A letter from the Editor

a letter to the common man

సామాన్యుడికో సంపాదకుడి లేఖ
…………………………………………….
ముగ్గురు ఎడిటర్ల దగ్గర పని చేశాను. కానీ నండూరి గారిని ఎప్పటికీ మరువ లేను. సాహిత్యం,జర్నలిజమే లోకంగా బతికి జర్నలిజం విలువలను కాపాడిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి నండూరి గారితో కలిసి కొంత కాలం ప్రయాణం చేయడం నా అల్పమైన జీవితంలో ఒక మలుపు.
ఉదయం పత్రిక నుండి విజయవాడ ఆంధ్రజ్యోతి వీక్లీలో ఆర్టిస్టుగా చేరిన రోజులవి. వీపీసింగ్‌, ఎన్టీఆర్‌మీద ప్రతీవారం వీక్లీలో కార్టూన్లు వేయించుకునే వారు. వీక్లీతో పాటు డైలీ, జ్యోతిచిత్ర,వనితా జ్యోతి,బాలజ్యోతి కూడా ఒకే ఫ్లోర్‌లో వరుసగా ఉండేవి.
ఒక సాయంత్రం పని పూర్తి చేసుకొని రూమ్‌కి బయలు దేరుతుంటే, డైలీ ఎడిటర్‌ నండూరి గారు పిలిచారు. ‘ఇక నుండి మీరు డైలీకి కార్టూన్లు వేయాలి. రేపటి నుండి మా సెక్షన్‌ లో కూర్చోండి. ఎన్టీఆర్‌ విశ్వామిత్ర సినిమా తీస్తున్నారు. దీని మీద రేపు కార్టూను కావాలి’ అన్నారు. ఆ రాత్రి నవరంగ్‌లో ‘గాడ్స్‌మస్ట్‌బీ క్రేజీ ‘ చూసి పడుకున్నాను.
ఆ మర్నాడు రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్‌ మేనకతో డ్యూయెట్‌ పాడుకుంటున్న కార్టూను వేశాను. అదే నా ఫస్ట్‌ మల్టీకలర్‌ ఫ్రంట్‌ పేజీ కార్టూను. ఆ తరువాత రోజూ ‘లోకం తీరు’ పాకెట్‌ కార్టూన్లతో సహా ఎన్నో కార్టూన్లు …
మూడేళ్ల పాటు ఆయన తో కలిసి పనిచేశాను.మంచి మనిషి, ఎవరినీ నొప్పించకుండా పనిచేయించుకునేవారు.పాత్రికేయ విలువలు తెలిసిన వారు. పొలిటికల్‌ కార్టూనిస్టుగా నాకు లైఫ్‌ ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ మీద నేను వేసిన కార్టూన్‌ వల్ల ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయనప్పటికీ నా మీద ఎన్నడూ కోప్పడ లేదు. (ఆ కేసు ముచ్చట మరోసారి). బాపు, రమణలు ఆయనకు మంచి దోస్తులు. ఆయన ఓ సారి మద్రాసు వెళ్లినపుడు బాపు గారు నాకు కొన్ని సూచనలు చేస్తూ ఒక లెటర్‌ ఇస్తే చాలా జాగ్రత్తగా తెచ్చి ‘బాపు గారి గిఫ్ట్‌’ అంటూ నా కిచ్చారు.

nanduri letter to shyammohan

nanduri letter to shyammohan

ఆయన రిటైర్‌ అయి ఐవీఆర్‌ గారు ఎడిటర్‌ అయినపుడు హైదరాబాద్‌ రావాల్సి వచ్చింది. ఆ తరువాత ఒక సారి విజయవాడ వెళ్లినపుడు ఏలూరు రోడ్‌లో ఒక బుక్‌ షాపు దగ్గర కనిపించి పలకరించారు. అదే ఆయన్ని ఆఖరి సారి చూడటం.
మామూలుగా పత్రికల్లో లెటర్‌ టు ఎడిటర్‌ లాంటి శీర్షికలు ఉంటాయి. కానీ నాలాంటి సామాన్యుడికి ఒక గొప్ప సంపాదకుడు రాసిన లేఖ ఇది
ఇంతకంటే గొప్ప అవార్డు ఏముంటుంది?
నండూరి రామమోహన రావు గారి వర్ధంతి (2011) సెప్టెంబర్‌ 3.

-Shyammohan.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *