసు. నాకు నెలలు నిండుతున్నాయని తెలిసి ఎంతో సున్నితంగా చూసుకునేవాడు..” అని ఉధ్వేగంగా చెప్పింది అమృత.
  జీవితాంతం అత్తవారి ఇంట్లోనే ఉండి బిడ్డను పెంచుకుంటాను.అస్సలు పుట్టింటి వైపు వెళ్లను అని అమె ధీమాగా చెప్పారు.
  ఇటీవల కుల దురహంకారం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 24ఏళ్ల ప్రణయ్‌ పెరుమాళ్ల కుమార్‌ ఎస్సీమాల సామాజిక వర్గానికి చెందిన వారు. 21 ఏళ్ల అమృత వర్షిణి సామాజిక వర్గం వైశ్య. ఇద్దరు ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాక జరిగిన పరిణామాలివి.
   కూతురిలా చూసుకుంటాం
premalatha

premalatha

” హైస్కూల్‌ లోనే వారిద్దరు స్నేహంగా ఉండేవారు. అది ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరే వరకు కొనసాగింది. వీరి ప్రేమ గురించి తెలిసి అమ్మాయిని చాలా సార్లు కొట్టారట.ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చాక మేం ఏమీ చేయలేక పోయాం. మీ కూతురిని ఒప్పించి తీసుకెళ్లండి,మాకెలాంటి ఇబ్బంది లేదు అని మారుతీ రావుకి అనేక సార్లు చెప్పాం. చివరికి నా కొడుకుని పొట్టన పెట్టుకున్నారు. అమృత ఇపుడు మా దగ్గరే ఉంటానంటుంది. ఆమెను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం.” అని ప్రణయ్‌ తల్లి ప్రేమలత,తండ్రి బాలస్వామి అన్నారు. ప్రేమలత ఇంటర్‌ వరకు చదివారు, బాలస్వామి స్ధానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో గత 30 ఏండ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు.వారికి ఇద్దరు కుమారులు, చిన్న కొడుకు అజయ్‌ ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్నాడు. అన్న మరణం తెలిసి ఇంటికి చేరుకున్నాడు.
ప్రణయ్‌తమ్ముడు ఏమంటాడు?
‘ చీమకు కూడా అపకారం చేయని వాడు ప్రణయ్‌. వాడి ప్రేమపెళ్లి,గొడవలు తెలిసి, విదేశాల్లో ఉద్యోగాలు చూసుకొని వచ్చేయమని చెప్పాను. ఆ ప్రయత్నాలు జరుగుతున్నపుడే ఈ ఘోరం జరిగిపోయింది.కుల పిచ్చితో అన్నను చంపించిన వారు జీవితాంతం జైల్లో ఉంటారు. కానీ, అన్న దొరకడు కదా?” అని ఆవేదనగా అన్నాడు ఆజయ్‌.
పోలీసు అధికారులు హెచ్చరించినా…
ప్రణయ్‌కి హాని జరిగే ప్రమాదం ఉందని పోలీసు అధికారులకు వారు ముందే చెప్పారట కదా… తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పాలనా యంత్రాంగం విఫలం అయిందా? అని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డిని మేం ప్రశ్నించగా…
” ప్రణయ్‌ కుటుంబ సభ్యులు పోలీసుఉన్నతాధికారులను కలిసింది వాస్తవమే. జిల్లాకు ఇటీవల వచ్చిన కొత్త ఎస్పీ కూడా వీళ్ల ఫైల్‌ చూసి, అమృత తండ్రిని పిలిపించి హెచ్చరించడం జరిగింది. అపుడాయన వారితో మంచిగానే ఉంటూ, మారినట్టు కనిపించాడు. నటిస్తూనే, ఈ ఘాతగానికి పాల్పడ్డాడు.” అన్నారు.

ప్రణయ్‌ చట్టం రావాలి…

” ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పురావాలి. మన భారత సంస్కృతిలోనే కులాంతర వివాహాలున్నాయి, వశిష్టుడు అరంధతిని,శ్రీకృష్ణుడు జాంబవతిని,వెంకటేశ్వరస్వామి,బీబీనాంచారమ్మను వివాహం చేసుకున్నారు. మన ఇతిహాసాలు తెలియని మూర్ఖుల వల్ల ప్రణయ్‌లాంటి వారు బలి అవుతున్నారు. కులతత్వం పోవాలంటే, అంబేద్కర్‌,ఫూలే ఆలోచన విధానాలను సమాజంలోకి తీసుకెళ్లి, అభ్యుద భావాలున్న వారంతా కలిసి ఒక సాంస్కృతిక విప్లవం తేవాలి. కుల అహంకారాన్ని తలకెక్కించుకుని కుల మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరూ ఈ హత్యకు బాధ్యులే, నిర్బయ చట్టం లాగే ప్రణయ్‌ చట్టం రావాలి. దానిని కఠినంగా అమలు చేయాలి.” అని అంటారు మాజీ జస్టిస్‌ చంద్రకుమార్‌.
అమృతకు అండగా ‘యువవారధి’
సోషల్‌ మీడియా ద్వారా పోరాటం చేస్తానంటున్న అమృతకు అండగా ‘యువవారధి’స్వచ్చంద సంస్ద ప్రతినిధి మయూర్‌ వెబ్‌సైట్‌ని రూపొందించి,సాంకేతిక సాయం అందించడానికి ముందుకు రావడమే కాక, ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని చెప్పారు. ఈ నెల 17వ తేదీన ఆ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

ఆకర్షణే ప్రేమకు మొదటి మెట్టు….
‘ఆపొజిట్ సెక్స్ లోని అందం కావొచ్చు. వ్యక్తిత్వం కావొచ్చు. ప్రతిభ కావొచ్చు. కళ కావొచ్చు. అలా ఆవేలబుల్ పది మందిలో ఒకరిద్దరు పరిచయం అవుతారు. ఆ ఒకరిద్దరిలో ఎవరో ఒకరితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. అలా కొనసాగి అది అలవాటుగా. ఆపైన ప్రేమగా మారుతుంది.
టీనేజీలో హార్మోన్స్ ప్రభావం వలన ఆకర్షణ పుట్టడం సహజం.ఆ మోహాలలో కొట్టుకుపోయి చదువులు పాడుచేసుకుని. జీవితాలు ఎక్కడ చెడిపోతాయో అని తల్లిదండ్రులు ఖంగారు పడటంతో అర్థం ఉంది. కాకపోతే అలా జరగకుండా ఉండటానికి బాధ్యత కూడా తల్లిదండ్రులదే.  పరస్పరం గౌరవించుకోవడం. అభిమానించుకోవడం ఎలాగో తెలియజెప్ప గలగాలి. ఆకర్షణని ప్రేమ స్థాయికి తీసుకెళ్లడానికి స్నేహం ఒక మార్గం అని చెప్పగలిగి ఉండాలి. అదే నిజమైన పెంపకం అంటే.
“షోడషే వర్షే ప్రాప్తెషు పుత్రం మిత్రవదాత్” అంటారు. పదహారేళ్ళ వస్తే పుత్రుడ్ని మిత్రుడిలాగా చూడమని అర్థం. మరి అంతగా ప్రేమిస్తారు తల్లిదండ్రులు అనే ఇళ్లలో ఇంకెంత స్నేహంగా ఉండాలి. అధికారాన్ని ప్రేమ అనుకునే పెద్దలు. ఇంట్లో సరైన ప్రేమ గౌరవం ఆప్యాయత లేని పిల్లలు బయటే ప్రేమని వెతుకుతారు. ప్రేమ ఈ వయసులోనే కలగాలి అని ఎవరూ ప్రకృతిని శాసించలేరు. కాబట్టి మనం మారితే పిల్లల్ని కూడా బాధ్యతగా ఉండేలా మనం బాధ్యత తీసుకోవచ్చు.’  –  కత్తి మహేష్ , నటుడు , సినీ విమర్శకుడు.

Shyammohan/ruralmedia/Nirmaan

Share.

Leave A Reply